ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

ABN , First Publish Date - 2021-10-17T05:11:23+05:30 IST

బుచ్చిరెడ్డిపాళెంలో శనివారం సుమారు గంటపాటు జోరుగా వర్షం కురిసింది. నాలుగు దిక్కులా ఉరుములు, మెరుపులు బీభత్సం చేశాయి.

ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
జలమయమైన గిరిజనుల గుడిసెలు

గిరిజనుల గుడిసెలు జలమయం

బుచ్చిరెడ్డిపాళెం,అక్టోబరు16: బుచ్చిరెడ్డిపాళెంలో శనివారం సుమారు గంటపాటు జోరుగా వర్షం కురిసింది. నాలుగు దిక్కులా ఉరుములు, మెరుపులు బీభత్సం చేశాయి.  పిడుగులు పడతాయోమోనన్న భయం వెంటాడడంతో వాహన చోదకులు, పాదచారుల ప్రయాణాలు ఎక్కడికక్కడ స్తంభించాయి. బుచ్చిలోని మార్కెట్‌ ఏరియా, గాంధీనగర్‌, శాంతినగర్‌, రామకృష్ణానగర్‌, బేల్దారిపాళెం తదితర ప్రాంతాల్లో రోడ్లపై మురుగు నీరు ప్రవహించింది. నగర పంచాయతీలోని ఇస్కపాళెం  ప్రాంతంలో ఇటుక బట్టీల వద్ద ఉన్న గిరిజనులు  ఉంటున్న గుడిసెలు జలమయమయ్యాయి.

వర్షంతో గిరిజనుల అవస్థలు

 బుచ్చిరెడ్డిపాళెంలో కురిసిన వర్షానికి ఓ ప్రాంతంలో ఇటుక బట్టీల పనితో జీవనం సాగించే గిరిజనుల గుడిసెలను వర్షం నీరు చుట్టేసింది.  మరో గత్యంతరం లేక రాత్రి వరకు ఆ గుడిసెల్లోనే వంట వార్పు చేసుకున్నారు.  దగదర్తి మండలం తురిమెర్ల నుంచి ఓ 5 కుటుంబాల గిరిజనులు బుచ్చి నగర పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ ఇటుక బట్టీల్లో పనిచేసుకునేందుకు వచ్చారు. ఆ ప్రాతంలోనే కర్రపుల్లలు, గోతాలతో గుడిసెలు ఏర్పాటు చేసుకుని పసిబిడ్డలతో కాలంగడుపుతున్నారు. శనివారం వర్షపు నీరు ఆ గుడిసెలను సుమారు మోకాలులోతు వరకు ముంచేసింది.   దీంతో గుడిసెల్లోకి నీరు చేరి నిలువ నీడను కోల్పోయారు. ఈ పరిస్థితి ఆ మార్గంలో వెళ్లే వారి మనసులను కలచివేసింది. ప్రకృతి పరిహాసం-నీటి మడుగులోనే నివాసం అన్నట్టుగా ఆ గిరిజనుల పరిస్థితి తయారైంది. 

కోవూరు : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కోవూరు, దాని పరిసర ప్రాంతంలో శనివారం భారీ వర్షం పడింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశం మేఘావృతం కావడంతో చీకటి అలుముకుంది. కొద్దిసేపు కుండపోత వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని వీధులన్నీ నీటిమయ మయ్యాయి. రెండు రోజులుగా ఉక్కపోతకు గురైన జనం వర్షం వల్ల వాతావరణం చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. వర్షం వల్ల కోవూరు- నెల్లూరు మార్గంలో రాకపోకలు ఆగిపోయాయి.



Updated Date - 2021-10-17T05:11:23+05:30 IST