రూ.4,044.95 కోట్లతో జీవీఎంసీ బడ్జెట్‌

ABN , First Publish Date - 2020-05-22T09:14:25+05:30 IST

మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.4,044.95 కోట్లతో

రూ.4,044.95 కోట్లతో జీవీఎంసీ బడ్జెట్‌

గత ఏడాది కంటే రూ.304 కోట్లు అధికం

మార్చిలోనే ఆమోదం... తాజాగా వివరాలు బహిర్గతం


విశాఖపట్నం, మే 21 (ఆంధ్రజ్యోతి): మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.4,044.95 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించింది. ఈ ఏడాది మార్చి నెలలోనే దీనిని ప్రత్యేక అధికారి హోదాలో కలెక్టర్‌ ఆమోదించినప్పటికీ ఇటీవల వివరాలను బహిర్గతం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ రూ.304 కోట్లు అధికం. ఈ ఏడాది బడ్జెట్‌లో అత్యధికంగా ఇంజనీరింగ్‌ విభాగానికి రూ.1,046.11 కోట్లు కేటాయించారు.


తర్వాత వరుసలో యూసీడీకి రూ.531.57 కోట్లు, ప్రజారోగ్యానికి రూ.503.21 కోట్లు, తాగునీటి సరఫరాకు రూ.362.67 కోట్లు, ఇతర ప్రాజెక్టులకు రూ.320 కోట్లు, ఇంజనీరింగ్‌ ప్రాజెక్టులకు రూ.309.41 కోట్లు, సాధారణ పరిపాలనకు రూ.193.06 కోట్లు, పార్కుల అభివృద్ధికి రూ.127.30 కోట్లు, అమృత్‌ పనులకు రూ.100 కోట్లు, వీధి దీపాల నిర్వహణకు రూ.120.25 కోట్లు, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ప్రాజెక్టులకు రూ.56.90 కోట్లు, విద్యావిభాగానికి రూ.31.18 కోట్లు, టౌన్‌ప్లానింగ్‌ రూ.23.34 కోట్లు, రాజీవ్‌ ఆవాసయోచనకు రూ.మూడు కోట్లు చొప్పున కేటాయించారు.


ముగింపు నిల్వ కింద రూ.126.35 కోట్లు చూపించారు. ఆదాయం కింద రూ.4,171.30 కోట్లు సమకూరుతుందని అంచనా వేశారు. అందులో రూ.3,329.54 కోట్లు పన్నులు, లైసెన్సులు, అనుమతులు మంజూరు ద్వారా వస్తుందని, మిగిలిన మొత్తం కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు అందజేసే నిధుల ద్వారా సమకూరుతాయని బడ్జెట్‌లో పొందుపరిచారు. 

Updated Date - 2020-05-22T09:14:25+05:30 IST