జీవీఎంసీ దిద్దు‘బాట’

ABN , First Publish Date - 2021-06-11T05:14:47+05:30 IST

మానసిక దివ్యాంగుల కోసం నిర్వహిస్తున్న..

జీవీఎంసీ దిద్దు‘బాట’
మానసిక వికలాంగుల పాఠశాల కూల్చివేత (ఫైల్‌ ఫోటో)

మానసిక దివ్యాంగుల పాఠశాల కూల్చివేతపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు చెలరేగడంతో అధికారుల మల్లగుల్లాలు

ప్రభుత్వ పెద్దలు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ప్రచారం

వివాదం పరిష్కారానికి ఆదేశించినట్టు సమాచారం

ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయం చూపేందుకు భవనాల కోసం అన్వేషణ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): మానసిక దివ్యాంగుల కోసం నిర్వహిస్తున్న పాఠశాల (‘హిడెన్‌ స్ప్రౌట్స్)ను కూల్చివేయడంపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతుండడంతో మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) అధికారులు ఇరకాటంలో పడ్డారు. ఇదే విషయమై ప్రభుత్వ పెద్దలు కూడా అసంతృప్తి వ్యక్తం చేయడంతో జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పాఠశాల నిర్వహణకు ప్రత్యామ్నాయ వసతి చూపించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనువైన భవనాల కోసం అన్వేషిస్తున్నారు.


ఎంవీపీ కాలనీ సెక్టార్‌-12లో జీవీఎంసీకి చెందిన స్థలంలో కె.శ్రీనివాసరావు అనే వ్యక్తి మానసిక దివ్యాంగుల కోసం ‘హిడెన్‌ స్ప్రౌట్స్’ పేరుతో 2013 నుంచి పాఠశాలను నిర్వహిస్తున్నారు. నలుగురితో ప్రారంభమైన ఈ పాఠశాలలో ప్రస్తుతం 170 మందికిపైగా చదువుకుంటున్నారు. ఆ స్థలానికి సంబంధించి లీజు గడువు ముగిసిపోయిందంటూ జీవీఎంసీ అధికారులు ఈ నెల ఐదో తేదీన యంత్రాలతో పాఠశాల షెడ్లను నేలమట్టం చేశారు. జీవీఎంసీ అధికారుల చర్యపై ఆ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు విపక్షాల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు నిరసన వ్యక్తంచేశారు. మానసిక దివ్యాంగుల సంక్షేమానికి చేయూత నివ్వాల్సింది పోయి...అడ్డుకోవడం ఏమిటంటూ...సోషల్‌ మీడియాలో కూడా నెటిజన్లు దుమ్మెత్తిపోశారు.


బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వంటివారు స్పందించి పాఠశాలను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేస్తూ వీడియో పోస్ట్‌ చేశారు. పాఠశాల కూల్చివేత వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ప్రభుత్వ పెద్దలు ఇటీవల జీవీఎంసీ ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసి అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఎలాగైనా వివాదాన్ని సమసిపోయేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవైపు పాఠశాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన సాగిస్తుండడం...మరోవైపు వివాదానికి ముగింపు పలకాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు రావడంతో  జీవీఎంసీ ఉన్నతాధికారులకు ఏం చేయాలో దిక్కుతోచని స్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పాఠశాల నిర్వాహకుడు శ్రీనివాసరావును పిలిపించుకుని ప్రత్యామ్నాయాలు సూచించినట్టు తెలిసింది.


అన్ని సదుపాయాలతో కూడిన భవనాన్ని కేటాయిస్తామని చెబుతూ బుధవారం నగరంలోని ఆరు భవనాలను చూపించారు. అయితే శ్రీనివాసరావు మాత్రం తనకు ఇంతవరకూ పాఠశాల నిర్వహించిన ప్రాంతంలోనే కొంత స్థలాన్ని కేటాయిస్తే విద్యార్థులకు అనుకూలంగా వుంటుందని జీవీఎంసీ కమిషనర్‌కు వివరించినట్టు సమాచారం. ఈ వివాదానికి ఎలాంటి ముగింపు లభిస్తుందో తెలియాలంటే ఒకటి, రెండు రోజులపాటు వేచిచూడాల్సిందే.

Updated Date - 2021-06-11T05:14:47+05:30 IST