మహా రగడ

ABN , First Publish Date - 2021-06-24T05:10:39+05:30 IST

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కౌన్సిల్‌ సమావేశం వాడివేడిగా జరిగింది.

మహా రగడ
ఆస్తి పన్ను పెంపు, చెత్తపై యూజర్‌ చార్జీలను ఉపసంహరించుకోవాలని మేయర్‌ పోడియం వద్ద బైఠాయించి నినాదాలు చేస్తున్న విపక్షాల కార్పొరేటర్లు

ఆస్తి పన్ను పెంపు, చెత్తపై పన్నుకు విపక్షాల అభ్యంతరం

రెండింటినీ ఉపసంహరించుకోవాలని పట్టు

పోడియం ముందు బైఠాయింపు

సభ నుంచి వెళ్లిపోయిన మేయర్‌

వాడేవేడిగా జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశం

కరోనా వేళ పన్నుల భారం సరికాదు: ఎమ్మెల్సీ మాధవ్‌

పన్నుల విధింపు ఉపసంహరించుకోవాలి: ఎమ్మెల్సీ దువ్వారపు 

దుకాణాలు, కల్యాణ మండపాల లీజుపై ఆల్‌పార్టీ కమిటీకి విపక్షాల డిమాండ్‌

138 అంశాలకు కౌన్సిల్‌ ఆమోదం


విశాఖపట్నం, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి):


మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కౌన్సిల్‌ సమావేశం వాడివేడిగా జరిగింది. ప్రధాన కార్యాలయంలో మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన బుధవారం కౌన్సిల్‌ సమావేశం జరిగింది. కార్పొరేటర్‌ వానపల్లి రవికుమార్‌, మాజీ మేయర్‌ సబ్బం హరి, వైద్యుల మృతికి సంతాప తీర్మానంతో సభ ప్రారంభమైంది. అనంతరం అజెండాలోని అంశాలపై చర్చ ప్రారంభిస్తున్నట్టు మేయర్‌ ప్రకటించారు. ఇంతలో టీడీపీ కార్పొరేటర్‌ కాకి గోవిందరెడ్డి లేచి కరోనా సమయంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశేషమైన సేవలందించారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. దీనికి సీపీఎం కార్పొరేటర్‌ గంగారావు అభ్యంతరం తెలిపారు. అజెండాపై చర్చించకుండా వైసీపీ నేతలకు భజన కార్యక్రమం ప్రారంభించడం సరికాదన్నారు. దీంతో కాకి గోవిందరెడ్డి స్పందిస్తూ...‘మీరెలా వచ్చారో...మాకందరికీ తెలుసు..కూర్చోండి’ అన్నారు. దీనికి ప్రతిస్పందనగా గంగారావు ‘మీరేంటో...మీ బాగోతమేమిటో మాకు తెలుసు. మేము తలచుకుంటే కుంభకోణాలను బయటపెట్టి ఐదు నిమిషాల్లో జైల్లో పెట్టిస్తాం...చూసుకుందామా...’ అని సవాల్‌ చేశారు. ఆ సమయంలో మేయర్‌ కలుగజేసుకుని అజెండాలోకి వెళదామనడంతో వివాదం సర్దుమణిగింది. అనంతరం టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాస్‌, కార్పొరేటర్‌ పల్లా శ్రీనివాసరావు, జనసేన ఫ్లోర్‌ లీడర్‌ పీతల మూర్తియాదవ్‌ లేచి ఆస్తిపన్ను సవరణ చట్టం అజెండాలో చేర్చనందున జీరో అవర్‌లో చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని మేయర్‌ను కోరారు. దీనికి అధికార పార్టీ కార్పొరేటర్లు అభ్యంతరం తెలపడంతో విపక్ష సభ్యులంతా ప్ల కార్డులతో మేయర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో మేయర్‌ తన సీటు నుంచి లేచి బయటకు వెళ్లిపోయారు. కొంతసేపటి తర్వాత విపక్ష ఫ్లోర్‌ లీడర్లను తన ఛాంబర్‌కు పిలిచి మాట్లాడారు. భోజన సమయానికి గంట ముందు జీరో అవర్‌కు అవకాశం ఇస్తానని హామీ ఇవ్వడంతో తిరిగి సభ ప్రారంభమైంది. 


