ఆ ఘటనపై సీఎం ఎందుకు స్పందిచడం లేదు? : జీవీరెడ్డి

ABN , First Publish Date - 2022-04-16T21:40:16+05:30 IST

నెల్లూరు కోర్టులో సాక్ష్యాలు మాయమైన ఘటననపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందిచడం లేదని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ప్రశ్నించారు.

ఆ ఘటనపై సీఎం ఎందుకు స్పందిచడం లేదు? : జీవీరెడ్డి

అమరావతి:  నెల్లూరు కోర్టులో సాక్ష్యాలు మాయమైన ఘటననపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందిచడం లేదని  టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ప్రశ్నించారు.  శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘న్యాయస్థానం తలుపులు పగలగొట్టినా డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారు..  తన కేబినెట్లో మంత్రిగా ఉన్న కాకాణి గోవర్థన్ రెడ్డి ఏ1 గా ఉన్న కేసులోని ఆధారాలు మాయమైతే తనకు సంబంధం లేదన్నట్లు  ముఖ్యమంత్రి ఎలా ఉంటారు? నెల్లూరు కోర్టులో సాక్ష్యాలు మాయమైన ఘటనను, వైసీపీలో నేరారోపణలు ఎదుర్కొంటూ, న్యాయస్థానాల్లో విచారణకు హాజరవుతున్న వారంతా స్ఫూర్తిగా తీసుకునే వరకు ముఖ్యమంత్రి స్పందించరా? నెల్లూరు ఘటన మాదిరే నేరస్తులంతా న్యాయస్థానాలపై, న్యాయమూర్తులపై దాడి చేసి, శిక్షల నుంచి బయటపడాలన్నదే  ముఖ్యమంత్రి ఉద్దేశమా? నెల్లూరు ఘటనలో అసలు దోషులకు శిక్షపడేలా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలి. దారినపోయే అనామకుల్ని అరెస్ట్ చేసి, సొంత బాబాయ్ హత్యకేసులాగా సాక్ష్యాలు చోరీ చేసి కేసుని నీరుగార్చే ప్రయత్నాలు మానుకోండి.


కాకాణి గోవర్థన్ రెడ్డిని జగన్ తక్షణమే ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాలి. మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలి.  తన, పరబేధం లేకుండా తప్పు చేసిన వారందరినీ శిక్షిస్తానన్న జగన్ ఆ మాటను కాకాణి విషయంలో ఆచరణలో పెట్టాలి. నెల్లూరు న్యాయస్థానంలో జరిగిన ఘటనను రాష్ట్ర హైకోర్టు సుమోటాగా విచారణను స్వీకరించి అసలు దోషులను శిక్షించాలి. రాష్ట్రంలోని న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకం రెట్టింపయ్యేలా హైకోర్ట్ తక్షణమే నెల్లూరు ఘటనపై చర్యలకు ఉపక్రమించాలి’’ అని  జీవీరెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-16T21:40:16+05:30 IST