Gyanvapi case: కొత్త పిటిషన్‌ Fast track courtకు బదిలీ

ABN , First Publish Date - 2022-05-25T21:15:10+05:30 IST

స్థానిక జ్ఞానవాపి మసీదులోకి ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలని కోరుతూ బుధవారంనాడు కొత్తగా దాఖలైన పిటిషన్‌ను..

Gyanvapi case: కొత్త పిటిషన్‌ Fast track courtకు బదిలీ

వారణాసి: స్థానిక జ్ఞానవాపి మసీదు (Gyanvapi Mosque) లోకి ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలని కోరుతూ బుధవారంనాడు కొత్తగా దాఖలైన పిటిషన్‌ను సివిల్ జడ్జి రవికుమార్ దివాకర్ కోర్టు నుంచి ఫాస్ట్ ట్రాక్ కోర్టు (Fast track court)కు బదిలీ చేశారు. విశ్వ వేదిక్ సంస్థాన్ సంఘ్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఈనెల 30న ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ జరుపనుంది. జ్ఞానవాపి మసీదులోకి ముస్లింల ప్రవేశాన్ని నిలిపివేయడం, దానిని హిందువులకు అప్పగించడంతో సహా మూడు డిమాండ్లు తాము చేస్తున్నట్టు పిటిషనర్ కిరణ్ సింగ్ మీడియాకు తెలిపారు.


జ్ఞానవాపి కేసు..

జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లోని మా శ్రింగార్ గౌర్ స్థల్‌లో పూజ, రోజువారీ దర్శనానికి అనుమతించాలని కోరుతూ 2021 ఆగస్టులో వారణాసిలోని స్థానిక కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై వారణాసి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) రవికుమార్ దివాకర్ గత ఏప్రిల్‌లో ఆదేశాలు జారీ చేశారు. మేలో జ్ఞానవాసి మసీదు కాంప్లెక్స్‌లో వీడియోగ్రఫీ సర్వేకు ఆయన ఆదేశాలిచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు మే 6,7 తేదీల్లో మసీదులో వీడియోగ్రఫీ సర్వే నిర్వహించారు. కోర్టు ఆదేశాలపై ముస్లిం వర్గాలు నిరసనలకు దిగడంలో వీడియోగ్రఫీ సర్వే ప్రక్రియను అప్పటికి నిలివేశారు. తిరిగి మే 17వ తేదీలోగా వీడియో సర్వే ముగించాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో, కోర్టు నియమించిన టీమ్‌తో సర్వే పనులు పూర్తి చేశారు.


మూడు రోజుల సర్వేలో పాత గుడి శిథిలాలు, త్రిశూలం, ఢమరుకం, శేషనాగ్, విరిగిన పలు హిందూ దేవతల విగ్రహాలు వంటివి బయటపడ్డాయని అంటున్నారు. మసీదులోని వాజుఖానాలో శివలింగం బయటపడిందని హిందూ వర్గాలు చెబుతున్నాయి. ముస్లిం వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మే 20న ఇరువర్గాల వాదనలను విన్న సుప్రీంకోర్టు హిందూ భక్తులు దాఖలు చేసిన సివిల్ సూట్‌లను సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) నుంచి వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేసింది. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మసీదు కమిటీ పిటిషన్‌పై ప్రాధాన్యతను బట్టి జిల్లా జడ్జి నిర్ణయం తీసుకుంటారని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. శివలింగం కనిపించిన ప్రాంతానికి రక్షణ కల్పించడం, ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్పూ మే 17న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. హిందూ భక్తులు వేసిన సివిల్ సూట్‌పై వారణాసి జిల్లా జడ్జి నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. అదేవిధంగా, మసీదులో నమాజ్ చేసుకునే ముస్లింలకు తగిన ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

Updated Date - 2022-05-25T21:15:10+05:30 IST