ఆప్కోస్‌ ఉద్యోగుల కొనసాగింపుపై రగడ


అర్ధగంట తర్వాత తిరిగి ప్రారంభమైన సభలో అజెండాపై చర్చ ప్రారంభించారు. ఏపీ అవుట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులను మరో ఏడాది కొనసాగించే అంశంపై తగిన సమాచారం ఇవ్వాలని మేయర్‌ను విపక్ష సభ్యులు కోరారు. అన్ని అంశాలను ఒకేసారి పెట్టడంలో ఏదో మతలబు వుందనే అనుమానం వున్నందున విడివిడిగా చర్చ జరపాలని టీడీపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ గాడు చిన్నికుమారి కోరారు. జనసేన ఫ్లోర్‌ లీడర్‌ మూర్తియాదవ్‌, టీడీపీ కార్పొరేటర్‌ పల్లా శ్రీనివాసరావు, సీపీఎం ఫ్లోర్‌ లీడర్‌ గంగారావు, సీపీఐ కార్పొరేటర్‌ స్టాలిన్‌ మాట్లాడుతూ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల భర్తీకి అనుసరించిన విధానాలు లోపభూయిష్టంగా వున్నాయని ఆరోపించారు. దీనికి వైసీపీ కార్పొరేటర్లు అడ్డుచెప్పడమే కాకుండా నిరాధారమైన ఆరోపణలతో సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఆప్కోస్‌లో 200 మందిని అడ్డగోలుగా నియమించారని మూర్తియాదవ్‌ ఆరోపించారు. ఒకే పనిచేస్తున్న వారికి వేర్వేరుగా జీతాలు ఇస్తున్నారని, ఇది చట్టవిరుద్ధం కాబట్టి, తప్పులను సవరించి అందరికీ ఒకే వేతనం ఇవ్వాలని గంగారావు సూచించారు. దీనికి కమిషనర్‌ సృజన సమాధానం ఇస్తూ ఆప్కోస్‌లో గత ఏడాదికాలంగా పనిచేస్తున్న వారినే కొనసాగించేందుకు కౌన్సిల్‌ ఆమోదానికి పెట్టామని, ఇటీవల కాలంలో కొత్త నియామకాలు జరగలేదని, ఒకవేళ కొత్తవారిని నియమించాలనుకున్నా దానికి కచ్చితంగా విధివిధానాలు పాటించాల్సి వుంటుందని వివరించారు. సభ్యుల కోరిక మేరకు జోన్ల వారీగా పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వివరాలను చీఫ్‌ ఇంజనీర్‌ రవిశంకర్‌రాజు అందజేశారు. వేతనాల్లో వ్యత్యాసం వున్నట్టు తమ దృష్టికి రాలేదని, దీనిపై పరిశీలించి తేడా వుంటే సరిచేస్తామని హామీ ఇచ్చారు.


