Abn logo
May 17 2021 @ 00:54AM

కమ్ముకుంటున్న కారుమబ్బులు

బెంబేలెత్తుతున్న అన్నదాతలు
భయంగుప్పిట్లో ధాన్యం కొనుగోళ్లు
ఇప్పటికే భారీగా నష్టపోయిన రైతులు
తడిసిన ధాన్యం కొనుగోలుపై స్పష్టత కరువు
పరిహారంపై దక్కని భరోసా

నిర్మల్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వైపరీత్యం క్రమంగా అన్నదాతను బెంబెలెత్తిస్తోంది. కొద్దిరోజుల క్రితం కురిసిన వడగళ్లతో కూడిన అకాలవర్షాలు అన్నదాతను తీవ్ర నష్టాల పాలు చేశాయి. పంట కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యమంతా తడిసి ముద్ద కాగా, కోత దశలో ఉన్న పంటలన్నీ నాశనమయ్యాయి. అధికారులు తూతూ మంత్రం గా పంట నష్టంపై సర్వే జరిపి చేతులు దులుపుకున్నారే తప్ప, ఇప్పటి వరకు పరిహారంపై స్పష్టతఇవ్వలేదు. ఇలా వడగళ్ల వర్షంతో నష్టపోయిన రైతులు ఇప్పుడిప్పుడే తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టే ప్రయత్నాలు చేస్తుండ గానే మళ్లీ కమ్ముకుంటున్న కారుమబ్బులు అన్నదాతను హడలెత్తిస్తున్నా యి. శనివారం రాత్రి నుంచి ఆదివారం రోజంతా ఆకాశాన్ని నల్లని మేఘా లు కమ్మేశాయి. మధ్య మధ్యలో గాలిదుమారం సైతం గందరగోళాన్ని సృష్టించింది. అయితే ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పెద్దఎత్తున రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోళ్ల కోసం నిల్వ చేశారు. ఒకే సారి పెద్దమొత్తంలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలిరావడం, కొనుగో లు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించకపోతుండడంతో అనూహ్యం గా వర్షం కురిస్తే ఆ ధాన్యమంతా మరోసారి తడిసి ముద్దకావాల్సిందేనన్న ఆందోళన రైతులను వెంటాడుతోంది. ప్రతియేటా జూన్‌ రెండో వారంలో నైరుతి రుతు పవనాలు ప్రవేశించడం, అలాగే వడగాలులతో పాటు వర్షా లు కురవడం సహజం. కాని ఈసారి ఓవైపు మండుటెండలు ఉధృతంగా కొనసాగుతూనే అకాల వర్షాలు సైతం బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గత రెండు, మూడు రోజుల నుంచి వాతావరణంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు అన్నదాతను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. అటు వ్యవసాయాధికారులను హడలెత్తిస్తున్నాయి. ఇప్పటికి చాలా పెద్దమొత్తం లో వరిధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమాలపై రైతులు ఓ వైపు ఆందోళనలు చేస్తున్నారు. తరుగు పేరిట మోసాలకు పాల్పడడమే కాకుండా బస్తాకు 40 కిలోల ధాన్యాన్ని తూకం వేయాల్సి ఉండగా, దీనికి అదనంగా రెండు కిలోలు ఎక్కువ తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అలాగే రైస్‌మిల్లర్లు మిలాఖతై కోతల పేరి ట రైతులకు శఠగోపం పెడుతున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయితే చాలామంది రైతు లు ఇంకా తమ పొలాల్లోని ధాన్యాన్ని కోసి అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలోనే వాతావరణంలో మార్పు లు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయంటున్నారు.
వెంటాడుతున్న ప్రకృతి
ప్రతియేడు ప్రకృతి అన్నదాతను వెంటా
డుతూ వేధిస్తోంది. అప్పటి వరకు ఎండ వేడమితో ఉన్న వాతావరణం, అంతలోనే మారిపోయి ఒక్కసారిగా వడగళ్లవర్షం, ఈదురుగాలుల బీభత్సా న్ని సృష్టిస్తూ ప్రకృతి రైతులపై కన్నెర్రజేస్తోంది. వాతావరణం అనుకూలం గా ఉందన్న ధీమాతో రైతులు కళ్లాల్లో ధాన్యాన్ని ఆరబెడుతుండడం, అలాగే కొనుగోలు కేంద్రాల్లో సైతం ధాన్యాన్ని ఆరబెట్టి దానిని అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే పొలాల్లోని కోత దశలో ఉన్న ధాన్యాన్ని కూడా యంత్రాలతో కోయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలోనే అకాల వర్షాలు రైతు ల ఆశలను వమ్ము చేస్తున్నాయి. రెండు, మూడు గంటలు మాత్రమే కురుస్తున్న ఈ అకాల వర్షాలు.. ఆరబెట్టిన ధాన్యానంతా తడిసి ముద్ద చేస్తున్నాయి. జిల్లాలో ఎక్కడా కూడా అనుకూలమైన ఫ్లాంట్‌ ఫాంలు లేని కారణంగా రైతులు నేలపైనే పంటలను ఆరబెడుతుంటారు. వర్షం సమయంలో ధాన్యం కుప్పలపై టార్పాలిన్‌లు కప్పినప్పటికీ భూమి తడిసిపోయి ధాన్యమంతా ముద్దయిపోతోంది. ఇలా ప్రతియేటా వానాకాలం, యాసంగి సీజన్‌లలో రైతులు ప్రకృతి వైపరీత్యాల బారిన పడి తల్లడిల్లిపోతుండడం రివాజుగా మారింది.
