Abn logo
Sep 26 2021 @ 00:32AM

స్థాయీ సంఘం నిర్ణయాలతో జీవీఎంసీ ఆదాయానిక గండి

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మూర్తియాదవ్‌

డిప్యూటీ మేయర్‌ కారుకు అద్దె చెల్లించడం సిగ్గుచేటు

అధికార పార్టీ కార్పొరేటర్ల తీరు దారుణం 

జనసేన పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ మూర్తియాదవ్‌ 

మద్దిలపాలెం, సెప్టెంబరు 25: నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని పాలకవర్గాన్ని ప్రజలు గెలిపిస్తే ఆ జనం ఆదాయాన్నే లూటీ చేసే విధంగా స్థాయీ సంఘం పనిచేస్తోందని జనసేన ఫ్లోర్‌ లీడర్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపించారు. 22వ వార్డు జనసేన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన స్థాయీ సంఘం దానికి గండికొట్టేలా నిర్ణయాలు తీసుకోవడం అన్యాయమన్నారు. కారు ప్రొవిజన్‌ లేని డిప్యూటీ మేయర్‌కు రూ.నెలకు రూ.70 వేల అద్దె చెల్లించడానికి ఆమోదం తెలపడం దుర్మార్గమన్నారు. సొంత కారులో జీవీఎంసీకి వచ్చే డిప్యూటీ మేయర్‌ అద్దె కారు కింద బిల్లు పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. ఒక డిప్యూటీ మేయర్‌కు కారు అద్దె చెల్లిస్తే రెండో డిప్యూటీ మేయర్‌, ఫ్లోర్‌ లీడర్లు, స్టాండింగ్‌ కమిటీ చైర్మన్లు కూడా తమకు కారు అద్దెలు కావాలని డిమాండ్‌ చేసే అవకాశం ఉందన్నారు. రాత్రికి రాత్రి 113 దుకాణాలు తెరిచేందుకు స్థాయీ సంఘం అత్యుత్సాహం చూపడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. రోజుకు రూ.25 వేలు అద్దె వచ్చే షాదీఖానా, మాధవస్వామి కళ్యాణ మండపాన్ని రూ.ఐదు వేలకు కుదించడం శోచనీయమన్నారు. జీవీఎంసీ అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా దుకాణాల వేలం నిర్వహించి పాత అద్దెలు కంటే నాలుగు నుంచి 20 రెట్లు ఆదాయం పెంచితే, అధికార పార్టీ కార్పొరేటర్లు అద్దెలను తగ్గించి లీజుదారులకు కట్టబెట్టేందుకు స్థాయీ సంఘాన్ని వాడుకుంటున్నారని మూర్తి యాదవ్‌ ఆరోపించారు.