హోరాహోరీ పోరు

ABN , First Publish Date - 2021-04-23T07:00:02+05:30 IST

హోరాహోరీ పోరు

హోరాహోరీ పోరు
గీసుగొండ మండలం జాన్‌పాక వద్ద ర్యాలీ నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

జీడబ్ల్యూఎంసీలో 66 డివిజన్లకు 502 మంది పోటీ

తేటతెల్లమైన పోటీ ముఖచిత్రం

టీఆర్‌ఎస్‌కు అనేక చోట్ల రెబెల్స్‌ బెడద

28వ డివిజన్‌లో ఇండిపెండెంట్‌కు కాంగ్రెస్‌ మద్దతు

అన్నిచోట్లా తొడగొడుతున్న బీజేపీ

బరిలో 238 మంది స్వతంత్ర అభ్యర్థులు


వరంగల్‌ సిటీ

జీడబ్ల్యూఎంసీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఖరారయ్యారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, వామపక్షాలు, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల జాబితాలు వెల్లడయ్యాయి. ఎన్నికల రణరంగ ముఖచిత్రం తేటతెల్లమైంది. ఆయా పార్టీల ముఖ్యనేతలు బీ-ఫామ్‌ల ను అందజేశారు. మొత్తం 66 డివిజన్లకు గాను టీఆర్‌ఎస్‌, బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ 64 స్థానాల్లో, సీపీఐ,సీపీఎం 16, టీడీపీ 13 ఇతర పార్టీలు 39, స్వతంత్రులు 238 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. 66 డివిజన్లకు గాను తుది బరిలో 502 మంది నిలిచారు. బరి నుంచి తప్పుకున్న వారిలో  బీజేపీకి చెందిన అభ్యర్థులు 111, కాంగ్రెస్‌ 68, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు 299, టీడీపీ నుంచి ఇద్దరు, వామపక్షాల అభ్యర్థులు ఇద్దరు, ఇతర పార్టీలకు చెందిన వారు 9 మంది ఉండగా, స్వతంత్రులు 109 మంది ఉన్నారు. 

ఇక టికెట్‌ సాధించిన అభ్యర్థుల్లో ఆనందం వెల్లివిరియగా, దక్కని వారిలో అసంతృప్తి జ్వలాలు రగిలాయి. టికెట్‌ ఆశించి దక్కకపోవడంతో టీఆర్‌ఎస్‌ నాయకురాలు శోభారాణి ఆందోళనకు దిగారు. హన్మకొండ అదాలత్‌ సెంటర్‌లో బిల్డింగ్‌ పైకి ఎక్కి పెట్రోల్‌ బాటిల్‌ పట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన తెలిపారు. చివరకు స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.  55వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ దక్కని గడ్డం శ్రీదేవి, ఆకుల కవిత బరి నుంచి తప్పుకోకపోవడం గులాబీ నేతలకు తలనొప్పిగా మారింది. 66వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చంద్రమోహన్‌కు టికెట్‌ దాదాపు ఖరారైంది. కానీ ఆయనకు కరోనా సోకడంతో ఆఖరి నిమిషంలో  ఆ స్థానంలో పావుశెట్టి శ్రీధర్‌కు టికెట్‌ ఇచ్చారు. వరంగల్‌ తూర్పులో 40వ డివిజన్‌ నుంచి టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ గడ్డం యుగంధర్‌ రగడ సృష్టించారు. 40వ డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌ పొందిన మరుపల్ల రవి నుంచి బీ-ఫామ్‌ లాక్కునే యత్నం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన రవి కుటుంబ సభులు, అనుచరులు యుగంధర్‌కు దేహశుద్ధి చేశారు.

కాంగ్రె్‌సలో హైరానా 

కాంగ్రె్‌సపార్టీ మూడు రోజుల పాటు సుదీర్ఘ కసరత్తు తర్వాత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే వరంగల్‌ తూర్పులో 28వ డివిజన్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురికావడంతో ఆ స్థానంలో ఇండిపెండెంట్‌కు మద్దతివ్వాలని నిర్ణయించారు. దీంతో 66 డివిజన్లకుగాను 65 డివిజన్ల అభ్యర్థులతో కాంగ్రెస్‌ జాబితా విడుదలైంది. 29వ డివిజన్‌లో గుండు సుధారాణి టీఆర్‌ఎస్‌ నుంచి బరిలో ఉన్నారు. ఆమెకు గట్టి పోటీనివ్వాలనే తలంపుతో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరిపింది. అధికార పక్షం నుంచి ఒత్తిళ్ల కారణంగా అభ్యర్థులు బరిలో నిలవడానికి సాహసించకపోవడంతో చివరకు సిరిమల్లె కవితను ఎంపిక చేసి బరిలో నిలిపారు. 


