'ఆచార్య'తో పాటే 'శభాష్ మిథు' కూడా..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కొరటాల శివ రూపొందిస్తున్న సినిమా 'ఆచార్య'. కాజల్ అగర్వాల్ చిరుకు జోడిగా, పూజా హెగ్డే చరణ్‌కు జోడీగా నటించారు. సంగీత, రెజీనా కసాండ్ర ప్రత్యేక గీతాలలో అలరించబోతున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పరచిన 'ఆచార్య' సినిమా ప్రమోషన్స్ త్వరలో మొదలుపెట్టబోతున్నారు. 2022, ఫిబ్రవరి 4న ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. అయితే, ఇదే రోజు తాప్సీ పన్ను నటిస్తున్న బాలీవుడ్ సినిమా 'శభాష్ మిథు' రిలీజ్ కాబోతోంది. తాజాగా మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ప్రముఖ భారత మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఇందులో తాప్సీ టైటిల్ రోల్ పోషిస్తోంది. డిసెంబర్ 3వ తేదీన మిథాలీ రాజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా 'శభాష్ మిథు' సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. 2022 ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్టు కన్‌ఫర్మ్ చేస్తూ మిథాలీ గెటప్‌లో ఉన్న తాప్సి ఇంటెన్స్ పోస్టర్‌ను వదిలారు. 'ఆచార్య'తో ఈ సినిమా పోటీ కాకపోయినా ఆ ప్రభావం మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఎంతో కొంత ఉండే అవకాశాలున్నాయి. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో. 


Advertisement