గట్టెక్కించు‘నది’ ఎవరో!

ABN , First Publish Date - 2022-01-19T04:37:32+05:30 IST

లాబేసు - పూర్ణపాడు వంతెనను పట్టించుకోకపోవడంపై గిరిజనులు మంగళవారం నాగావళి నదిలోనే నిరసన తెలిపారు. మంచంపై ఉన్న రోగిని నదిని దాటిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

గట్టెక్కించు‘నది’ ఎవరో!
మంచంపై రోగిని మోస్తూ నాగావళి నది దాటుతున్న గిరిజనులు

 జ్వర పీడితుడితో నాగావళిలో నిరసన

కొమరాడ, జనవరి 18 : లాబేసు - పూర్ణపాడు వంతెనను పట్టించుకోకపోవడంపై గిరిజనులు మంగళవారం నాగావళి నదిలోనే నిరసన తెలిపారు. మంచంపై ఉన్న రోగిని నదిని దాటిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  సంవత్సరాలుగా లాబేసు - పూర్ణపాడు వంతెన పూర్తి చేయకపోవడంతో నది ఆవల గ్రామాల ప్రజలు నిరంతరం అవస్థలు పడుతూనే ఉన్నారు. అనేక మార్లు నిరసనలూ తెలిపారు. తాజాగా మంగళవారం జ్వరంతో బాధపడుతున్న ఓ గిరిజనుని నదిని దాటిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నినాదాలు చేశారు. సీపీఎం నాయకులు కె.సాంబమూర్తి మాట్లాడుతూ వంతెన నిర్మాణానికి రూ. 14 కోట్లు మంజూరైనట్లు ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ప్రకటించి ఏడాది కావస్తున్నా పనులు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదన్నారు. మంత్రి ప్రకటన పత్రికలకు మాత్రమే పరిమితమైందని విమర్శించారు. నాగావళి ఆవలి గిరిజనులు అనారోగ్యం బారిన పడితే నదిలో దిగి అవతలి వైపునకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెలాఖరులోగా వంతెన పనులు ప్రారంభించని పక్షంలో అన్ని పార్టీలు, ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.



Updated Date - 2022-01-19T04:37:32+05:30 IST