రెబల్స్‌ తలనొప్పి

బుజ్జగింపుల పర్వంలో ససేమిరా అన్న అభ్యర్థులతో పార్టీలకు ముప్పు వాటిల్లనుంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సలోనే రెబల్స్‌ అధికంగా ఉండడంతో ఆ పార్టీల నేతలకు పరీక్షగా మారింది. టీఆర్‌ఎ్‌సలో బీ-ఫామ్‌ అందజేసే ప్రక్రియ ఉత్కంఠకు గురిచేసింది. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ కొందరికి బీ-ఫామ్‌లు అందజేసి వారితోనే అధికారులకు సమర్పించారు. మరికొందరివి తానే స్వయంగా అందజేశారు. ఈ క్రమంలో బీ-ఫామ్‌ తమకే దక్కుతుందని ఎదురుచూసిన ఆశావహులు.. ఒకవైపు, వీరి నుంచి తప్పించుకొని బీ-ఫామ్‌లు దక్కినవారు అధికారుల వద్దకు చేరే వరకు జరిగిన సీన్లు ఉత్కంఠ రేకెత్తించాయి. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థులు కూడా ఇదే టెన్షన్‌తో బీ-ఫామ్‌లు సమర్పించారు. బీ-ఫామ్‌లు దక్కనివారు అసంతృప్తి వెల్లగక్కారు. కాంగ్రె్‌సలో సైతం రెబల్స్‌ బెడద అధికంగానే ఉంది. జిల్లా నాయకులు కనీసం ఉపసంహరణ కోసం విజ్ఞప్తులు కూడా చేయకపోవడంతో బరి నుంచి తమకు తాముగా తప్పుకునేందుకు ఇష్టపడని వారు రెబల్స్‌గా మారారు.  


సిట్టింగ్‌లకు షాక్‌

టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌లలో అత్యధికులకు టికెట్లు దక్కలేదు. దీంతో వారంతా షాక్‌లో ఉన్నారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలోని సిట్టింగ్‌ కార్పొరేటర్లలో కావేటి కవిత, కేడల పద్మ, ఎలగం లీలావతి, రిజ్వానా షమీమ్‌, ఓని స్వర్ణలత భాస్కర్‌  తిరిగి టికెట్లు దక్కించుకున్నారు.  రిజర్వేషన్ల మార్పు ఫలితంగా సిట్టింగ్‌ స్థానాల్లో వారి కుటుంబ సభ్యులుగా టికెట్‌ పొందిన వారిలో సురే్‌షజోషి, మరుపల్ల రవి, సోమిశెట్టి ప్రవీణ్‌కుమార్‌, బైరబోయిన ఉమాయాదవ్‌, వస్కుల బాబు, జారతి రమేష్‌, దిడ్డి కుమారస్వామి ఉన్నారు. తాజా మాజీల్లో మిగతా వారికి భంగపాటు ఎదురైంది.  

వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో తాజా మాజీ కార్పొరేటర్లు తాడిశెట్టి విద్యాసాగర్‌, వేముల శ్రీనివాస్‌, నల్లా స్వరూపారాణి, ఖాజా సిరాజోద్దీన్‌, రంజిత్‌రావు టికెట్‌ దక్కించుకున్నారు. తాజా మాజీల స్థానంలో కుటుంబ సభ్యులు టిక్కెట్లు పొందిన వారిలో దాస్యం అభినవ్‌భాస్కర్‌, మాడిశెట్టి శివశంకర్‌, గుండు సుధారాణి, షర్తాజ్‌ బేగం ఉన్నారు. మిగతా తాజా మాజీలకు దక్కలేదు. వారి స్థానంలో కుటుంబ సభ్యులకూ దక్కలేదు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో తాజా మాజీలు బానోతు కల్పన, సిరంగి సునిల్‌, తూర్పాటి సులోచనకు మళ్లీ టికెట్‌ దక్కింది. తాజా మాజీల స్థానంలో టికెట్లు పొందిన కుటుంబ సభ్యులలో గుగులోతు దివ్యవాణి, జక్కుల రజిత ఉన్నారు. మిగతా వారికి దక్కలేదు. పరకాల నియోజకవర్గంలో తాజా మాజీ కార్పొరేటర్‌ స్థానంలో సుంకరి మనీషాకు టికెట్‌ లభించింది. మిగతా వారు కొత్తగా టికెట్లు పొందిన వారే.. 

Updated Date - 2021-04-23T07:00:02+05:30 IST