హెచ్‌-1బీ వీసాదారుల్లో గుబులు..!

ABN , First Publish Date - 2020-03-31T20:24:01+05:30 IST

ప్ర‌పంచ దేశాలు క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని బిక్కు బిక్కుమంటున్నాయి.

హెచ్‌-1బీ వీసాదారుల్లో గుబులు..!

వాషింగ్ట‌న్ డీసీ: ప్ర‌పంచ దేశాలు క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని బిక్కు బిక్కుమంటున్నాయి. ఈ మ‌హ‌మ్మారి ప్ర‌భావం రాబోయే రోజుల్లో ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ప‌డ‌డంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే ప్ర‌మాదం ఏర్ప‌డింది. ఇక అగ్ర‌రాజ్యం అమెరికాపై క‌రోనా ప్ర‌భావం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. యూఎస్‌లో 'కొవిడ్‌-19' రోజురోజుకీ శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా 1,64,359 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 3,173 మంది మృతి చెందారు. న్యూయార్క్ అయితే క‌రోనా కేంద్ర స్థానంగా మారిపోయింది. దీంతో అమెరికాలోని అనేక సంస్థ‌లు తీవ్ర‌ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొబోతున్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ న‌ష్టాన్ని పూడ్చుకునేందుకు ఆయా కంపెనీలు రాబోయే రోజుల్లో అధిక మొత్తంలో ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్నాయ‌ని ఆర్థిక నిపుణుల అభిప్రాయం.


ఈ నేప‌థ్యంలోనే అగ్ర‌రాజ్యంలో ఉంటున్న హెచ్‌-1బీ వీసాదారుల్లో ఆందోళ‌న నెలకొంది. ఇక వీరిలో అత్యధికులు భార‌త ఐటీ నిపుణులే అనే విష‌యం తెలిసిందే. ఒక‌వేళ ఉద్యోగాలు కోల్పోయిన త‌మ‌ను యూఎస్‌లోనే నివాసం ఉండేందుకు ఉన్న గ‌డువు నిబంధ‌న‌ల‌ను సవ‌రించాల‌ని హెచ్‌-1బీ వీసాదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న 60 రోజుల గ‌డువును 180 రోజుల‌కు పెంచాల‌ని వారు కోరుతున్నారు. ఈ మేర‌కు వేలాది మంది హెచ్‌-1బీ వీసాదారులు ట్రంప్ స‌ర్కార్‌కు లేఖ రాసేందుకు సిద్ధ‌మ‌య్యారు. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు 20వేల మంది సంతకాల‌ను  సేక‌రించారు. మ‌రో 80వేల మంది ఈ లేఖ‌పై సంతకాలు చేస్తే వైట్‌హౌజ్ దీనిని ప‌రిశీలిస్తుంది. ఇక అమెరికాలో నెల‌కొన్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా దేశ వ్యాప్తంగా సుమారు 4.7 కోట్ల మంది ఉపాధి కోల్పోయే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఈ ప్ర‌భావం హెచ్‌-1బీ వీసాదారులపైనే అధికంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని ఓ అధ్య‌య‌నం అభిప్రాయ‌ప‌డింది.    

Updated Date - 2020-03-31T20:24:01+05:30 IST