బాల్యం కేంద్రాలను అంగన్వాడీలకు అప్పగింతపై సభ్యులు అభ్యంతరం


జీవీఎంసీ పరిధిలోని 24 బాల్యం కేంద్రాలను అంగన్వాడీ కేంద్రాలకు అప్పగించే తీర్మానంపై విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కార్పొరేటర్లకు కనీస సమాచారం ఇవ్వకుండా బాల్యం కేంద్రాలను మూసేయడం దారుణమని సీపీఎం కార్పొరేటర్‌ గంగారావు ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై కనీసం మేయర్‌కు కూడా సమాచారం లేదని, తాను చెప్పింది నిజమో..కాదో...మేయరే చెప్పాలని కోరగా, మేయర్‌ నుంచి చిరునవ్వు సమాధానంగా రావడంతో సభ్యులంతా ఒక్కపెట్టున నవ్వారు. వార్డులో జరిగే కార్యక్రమాలకు కచ్చితంగా కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వాలని, కార్పొరేటర్ల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మేయర్‌దేనని టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు అన్నారు. 72వ వార్డు కార్పొరేటర్‌ స్టాలిన్‌ మాట్లాడుతూ తన వార్డులోని బాల్యం కేంద్రాన్ని కొనసాగించాలని స్పష్టంచేశారు. టీడీపీ కార్పొరేటర్‌ శానపతి వసంత మాట్లాడుతూ తమ వార్డులోని బాల్యం కేంద్రాన్ని అంగన్వాడీకి అప్పగించకుండా కొనసానసాగించాలన్నది స్థానికుల కోరిక అని వివరించడంతో కొంతకాలం పాటు బాల్యం కేంద్రాలను కొనసాగిస్తామని ఏడీసీ వి.సన్యాసిరావు తెలిపారు. 


లీజులపై రగడ


జీవీఎంసీకి చెందిన దుకాణాలు, కల్యాణ మండపాలు, మార్కెట్లను లీజుకు ఇచ్చే తీర్మానంపై చర్చ సందర్భంగా సభలో రగడ జరిగింది. గతంలో ఆమోదించిన లీజులకు తాము ఎందుకు ఆమోదం తెలపాలని టీడీపీకి కార్పొరేటర్‌ లేళ్ల కోటేశ్వరరావు ప్రశ్నించారు. ఈ అంశాన్ని జీరో అవర్‌లో చర్చకు పెట్టాలని మేయర్‌ను కోరారు. లీజులకు సంబంధించి ముందురోజు నోటిఫికేషన్‌ ఇచ్చి ఒకరోజు వ్యవధిలో వేలం నిర్వహించడంలో ఏదో మతలబు వుందని సీపీఎం కార్పొరేటర్‌ గంగారావు ఆరోపించారు. కనీసం పది నుంచి 15 రోజులు వ్యవధి ఇస్తే మరికొందరు వేలంలో పాల్గొనేందుకు అవకాశం వుంటుందని గంగారావు అభిప్రాయం వ్యక్తంచేశారు. టీడీపీకి చెందిన కార్పొరేటర్‌ గంధం శ్రీనివాసరావు మాట్లాడుతూ లీజు వ్యవహరంలో అధికారులే బినామీలుగా వ్యవహరిస్తున్నారని, అద్దెల వెనుక వారి పాత్ర వుందని ఆరోపించారు. లీజులపై ఆల్‌ పార్టీ కమిటీ వేసి నివేదిక వచ్చిన తర్వాత కౌన్సిల్‌లో చర్చకు పెట్టాలని జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ సూచించారు. అలా చేస్తే జీవీఎంసీకి రూ.200 కోట్ల వరకూ అదనంగా ఆదాయం వచ్చే అవకాశం వుంటుందని వివరించారు. వైసీపీకి చెందిన కార్పొరేటర్‌ వంశీకృష్ణ శ్రీనివాస్‌ మాట్లాడుతూ షాపులను లీజుకు తీసుకున్నవారు సబ్‌లీజుకు ఇస్తున్నారని ఆరోపించారు. అలాకాకుండా నాయీ బ్రాహ్మణులు, చెప్పులు కుట్టుకునేవారు, గీతకార్మికులు వంటి నిరుపేదలకు రాయితీపై దుకాణాలను కేటాయిస్తే వారికి ఉపయోగంగా వుంటుందని అభిప్రాయపడ్డారు. దీనిపై కమిషనర్‌ సృజన స్పందిస్తూ సబ్‌లీజుకు ఇవ్వడం చట్టవిరుద్ధమని, అలాంటివారి లీజులను రద్దు చేస్తామన్నారు. లీజుల విషయంలో చట్టాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది 25 ఏళ్లుగా షాపులను వదలిపెట్టడం లేదని, అలాంటి వారికి చెక్‌ పెట్టేందుకు మార్కెట్‌ సర్వే చేసి ఆ ప్రాంతంలోని దుకాణాల అద్దెలకు సమానంగా అద్దెలు నిర్ణయిస్తామని వివరించారు. 


