TS News: జింఖానా గ్రౌండ్స్‌లో తొక్కిసలాట

ABN , First Publish Date - 2022-09-22T18:20:11+05:30 IST

భారత్‌ - ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్ వద్ద ఫ్యాక్స్ ఎగబడటంతో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది.

TS News: జింఖానా గ్రౌండ్స్‌లో తొక్కిసలాట

హైదరాబాద్: భారత్‌ - ఆస్ట్రేలియా మ్యాచ్‌ (India - Australia match) టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్ వద్ద ఫ్యాన్స్ ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. గురువారం ఉదయం టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు జింఖానా గ్రౌండ్స్‌ (Gymkhana Grounds)కు చేరుకున్నారు. మూడు వేల టికెట్ల కోసం 30వేల మందికి పైగా అభిమానులు తరలివచ్చారు. మహిళలు కూడా టికెట్స్‌ కోసం క్యూలైన్లలో నిలబడ్డారు. అయితే అంచనాలకు మించి అభిమానులు తరలిరావడంతో పాటు.. టికెట్ల కోసం ఎగబడటంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. గేటు వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ స్పృహకోల్పోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అలాగే తొక్కిలసలాటలో పలువురు అభిమానులు గాయపడగా... పోలీసులు కూడా స్వల్పంగా గాయపడ్డారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపు చేసేందుకు అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.


నిన్న కూడా ఇదే పరిస్థితి....

కాగా.. నిన్నటి నుంచి జింఖానా గ్రౌండ్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్‌ - ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్ల కోసం ఈనెల 15వ తేదీన ‘పేటీఎం ఇన్‌సైడర్‌’ యాప్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకున్నవారికి బుధవారం నుంచి సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో బార్‌కోడ్‌ టిక్కెట్లు ఇస్తామని మొబైల్‌కు, ఈ-మెయిల్స్‌కు సమాచారం వచ్చింది. దీంతో టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వారంతా జింఖానాకు పోటెత్తారు. అయితే ఉదయం 10 గంటల నుంచే టిక్కెట్లు ఇస్తామని చెప్పి, 12 గంటలకు కూడా కౌంటర్లు తెరవకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జింఖానా గ్రౌండ్స్ గేట్లు, గోడలు దూకి ఆఫీసు కార్యాలయం, మైదానంలోకి దూసుకెళ్లారు. టికెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు... రెండో దశ టిక్కెట్లను కూడా విక్రయిస్తారంటూ ప్రచారం జరగడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి కాసేపటికి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. 

Updated Date - 2022-09-22T18:20:11+05:30 IST