Abn logo
Sep 25 2021 @ 00:06AM

పరాకాష్టకు వైసీపీ నేతల రౌడీయిజం

జీవీ ఆంజనేయులు


గుంటూరు, సెప్టెంబరు24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైసీపీ నేతల రౌడీయిజం పరాకాష్టకు చేరిందని.. వారి దాడులకు సీఎం జగన్‌ బాధ్యత వహిస్తారా అంటూ  టీడీపీ నరసరావుపేట పార్లమెంటరీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ఆన్‌లైన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. అమరావతి దళిత జేఏసీ నేత చిన్నాపై దాడి చేయటమే కాక తిరిగి అతనిపైనే అక్రమంగా ఎదురు కేసులు పెట్టారన్నారు. చిన్నాపై దాడికి దిగిన వారిపై బెయిలబుల్‌ సెక్షన్లు పెట్టి చిన్నాపై నాన్‌ బెయిల్‌బుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేయటం దుర్మార్గమన్నారు. పోలీసులు చట్టప్రకారం పనిచేయకుండా వ్యతిరేకంగా పనిచేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రంలో పోలీసులది ప్రేక్షకపాత్ర అయ్యిందని విమర్శించారు. టీడీపీ నేత బత్తిని శారద ఇంటిపై దాడికి పాల్పడిన వైసీపీ నాయకుల్ని సాక్షాత్తు హోం మంత్రి వెనకేసుకు రావటం ఏమిటని నిలదీశారు. దాడులకు పాల్పడిని వారిపై కఠినచర్యలు తీసుకోకపోతే పోలీసులపై ప్రైవేటు కేసులు వేసి న్యాయపరంగా పోరాడతామని జీవీ హెచ్చరించారు.