Abn logo
Aug 5 2020 @ 00:00AM

జిమ్‌ జాగ్రత్తలివి!

కరోనా దెబ్బతో చాలాకాలం తర్వాత లాక్‌డౌన్‌ 3.0లో భాగంగా నేటి నుంచి ఫిట్‌నెస్‌ సెంటర్లు తిరిగి తెరుచుకొంటున్నాయి. నిర్వాహకులకు కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు చేసింది. మరి జిమ్‌కు వెళ్లేవారు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? నిపుణుల సూచనలు మీ కోసం... 


మీరు జిమ్‌కు వెళ్లే ముందు నిర్వాహకులకు ఫోన్‌ చేసి, పనివేళలు కనుక్కోండి. లోపలికి అడుగుపెట్టే ప్రతి ఒక్కరి టెంపరేచర్‌ చూస్తున్నారా? జిమ్‌ పరికరాలు ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తున్నారా? భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లున్నాయా? అంతా ఒకేసారి గుమికూడకుండా షెడ్యూల్‌ వేశారా? వంటివి ఆరా తీయండి. నిర్వాహకుల వివరణపై మీకు ఏ మాత్రం సంతృప్తి లేకపోయినా జిమ్‌కు వెళ్లకపోవడమే మంచిది. 


గాలి... వెలుతురు: సరైన గాలి, వెలుతురు ధారాళంగా లేని ఇండోర్‌ ప్రదేశాల్లో అన్ని రకాల బ్యాక్టీరియాలు, వైరస్‌లు తిష్టవేస్తాయి. ముఖ్యంగా వర్కవుట్‌ చేసేటప్పుడు వచ్చే స్వేదం లోపల తేమ, వేడిని పెంచుతుంది. పైగా దుర్వాసనలు వెదజల్లుతాయి. కనుక జిమ్‌లో సరైన వెంటిలేషన్‌ ఉందో లేదో గమనించండి. బేస్‌మెంట్లలో ఉన్న వ్యాయామశాలలకు దూరంగా ఉండడం ఉత్తమం. 

దూరం దూరంగా: కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రధానమైనది భౌతిక దూరం. జిమ్‌లో ఉన్నతసేపూ కచ్చితంగా 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించండి. కరోనా వ్యాప్తికి అవకాశమున్న వాటిల్లో ఫిట్‌నెస్‌ సెంటర్లు కూడా ఉన్నాయని ఓ సర్వేలో తేలింది. సో... రద్దీ సమయాల్లో జిమ్‌కు వెళ్లకండి. 

బ్యాగ్‌లో ఇవి ఉండాలి: యోగా మ్యాట్‌, శానిటైజర్‌, ఉతికిన టవళ్లు, మాస్క్‌లు, డిజ్‌ఇన్‌ఫెక్టెంట్‌ వైప్స్‌, వాటర్‌ బాటిల్‌ వంటివన్నీ జిమ్‌ బ్యాగ్‌లో తప్పనిసరిగా ఉంచుకోండి. జిమ్‌కు వెళ్లివచ్చినప్పుడల్లా వాటినే ఉపయోగించండి. తద్వారా పరిసరాలు కూడా కలుషితం కాకుండా ఉంటాయి. వాటిని ఎవరితోనూ షేర్‌ చేసుకోకండి. 

పరికరాలు పరిశుభ్రంగా: ఫిట్‌నెస్‌ సెంటర్లలో ‘షేరింగ్‌’ సాధారణం. వెయిట్‌ ప్లేట్స్‌, బార్బెల్స్‌, డంబెల్స్‌, ట్రెడ్‌మిల్స్‌, సైక్లింగ్‌ ఇతర మిషన్ల వంటి పరికరాలను అందరూ ఉపయోగిస్తుంటారు. కనుక మీరు ఉపయోగించే ముందు వాటిని తప్పనిసరిగా శానిటైజ్‌ చేయమనండి. పరికరాలు వాడిన తరువాత చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోండి. చేతులతో ముఖాన్ని తాకవద్దు. ఫోమ్‌ రోలర్స్‌, ఎక్సర్‌సైజ్‌ బాల్స్‌ ముట్టుకోకండి. లాకర్లు, ఛేంజింగ్‌ రూమ్‌లు వాడకండి. బ్యాక్టీరియా చేతికి అంటకుండా జిమ్‌ గ్లౌజ్‌లు వేసుకోండి. 

ఆరోగ్యంగా ఉంటేనే..: మీరు పూర్తి ఆరోగ్యంతో ఉంటేనే జిమ్‌కు వెళ్లండి. జలుబు, కొద్దిపాటి జ్వరం, దగ్గు లాంటి లక్షణాలుంటే ఆరోగ్యం కుదుటపడేవరకు ఇంటికే పరిమితమవ్వండి. వ్యాయామశాలల్లో ఒకరి నుంచి ఒకరికి ఇన్‌ఫెక్షన్‌ సులువుగా సోకుతుంది. ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించండి. తక్షణమే ‘ఆరోగ్యసేతు’ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి. లేదంటే జిమ్‌లోకి ఎంట్రీ ఉండదు. 

మాస్క్‌లు మానేయండి: చాలామంది వాకింగ్‌, జాగింగ్‌కు వెళ్లేటప్పుడు మాస్క్‌లు ధరిస్తున్నారు. కొందరైతే మాస్క్‌లు వేసుకొనే వర్కవుట్స్‌ కూడా చేస్తున్నారు. ఇది శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు. ఏదిఏమైనా జిమ్‌ చేసేటప్పుడు మాస్క్‌ ధరించాలా వద్దా! అనే దానిపై వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Advertisement
Advertisement
Advertisement