మరో మసీదును వదులుకోం: Owaisi

ABN , First Publish Date - 2022-05-14T22:01:46+05:30 IST

జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సూటిగా...

మరో మసీదును వదులుకోం: Owaisi

అహ్మదాబాద్: జ్ఞానవాపి మసీదు (Gyanvapi mosque) వ్యవహారంపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asadudding Owaisi) సూటిగా స్పందించారు. బాబ్రీ మసీదు అంశంతో జ్ఞానవాపి మసీదు అంశాన్ని ముడిపెట్టి ''మరో మసీదును వదులుకునేందుకు ఒప్పుకోం'' అని వ్యాఖ్యానించారు. జ్ఞానవాపి సర్వేను ఏ ఆధారాలతో చేపడుతున్నారని ప్రధాన మంత్రి మోదీని ప్రశ్నించారు. ప్రధానమంత్రి మౌనం వీడాలని, మసీదులు, ఆలయాల స్వభావాన్ని, స్థితిగతులను మార్చరాదంటూ 1991లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆయన సమాధానం చెప్పాలని  శనివారంనాడిక్కడ జరిగిన బహిరంగ సభలో ఒవైసీ డిమాండ్ చేశారు.


విపక్ష పార్టీలపై కూడా ఒవైసీ విమర్శలు ఎక్కుపెట్టారు. పార్టీలు హిందుత్వ వాదాన్ని ప్రదర్శించేందుకు పోటీపడుతున్నాయని ఆరోపించారు. జ్ఞానవాపి సర్వేపై కాంగ్రెస్ కానీ, ఆప్ కానీ తమ వాణి వినిపించనందు వల్లే సర్వేకు వ్యతిరేకంగా తాను ఆ పని చేస్తున్నానని చెప్పారు.


కాగా, వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్ వీడియోగ్రఫీ సర్వే శనివారంనాడు భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య తిరిగి మొదలైంది. సర్వే పనులు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఆదివారం కూడా ఇది కొనసాగుతుందని, ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని, అన్ని పార్టీలు సహకరిస్తున్నాయని వారణాసి పోలీస్ కమిషనర్ ఎ.సతీష్ గణేష్ తెలిపారు. స్థానిక కోర్టు ఆదేశించిన బృందానికి ప్రస్తుతం తాము సహకరిస్తున్నట్టు మసీదు మేనేజిమెంట్ కమిటీ తెలిపింది. మసీదు కమిటీ అభ్యంతరాల మేరకు గత వారం సర్వే పనులు నిలిచిపోయాయి. మసీదు ఆవరణలో వీడియోగ్రఫీకి అడ్వకేట్ కమిషనర్‌ను అనుమతించ వద్దని, ఆయన పక్షపాతంతో వ్యవహరించే అవకాశం ఉన్నందున వేరేవారని నియమించాలని కమిటీ కోరింది. కాగా, గురువారంనాడు జిల్లా కోర్టు తన ఆదేశాల్లో, సర్వే కోసం కాంప్లెక్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో  చెవితాళాలు (Keys) అందుబాటులో లేకపోతే తాళంకప్పలను (locks) పగులగొట్టాలని పేర్కొంది.

Read more