Abn logo
Nov 29 2020 @ 00:54AM

డంపర్‌బిన్లపై వెనుకడుగు

ఒకేసారి తొలగిస్తే సమస్య తలెత్తే అవకాశం

జీవీఎంసీ కమిషనర్‌తో అధికారులు

దశల వారీగా అమలు చేయాలని నిర్ణయం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి నగరంలో డంపర్‌బిన్లను తొలగించాలన్న నిర్ణయంపై గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) వెనక్కి తగ్గినట్టు తెలిసింది. ఒకేసారి డంపర్‌, కాంపాక్టర్‌ బిన్లను తొలగిస్తే సమస్య తలెత్తే అవకాశం వుందని ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన నేపథ్యంలో అధికారులతో కమిషనర్‌ చర్చించినట్టు తెలిసింది. ఒకేసారి కాకుండా దశల వారీగా డంపర్‌బిన్లను తొలగిస్తే...ప్రజలు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అలవాటుపడతారని అధికారులు అభిప్రాయపడడంతో ఒకటి నుంచి డంపర్‌బిన్లన్నిటినీ తొలగించాలన్న నిర్ణయాన్ని కమిషనర్‌ ఉపసంహరించుకున్నట్టు తెలిసింది. 


ప్రతిరోజూ చెత్తను సేకరించేందుకు నగరాన్ని 1965 మైక్రోపాకెట్స్‌గా విభజించారు. ఒక్కో పాకెట్‌లో 300 నుంచి 350 ఇళ్లు ఉంటాయి. చెత్త ఊడ్చడం, సేకరించడం కోసం 6,104 మంది కార్మికులు పనిచేస్తుండగా, 1,158 పుష్‌కార్టులు, కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకున్న 269 టాటాఏస్‌లతో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేస్తున్నారు. సిబ్బంది వెళ్లిపోయిన తర్వాత ఇళ్లలో ఉత్పత్తి అయిన చెత్తతోపాటు సిబ్బంది వచ్చినప్పుడు ఇంట్లో లేనివారెవరైనా తమ ఇంట్లోని చెత్తను రోడ్లపై పడేయకుండా ప్రతి వీధిలోనూ 407 డంపర్‌బిన్లు, 1009 కాంపాక్టర్‌ బిన్లను ఏర్పాటుచేశారు. జోన్లలో ఉత్పత్తి అయ్యే చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించే వరకూ నిల్వ చేసేందుకు ఆరు మినీ సీవేజ్‌ ఫారాలను ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి డంపింగ్‌యార్డుకు చెత్తను తరలించేందుకు 54 లారీలు, పది టిప్పర్‌లు పనిచేస్తున్నాయి. అయితే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ ర్యాంకు పొందాలంటే స్వచ్ఛ భారత్‌ మార్గదర్శకాల ప్రకారం నగరంలో ఎక్కడా డంపర్‌బిన్‌ లేదా కాంపాక్టర్‌ బిన్‌ కనిపించకూడదు. ఇళ్లలో ఉత్పత్తి అయిన చెత్తను ఇంటింటికీ వాహనాలతోనే వెళ్లి తడి-పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి, సమీపంలోని సూయిజ్‌ ఫారానికి తరలించాలి. దీని ప్రకారం జీవీఎంసీ పరిధిలో 407 డంపర్‌బిన్లు, 1,009 కాంపాక్టర్‌ బిన్లను తీసేయాల్సి ఉంటుంది. అలాచేస్తే ఇప్పుడు ఆయా బిన్లలో వేస్తున్న చెత్తను ప్రజలు ఎక్కడ వేయాలనే ప్రశ్నకు జీవీఎంసీ అధికారుల వద్ద సరైనా సమాధానం లేదు. డంపర్‌బిన్లు తీసేస్తే ప్రజలు చెత్తను రోడ్లపైనా లేదంటే సమీపంలోని గెడ్డల్లో పడేయడం ఖాయం. డంపర్లు తీసేస్తే దానికి తగ్గట్టు ప్రత్యామ్నాయం చూపించడంపై అధికారులు సమాయత్తం కాకుండానే...ఒక నిర్ణయానికి ఎలా వస్తారంటూ పలువురు ప్రశ్నించడం మొదలెట్టారు. జీవీఎంసీ అధికారులు కూడా అదే విషయాన్ని కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. దీంతో వచ్చే నెల ఒకటి నుంచి ఒకేసారి డంపర్లను పూర్తిగా తొలగించకుండా, ఒకవీధిలో రెండు డంపర్లు ఉంటే అందులో ఒకటి తొలగించి, మరొకటి వుంచడం మంచిదని కమిషనర్‌ అభిప్రాయపడినట్టు తెలిసింది. డంపర్‌బిన్లను రోజుకు ఒకసారి క్లీన్‌ చేస్తుంటే పూర్తిగా చెత్తతో నిండిపోయి ఉంటున్నందున, రెండు డంపర్లలో ఒకటి తొలగించేస్తే మిగిలినది సాయంత్రానికే నిండిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి, డంపర్లను ఉదయం మాత్రమే కాకుండా రాత్రిపూట కూడా ఖాళీ చేయించేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రజారోగ్య విభాగం, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులను కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన ఆదేశించినట్టు తెలిసింది. ఏదిఏమైనా డిసెంబరు ఒకటి నుంచి నగరంలోని బిన్లు అన్నింటినీ తొలగించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement