విచ్చలవిడిగా గుట్కా

ABN , First Publish Date - 2021-06-23T07:18:02+05:30 IST

ఒకవైపు గంజాయి మత్తులో చిత్తూరు జిల్లా యువత చిత్తవుతూ ఉంటే, మరొకవైపు గుట్కా వంటి ప్రమాదకర పొగాకు ఉత్పత్తులు కష్టజీవుల ఆరోగ్యం గుల్ల చేస్తున్నాయి.

విచ్చలవిడిగా గుట్కా
చంద్రగిరిలో ఓ దుకాణంలో దాడులు చేపట్టి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు

ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు రాక

 ఏటా రూ. కోట్లలో వ్యాపారం


ఒకవైపు గంజాయి మత్తులో చిత్తూరు జిల్లా యువత చిత్తవుతూ ఉంటే, మరొకవైపు గుట్కా వంటి ప్రమాదకర పొగాకు ఉత్పత్తులు కష్టజీవుల ఆరోగ్యం గుల్ల చేస్తున్నాయి. ఉత్తరాది ప్రాంతాలనుంచి వచ్చి జిల్లాలో పనిచేసే కార్పెంటర్లు, భవన నిర్మాణ కార్మికులు, పరిశ్రమల్లో పని చేసే కూలీలు గుట్కాకు ప్రధానంగా బానిసలు. వీరితో పాటూ పనిచేసే స్థానికులకు కూడా ఈ అలవాటు ఒక అవసరంగా మారిపోయింది. ఏ ఊళ్లో, ఏ చిన్న దుకాణంలో అయినా దొరికే గుట్కా ప్యాకెట్లు జేబుల్లో పెట్టుకుని పని మధ్యలో నోట్లో వేసుకుంటున్నారు.చివరికిది వాళ్ల ప్రాణాలనే హరించివేస్తోంది. 


కథనం-తిరుపతి సిటీ :

తిరుపతిలో అతనొక బ్యాంకు ఉద్యోగి. పెళ్లైన పదేళ్లకు పుట్టాడని కొడుకును గారాబంగా పెంచారు. టీనేజ్‌ వెర్రితలలు గమనించలేదు. సిగరెట్‌తో పాటూ గుట్కా అలవాటైంది. 18 ఏళ్ళ వయసులో కడుపులో మంట అనడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్లు నోటి క్యాన్సర్‌ అని తేల్చారు. ఊపిరితిత్తులు పాడైపోయాయి. బిడ్డని కాపాడుకోవాలని ఆస్తులన్నీ అమ్మి ఆసుపత్రులకు ఖర్చుపెట్టారు. ఏడాదికే అతను కన్నుమూశాడు. 


మదనపల్లెకు చెందిన ఓ ఆటోడ్రైవర్‌ కడుపు నొప్పితో డాక్టర్‌ దగ్గరకు వెళ్లాడు. పరీక్షించిన డాక్టర్లు సిగరెట్‌, మద్యం అలవాటున్నాయా అని అడిగారు. లేవని చెప్పాడు అతను. అయితే గుట్కా నములుతానని చెప్పాడు. ఆ అలవాటు ఎంత ప్రమాదమో తేలిపోయింది. నోటి క్యాన్సర్‌ బయటపడింది. ఆసుపత్రులన్నీ తిరిగారు. ఏడు నెలలకే అతను చనిపోయాడు. ప్రేమించి పెళ్లాడిన వ్యక్తి కోసం అందరినీ వదులుకున్న అతని భార్య, ‘బతుకెట్లా భగవంతుడా’ అని ఇద్దరు బిడ్డలతో ఇప్పుడు రోదిస్తోంది.  


జిల్లాలో గుట్కా వైపరీత్యాలకు ఇటువంటి నిదర్శనాలు లెక్కకు మిక్కిలి కనిపిస్తాయి. నిషేధించినా గుట్కా దొరకని తావంటూ లేదు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ర్టాల నుంచి జిల్లాకు గుట్కా, పొగాకు ఉత్వత్తులు చేరుతున్నాయి.  మొదట తిరుపతికి తరువాత శ్రీకాళహస్తి, నగరి, మదనపల్లె, చిత్తూరు, పుత్తూరు, పుంగనూరు కేంద్రాలకు పంపుతారు.  చిన్నపాటి బడ్డీ కొట్టు దగ్గర నుంచి చిల్లర దుకాణాల వరకు అన్ని చోట్లా ఇవి సులభంగా దొరుకుతున్నాయి.  డ్రైవర్లు, పరిశ్రమల్లో కార్మికులు, మార్కెట్‌ యార్డులు, ఇతరచోట్ల పనిచేసే కూలీలు, భవన నిర్మాణ కూలీలు, జిల్లాలో వివిధ పనులు చేసుకుంటున్న బీహార్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిశా రాష్ర్టాలకు చెందినవారు ఎక్కువగా గుట్కా వినియోగదారులు. జిల్లాలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు ఏటా 60 కోట్లకు పైగా జరుగుతున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. పది రోజుల వ్యవధిలో జిల్లాలో 38 గుట్కా కేసులు నమోదు కాగా రూ. 50 లక్షల విలువచేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారంటే జిల్లాలో ఈ వ్యాపారం ఏ విధంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు, స్సెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేస్తూనే ఉన్నా  గుట్కా జోరు తగ్గడంలేదు. 