నవరత్నాల్లో చెత్తరత్నంగా చే ర్చండి


చెత్తపై యూజర్‌ చార్జీల పేరుతో పన్ను విధించడాన్ని సీపీఎం కార్పొరేటర్‌ గంగారావు తీవ్రంగా విమర్శించారు. యూజర్‌ చార్జీల పేరుతో రూ.120 బిల్లు పట్టుకుని వెళితే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం నవరత్నాలు అమలుచేస్తోందని, దీనిని కూడా చెత్తరత్నంగా అందులో చేర్చి, చెత్తపై విధించే పన్నును ప్రభుత్వమే నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేయడంపై ఆలోచించాలని ఎద్దేవా చేశారు. ఆస్తిపన్నులో ఇప్పటికే చెత్తసేకరించినందుకుగాను పన్ను వసూలు చేస్తున్నారని, కొత్తగా యూజర్‌ చార్జీల పేరుతో రూ.180 కోట్లు భారం మోపడం దారుణమన్నారు. 15వ ఆర్థిక సంఘం సూచనలను పాటించాలని నిబంధనేమీ లేదని, అవసరమైతే ఆ నిధులను వదులుకునేందుకైనా సిద్ధపడాలి తప్పితే ప్రజలపై చెత్తపన్ను రూపంలో భారం మోపడాన్ని పూర్తిగా ఉపసహరించుకోవాలని సూచించారు. 


జీవీఎంసీ ఎన్నికల ఖర్చుపై అభ్యంతరం


జీవీఎంసీ ఎన్నికల సందర్భంగా రూ.13.08 కోట్ల ఖర్చు అయినందున వాటి  బిల్లులు చెల్లింపునకు అనుమతి కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానంపై సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. వాటర్‌బాటిళ్లకు కోటి రూపాయలు ఖర్చుపెట్టడమేమిటని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ప్రశ్నించారు. ఉద్యానవనం విభాగం నుంచి రూ.1.5 లక్షలు ఖర్చు పెట్టడం ఏమిటని టీడీపీ కార్పొరేటర్‌ పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. దీనికి కమిషనర్‌ సమాధానం ఇస్తూ ఎన్నికల సందర్భంగా ఆయా విభాగాల నుంచి ఎన్నికల అవసరాలకే ఖర్చు చేశామని, విభాగాల అవసరాలకు కాదని వివరణ ఇచ్చారు. కాగా ఎన్‌ఎస్‌టీఎల్‌కు రెండున్నరేళ్ల ఆస్తిపన్నును సర్వీస్‌ చార్జీగా మార్చుతూ కొంత మినహాయింపు ఇచ్చే అంశంపై సభ్యులు అభ్యంతరం తెలపడంతో దీనిని పెండింగ్‌లో పెడుతున్నట్టు మేయర్‌ ప్రకటించారు. జూనియర్‌ అసిస్టెంట్‌ల పదోన్నతి అంశాన్ని అజెండాలో చేర్చినప్పటికీ చర్చ నుంచి మినహాయించడంతో మిగిలిన 138 అంశాలను కౌన్సిల్‌ ఆమోదించింది. ఈ సమావేశంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే వాసుపల్లి గ ణేష్‌కుమార్‌, ఎమ్మెల్సీలు పండుల రవీంధ్రబాబు పాల్గొన్నారు. 


