అమెరికా అధ్యక్ష ఎన్నికలపై కన్నేసిన చైనా, ఇరాన్..!

ABN , First Publish Date - 2020-06-05T22:36:23+05:30 IST

అమెరికాలో త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికలపై డ్రాగన్ దేశం, ఇరాన్ కన్నేశాయా? అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేయడానికి రెండు దేశాలు ప్రయత్నిస్తు

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై కన్నేసిన చైనా, ఇరాన్..!

వాషింగ్టన్: అమెరికాలో త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికలపై డ్రాగన్ దేశం, ఇరాన్ కన్నేశాయా? అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేయడానికి రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయా? అంటే.. తాజాగా గూగుల్ ప్రతినిధి వెల్లడించిన సమాచారాన్ని గమనిస్తే.. అవుననే సమాధానం వస్తుంది. ఇంతకీ గూగుల్ ప్రతినిధి ఏం చెప్పాడనే వివరాల్లోకి వెళితే.. డానాల్డ్ ట్రంప్, జోయ్ బిడెన్ క్యాంపైన్ బృందాలకు సంబంధించిన ఈ-మెయిల్‌లను హ్యాక్ చేయడానికి చైనా, ఇరాన్ దేశాలకు చెందిన హ్యాకర్లు ప్రయత్నించారని గూగుల్ ‘త్రెట్ అనాలసిస్ గ్రూప్’ డైరెక్టర్ షేన్ హంట్లీ పేర్కొన్నారు. చైనాకు చెందిన ‘హర్రికేన్ పాండా’ ట్రంప్ బృందాలకు సంబంధించిన ఈ-మెయిల్‌లను టార్గెట్ చేయగా.. ఇరాన్‌కు చెందిన ‘చార్మింగ్ కిటెన్’ బిడెన్‌ బృందాలను లక్ష్యంగా చేసుకుందని ఆయన వివరించారు. రకరకాల మాల్వేర్‌లను ఈ బృందాల్లోని సభ్యుల ఎలక్ట్రానిక్ పరికరాలు, కంప్యూటర్‌లలో చొప్పించి.. హ్యాక్ చేయడానికి ప్రయత్నించి, విఫలమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇరు బృందాల అభ్యర్థులకు.. నిబంధనల ప్రకారం హెచ్చరికలు పంపినట్లు ఆయన తెలిపారు. కాగా.. దీనిపై ట్రంప్ బృందం స్పందించింది. ‘సైబర్ దాడులపై మేము అప్రమత్తంగానే ఉన్నాం’ అంటూ ప్రకటించింది. అయితే జోయ్ బిడెన్ బృందం మాత్రం దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. 


Updated Date - 2020-06-05T22:36:23+05:30 IST