వార్డు వలంటీర్‌ల సమావేశంపై టీడీపీ పిర్యాదు

ABN , First Publish Date - 2021-03-07T06:47:26+05:30 IST

జాతీయ రహదారికి ఆనుకొని షీలానగర్‌ వద్ద వున్న కల్యాణ మండపంలో శనివారం 69వ వార్డు పరిధిలోని వార్డు వలంటీర్‌ల సమావేశం నిర్వహించడం వివాదాస్పదంగా మారింది.

వార్డు వలంటీర్‌ల సమావేశంపై టీడీపీ పిర్యాదు
వార్డు వలంటీర్ల నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు

అక్కిరెడ్డిపాలెం, మార్చి 6: జాతీయ రహదారికి ఆనుకొని షీలానగర్‌ వద్ద వున్న కల్యాణ మండపంలో శనివారం 69వ వార్డు పరిధిలోని వార్డు వలంటీర్‌ల సమావేశం నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. వార్డు వైసీపీ నాయకులు వార్డు వలంటీర్‌లతో సమావేశం నిర్వహిస్తున్నారని టీడీపీ అభ్యర్థి కాకి గోవిందరెడ్డి గాజువాక జోన్‌ ఎన్నికల అధికారికి, గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం  తన మద్దతుదారులతో కల్యాణ మండపం ఎదుట నిరసన చేపట్టారు. దీంతో గాజువాక పోలీసులతోపాటు ఎన్నికల క్రైమ్‌ స్క్వాడ్‌ కల్యాణ మండపం 

వద్దకు చేరుకొని సమావేశమైన వలంటీర్‌లను ప్రశ్నించారు. వేతనాలతోపాటు ఇతర సమస్యలపై తాము సమావేశమయ్యామని పలువురు వలంటీర్‌లు తెలిపారు. 

అయితే డిమ్‌ లైట్‌ల మధ్య సమావేశం నిర్వహించుకోవడమేమిటని పోలీసులు అనుమానం వ్యక్తపరచగా కల్యాణమండపం యజమాని లైట్లు వినియోగించవద్దని కోరడంతో కొద్దిపాటి వెలుగులో  తాము సమావేశమయ్యామని  వివరించారు. ఈ సమావేశానికి ఏ రాజకీయ పార్టీ నాయకులు హాజరుకాలేదని,  తమ వద్ద ఎటువంటి పార్టీ జెండాలు లేవని వారు స్పష్టం చేయడంతో పోలీసులు వెనుదిరిగారు. అనంతరం వలంటీర్లు కూడా అక్కడనుంచి వెళ్లిపోవడంతో వివాదం సద్దుమణిగింది. వార్డు వలంటీర్లు రహస్యంగా సమావేశం కావడంపై అధికారులకు  ఫిర్యాదు చేయనున్నామని కాకి గోవిందరెడ్డి తెలిపారు.

Updated Date - 2021-03-07T06:47:26+05:30 IST