ఆస్తి పన్ను పెంపుపై విపక్షాల అభ్యంతరం

ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌


ఆస్తిపన్ను సవరణ చట్టం అంశంపై విపక్షాల డిమాండ్‌ మేరకు జీరో అవర్‌లో చర్చకు మేయర్‌ అనుమతించారు. ఇప్పుడున్న అద్దెప్రాతిపదికన కాకుండా మూల విలువ ప్రకారం పన్ను విధిస్తే ఏటా పెరుగుతుందని టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఆందోళన వ్యక్తంచేశారు. 375 చదరపు అడుగుల ఇంటికి ఆరు నెలలకు రూ.200 మాత్రమే పన్ను వసూలు చేయాల్సి ఉన్నా, ఎక్కడ అమలు జరుగుతోందని సీపీఎం కార్పొరేటర్‌ గంగారావు ప్రశ్నించారు. ఆస్తిపన్ను పెంపు ప్రజలకు గుదిబండేనని బీజేపీ కార్పొరేటర్‌ గంకల కవిత అన్నారు. అసలు కౌన్సిల్‌లో చర్చించకుండా ఆస్తిపన్ను సవరణ చట్టం ముసాయిదా నోటిఫికేషన్‌ ఎలా జారీచేస్తారని, టీడీపీ కార్పొరేటర్‌ పులి లక్ష్మీబాయి ప్రశ్నించారు. నిబంధనలు పాటించకుండా ఇచ్చిన నోటిఫికేషన్‌ను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆస్తి పన్ను పెంపు నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఇందుకు మేయర్‌ హరికుమారి సమాధానమిస్తూ ముసాయిదాపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత...కౌన్సిల్‌లో చర్చిద్దామని, ఆ తరువాత అమలుపై ముందుకువెళతామని హామీ ఇచ్చారు. సభ్యులు కానివారు ప్రతిపాదించే పనులను అజెండాలో చేర్చడం దారుణమని కార్పొరేటర్ల పాలన కంటే అధికారుల పాలనే నడుస్తోందని టీడీపీ కార్పొరేటర్‌ పులి లక్ష్మీబాయి అసంతృప్తి వ్యక్తంచేశారు.


చెత్తపై పన్ను...ఇంటికి రూ.120!

వైసీపీ సభ్యుల మద్దతుతో కౌన్సిల్‌లో ఆమోదం

నిరసనగా తెలుగుదేశం కార్పొరేటర్ల వాకౌట్‌


చెత్తపై యూజర్‌ చార్జీ పేరిట నెలకు రూ.120 పన్ను విధింపు, సకాలంలో చెల్లించనిపక్షంలో 15 శాతం జరిమానా వేయాలన్న అంశంపై చర్చ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. కరోనా సమయంలో ఆస్తిపన్ను పెంపు, చెత్తపై యూజర్‌ చార్జీ పేరుతో ప్రజలపై అదనపు భారం వేయొద్దని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ కోరారు. టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ చెత్త విభజన సక్రమంగా చేసినందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సింది పోయి, పన్ను వేయడం దారుణమన్నారు. ప్రజల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా దీనిని పూర్తిగా ఉపసంహరించుకోవాలని, లేదంటే కనీసం నివాసాలను తప్పించాలని కోరారు. మిగిలిన వాటికి కూడా కొంతకాలం మినహాయింపు ఇవ్వాలని కోరారు. టీడీపీ కార్పొరేటర్‌ అప్పారి శ్రీవిద్య మాట్లాడుతూ వారానికి ఒకసారి చెత్తను సేకరించే కొండవాలు ప్రాంతాల్లో రూ.120 పన్ను వసూలుచేయడం దారుణమన్నారు. చెత్తపై పన్ను విధింపును వ్యతిరేకిస్తూ టీడీపీ, జనసేన, సీపీఎం, సీపీఐ, బీజేపీ కార్పొరేటర్లు ప్ల కార్డులు పట్టుకుని మేయర్‌ పోడియం వద్ద బైఠాయించారు. దీంతో మేయర్‌ ఓటింగ్‌ నిర్వహించగా, అధికార పార్టీకి చెందిన 58 మంది కార్పొరేటర్లతోపాటు ఇండిపెండెంట్లుగా గెలిచిన ముగ్గురు...చెత్తపై యూజర్‌ చార్జీల వసూలుకు అనుకూలంగా చేతులెత్తడంతో ఆ ప్రతిపాదనను కౌన్సిల్‌ ఆమోదించినట్టు మేయర్‌ ప్రకటించారు. దీనికి నిరసనగా టీడీపీ సభ్యులు వాకౌట్‌ చేశారు.



Updated Date - 2021-06-24T05:10:39+05:30 IST