క్యాన్సర్‌ ముప్పు ఎక్కువ

పొగాకు ఉత్పత్తులు, ఇతర పాన్‌ మసాలాలు వాడే వారిలో 40 శాతం మందిని క్యాన్సర్‌ కబళిస్తోంది. నోటిలో పుళ్లు, అన్నవాహికకు రంద్రాలు పడి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి.నోటి, ఊపిరితిత్తులు, జీర్ణకోశ, మూత్రాశయ క్యాన్సర్లు ఎక్కువగా వస్తాయి. గుట్కాలను నమలడం వలన 28 విషతుల్య పదార్థాలు శరీరంలోకి చేరతాయని వైద్యులు పరీక్షల్లో తేల్చి చెబుతున్నారు. తాజాగా వైద్యులు చేపట్టిన సర్వేలో  పొగాకు ఉత్పత్తుల వలన క్యాన్సర్‌ బారిన పడిన ప్రతీ 30 మందిలో 17 మంది చనిపోతున్నారని తేలింది. ఇందులో 20 నుంచి 30 యేళ్ల  వయస్కులే అధికంగా ఉంటున్నారు.


ఈ నెలలో జిల్లాలో పోలీసుల దాడుల్లో కొన్నింటిని పరిశీలిస్తే

-ఈ నెల 3న తవణంపల్లెలో శ్రీసాయి చారిట్రబుల్‌ ట్రస్టు గోదాములో దాచివుంచిన రూ. 15 లక్షల విలువచేసే 42 వేల గుట్కా ప్యాకెట్లను పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకుని అందుకు సంబంధించిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

-5వ తేదీన చంద్రగిరి పట్టణంలో పోలీసులు గుట్కా వ్యాపారులపై దాడులు చేపట్టి రూ. 25 వేల విలువచేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

-6న జిల్లావ్యాప్తంగా పోలీసులు దాడులు చేపట్టి రూ. 10 లక్షల విలువచేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని 15 మందిని అదుపులోకి తీసుకున్నారు.

-11న తిరుపతి నగరంలోని ఓ ఇంట్లో, వెదురుకుప్పం, పెనుమూరు, గంగాధరనెల్లూరుల్లో  దాడులు చేపట్టి బారీగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

-12న చంద్రగిరి పట్టణంలో పోలీసులు దాడులు చేపట్ట బారీగానే గుట్కా ప్యాకెట్లను పట్టుకుని కేసులు నమోదు చేశారు.

- 19న నగరి సమీపంలోని షిర్డీసాయిబాబా ఆలయం వద్ద నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 67 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.అలాగే తిరుపతి ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న ప్రైవేటు బస్టాండు వద్ద  ఇద్దరిని  అదుపులోకి తీసుకున్న పోలీసులు  వారి నుంచి 1,150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో 16 ఏళ్ల బాలుడు కూడా వుండడం గమనార్హం. 



ఏడు శాఖలు ఉన్నా ..

నిషేధిత పొగాకు ఉత్పత్తుల నిల్వ, తయారీ, రవాణా, అమ్మకాలను అడ్డుకోవడంలో ఏడు శాఖల పాత్ర ఉంటుంది. ప్రజారోగ్య, పోలీసు, రవాణా, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంటు, కుటుంబ సంక్షేమ, పంచాయతీరాజ్‌, పురపాలక శాఖలతోపాటు ప్రస్తుతం ప్రత్యేకంగా నియమించిన స్పేషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వీటి నివారణ దిశగా చర్యలు చేపట్టాలి. పొగాకు ఉత్పత్తుల వాడకం వలన ఎదురయ్యే పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి. అయతే వీరి దాడులు, అవగాహన కార్యక్రమాలు కంటితుడుపుగానే ఉంటున్నాయి.


దాడులు చేస్తున్నాం

గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడి కొందరు జీవితాలను నాశనం చేసుకుంటుంటే, ఆ వ్యాపారంలో డబ్బును సంపాదించేందుకు ఇంకొందరు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు నిత్యం దాడులు చేపడుతూనే ఉన్నాం. ఎంతో మంది వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నాం. అలాగే యువకులు వీటికి అలవాటు పడకుండా కౌన్స్‌లింగ్‌లు ఇస్తున్నాం. 

-చల్లని దొర, సీఐ, క్రైం పోలీసు స్టేషన్‌, తిరుపతి


జీవితం నాశనం చేస్తుంది

గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులకు అలవాటుపడిన వారు ఎక్కువగా నోటి క్యాన్సర్‌ బారిన పడతారు. క్రమంగా ఆ క్యాన్సర్‌ అంగవాహిక, కడుపులోకి చేరి ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. శరీరంలోని అన్నీ అవయవాలపై ప్రభావాన్ని చూపుతుంది. పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్లకపోవడం ఎంతో శ్రేయస్కరం. 

 -డాక్టర్‌ బీ.వీ.సుబ్రమణియన్‌, ఎండీ, క్యాన్సర్‌ విభాగాధిపతి, స్విమ్స్‌


Updated Date - 2021-06-23T07:18:02+05:30 IST