హెచ్‌-1బీ వీసాల రద్దుతో రూ.1,200 కోట్ల భారం

ABN , First Publish Date - 2020-07-07T14:16:18+05:30 IST

హెచ్‌-1బీ వీసాల రద్దుతో భారత ఐటీ కంపెనీలపై రూ.1,200 కోట్ల వరకు భారం పడనుంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీల లాభాలూ 0.25 శాతం నుంచి 0.30 శాతం వరకు తగ్గనున్నాయని రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ అంచనా వేస్తోంది.

హెచ్‌-1బీ వీసాల రద్దుతో రూ.1,200 కోట్ల భారం

ఐటీ కంపెనీల లాభాలకూ గండి

క్రిసిల్‌ వెల్లడి 

ముంబై: హెచ్‌-1బీ వీసాల రద్దుతో భారత ఐటీ కంపెనీలపై రూ.1,200 కోట్ల వరకు భారం పడనుంది. దీంతో ప్రస్తుత ఆర్థిక  సంవత్సరంలో ఈ కంపెనీల లాభాలూ 0.25 శాతం నుంచి 0.30 శాతం వరకు తగ్గనున్నాయని రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ అంచనా వేస్తోంది. మరోవైపు కొవిడ్‌-19 కారణంగానూ ఈ ఏడాది భారత ఐటీ కంపెనీల లాభాలకు 23 శాతం గండిపడనుంది. హెచ్‌-1బీ వీసాల రద్దు భారం దీనికి అదనమని క్రిసిల్‌ వెల్లడించింది. 


కరోనాతో తలెత్తిన నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనేందుకు.. డిసెంబరు వరకు కొత్త హెచ్‌-1బీ, ఎల్‌1 వీసాల జారీ నిలిపివేస్తున్నట్టు ట్రంప్‌ సర్కారు గత నెలలో ప్రకటించింది. దీంతో ఈ వీసాలపై భారత ఐటీ నిపుణుల్ని అమెరికా తీసుకెళ్లి, అక్కడి తమ ఐటీ యూనిట్లలో పని చేయించుకునే అవకాశం భారత ఐటీ కంపెనీలకు పోయింది. అవసరమైన ఉద్యోగుల్ని 25 శాతం అఽధిక జీతాలతో స్థానికులతోనే భర్తీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. 


జాగ్రత్త పడిన కంపెనీలు 

ట్రంప్‌ సర్కార్‌ అధికారం చేపట్టినప్పటి నుంచే అమెరికాలోని భారత ఐటీ కంపెనీలు జాగ్రత్త పడ్డాయి. హెచ్‌-1బీ వీసాల తిరస్కరణ రేటు పెరిగి పోవడంతో స్థానికుల్నే పెద్ద సంఖ్యలో ఉద్యోగాల్లోకి తీసుకోవడం ప్రారంభించాయి. దీంతో ప్రస్తుతం అమెరికాలోని టాప్‌-5 భారత ఐటీ కంపెనీల ఉద్యోగుల్లో హెచ్‌-1 బీ వీసాలపై వచ్చిన వారు 5 శాతానికి మించి లేరని క్రిసిల్‌ పేర్కొంది. 2017లో 30-35 శాతం ఉన్న స్థానికుల నియామకం ప్రస్తుతం 60 శాతానికి  చేరింది. 

Updated Date - 2020-07-07T14:16:18+05:30 IST