పరిహారంపై పట్టింపు ఏదీ?
ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం సరైన పరిహారం అందించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇటు ప్రజాప్రతినిధులు, అటు సంబంధిత వ్యవసాయాధికారులు నష్టపోయిన పంటలను సందర్శించి రైతులకు పరిహారంపై హమీలు ఇస్తున్నారు. అలాగే అధికారులు సైతం హుటాహూటిన సర్వేలు జరపడం, పంట నష్టాన్ని ఖరారు చేసి ఆ నివేదికలను సర్కారుకు పంపడం ఓ తంతుగా మా రిందన్న విమర్శలున్నాయి. కేవలం రైతులను ఊరట పర్చేందుకే ఈ పంట నష్టం సర్వేలు నిర్వహిస్తున్నారన్న వాదనలున్నాయి. పరిహారాన్ని ఖరారు చేసి ప్రకటించే అంశం సర్కారు చేతిలో ఉన్నందున సంబంధిత అధికారులు రైతులకు దీనిపై ఏం సమాధానం ఇవ్వలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇటీవల సారంగాపూర్‌, ఖానాపూర్‌, ముథోల్‌, తదితర మండలాల్లో కురిసిన వడగళ్ల వర్షాలతో వరిధాన్యం పంటకు పెద్దఎత్తున నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా అధికారులు హుటాహుటిన సర్వేలు జరిపి నివేదికలను సర్కారుకు పంపించారు. ఇప్పటి వరకు పరిహారం విషయంలో సర్కారు నుంచి స్పష్టతమైన ప్రకటన రాకపోవడం పట్ల రైతు లు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.
తడిసిన ధాన్యంపై స్పష్టత కరువు
తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సంబంధిత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని తరిగి ఆరబెట్టి తేమ శాతం తగ్గిన తరువాత తీసుకురావాలని సూచిస్తున్నారు. ఎండిన ధాన్యం కొనుగోళ్లలోనే అనేక కొర్రీలు సృష్టిస్తున్న అధికారు లు తడిసిన ధాన్యం విషయంలో పూర్తి నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారంటున్నారు. ఇప్పటికే తప్పా, తాలి పేరిట కొనుగోలు కేంద్రాల్లో ఆటంకాలు కలిగిస్తున్న నిర్వాహకులు.. తడిసిన ధాన్యం విషయంలో మరిన్ని ఇబ్బం దులు సృష్టించవచ్చంటున్నారు. తప్పా, తాలి పేరుతోనే రైస్‌మిల్లర్లు సైతం ధాన్యంలో కోతలను కొనసాగిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా సాధారణంగా ధాన్యం తడిసిపోతే దాని నాణ్యత కూడా లోపిస్తుందన్నది బహిరంగ సత్యమే. ప్రకృతి వైపరీత్యం కారణంగా ధాన్యం నాణ్యత కోల్పోతోందని, తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. తడిసిన ధాన్యనంతా కొనుగోలు చేయాలని, నాణ్యతపై పేచీలు సృష్టించొద్దంటూ అన్నదాతలు కోరుతున్నారు. కాని అధికారులు మాత్రం తడిసిన ధాన్యం విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. తడిసిన ధాన్యాన్ని తప్పనిసరిగా కొనుగోలు చేయాలన్న ఆదేశాలు సైతం సర్కారు నుంచి జారీ కాకపోవడం అన్నదాతను ఆందోళనకు గురి చేస్తోంది. కేవలం ప్రజాప్రతినిధులు మాత్రమే తడిసిన ఽధాన్యాన్ని కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులకు సూచిస్తున్నప్పటికీ నిబంధనల పేరిట అధికారులు తడిసిన ఽధాన్యం కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారంటున్నారు.
మార్కెట్లోనే రెండు ఎకరాల ధాన్యం నీటిపాలు : కాల్వ నరేష్‌,
మలక్‌చించోలి గ్రామం, సారంగాపూర్‌ మండలం

రెండు ఎకరాల్లో వరి వేశా. ఆరుగాలం శ్రమించి పండించి, పంటను విక్రయించే సమయంలో ఈదురుగాలులతో కూడిన అకాలవర్షం కురవడంతో మార్కెట్‌లోనే వరి ధాన్యం నీళ్లపాలైంది. పంటల పెట్టుబడికి అప్పు చేశాను. పెట్టుబడులు కూడా రాలేదు. ఈ విషయమై సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి అకాల వర్షానికి నష్టపోయిన వరి ధాన్యం రైతులను ఆదుకోవాలి.

Advertisement