గుట్కా ప్యాకెట్ల ప్రదర్శన కేసు.. నేడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు?

ABN , First Publish Date - 2020-09-24T14:17:10+05:30 IST

అసెంబ్లీలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను ప్రదర్శించిన డీఎంకే సభాపక్ష నాయకుడు

గుట్కా ప్యాకెట్ల ప్రదర్శన కేసు.. నేడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు?

చెన్నై: అసెంబ్లీలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను ప్రదర్శించిన  డీఎంకే సభాపక్ష నాయకుడు ఎంకే స్టాలిన్‌ సహా 19 శాసనసభ్యులకు స్పీకర్‌ జారీ చేసిన తాజా సంజాయిషీ నోటీసుకు వ్యతిరేకంగా ఆ పార్టీ దాఖలు చేసిన రిట్‌పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు మధ్యం తర ఉత్తర్వును జారీ చేయనుంది. 2017, జూలై 19న జరిగిన శాసనసభ సమావేశంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు, పొగాకు ఉత్పత్తులను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారంటూ స్టాలిన్‌ సహా ఆ పార్టీకి చెందిన 21 మంది శాసనసభ్యులు  గుట్కా ప్యాకెట్లను ప్రదర్శించారు. దానిపై సభా వ్యవహారాల మండలి విచారణ జరిపిన మీదట స్పీకర్‌ ధనపాల్‌ స్టాలిన్‌ సహా శాసనసభ్యులకు సభాహక్కుల ఉల్లంఘన కింద నోటీసులు జారీ చేశారు. దానికి సవాలు చేస్తూ స్టాలిన్‌ సహా శాసనసభ్యులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. మూడేళ్ళకు పైగా ఆ పిటిషన్లపై  విచారణ కొన సాగింది. విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి ఏపీ సాహి, సెంథిల్‌కుమార్‌ రామమూర్తితో కూడిన ధర్మాసనం స్టాలిన్‌ సహా 19 మంది (ఇద్దరు డీఎంకే సభ్యులు మృతి చెందటంతో వారి పేర్లు తొలగించారు) శాసనసభ్యులకు స్పీకర్‌ జారీచేసిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసును రద్దు చేస్తున్నట్లు ఆగస్టు 25న తీర్పు ఇచ్చింది. స్పీకర్‌ నోటీసులు జారీ చేయడంలో ప్రాథమిక స్థాయి తప్పిదాలున్నాయని, డీఎంకే సభ్యులకు కొత్తగా నోటీసులు జారీ చేసి స్పీకర్‌ సంజాయిషీ కోర వచ్చునని ధర్మాసనం సూచించింది.


ఆ నేపథ్యలో కలైవానర్‌ అరంగంలో శాసనసభ సమావేశాల నిర్వహణపై డిప్యూటీ స్పీకర్‌ పొల్లాచ్చి జయరామన్‌ అధ్యక్షతన జరిగిన సభావ్యవహారాల మండలి సమావేశంలో స్టాలిన్‌ సహా 19 మంది డీఎంకే శాసనసభ్యులకు మళ్ళీ నోటీసులు జారీ చేసే విషయంపై చర్చలు జరిగాయి. మెజారిటీ సభ్యుల సూచన మేరకు స్టాలిన్‌ సహా శాసన సభ్యులకు మళ్ళీ సంజాయిషీ నోటీసు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.. ఆ మేరకు ఈ నెల ఎనిమిదిన స్పీకర్‌ తరఫున అసెంబ్లీ కార్యదర్శి శీనివాసన్‌ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 14లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. ఆ నోటీసులు కలైవానర్‌ అరంగంలో జరిగే శాసనసభ సమావేశాల్లో తాను, 18 మంది శాసనసభ్యులను పాల్గొనకుండా చేయడం కోసమే దురుద్దేశంతో ఇచ్చారని ఆరోపిస్తూ వారు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. గత గురువారం ఆ రిటిపిటిషన్‌ న్యాయమూర్తి కే రవిచంద్రబాబు ఎదుట విచారణకు వచ్చింది. 



ఆ సందర్భంగా న్యాయమూర్తి రవిచంద్రబాబు మాట్లాడుతూ గతంలో శాసనసభా వ్యవహారమండలి జారీ చేసిన నోటీసుకు వ్యతిరేకంగా దాఖలైన కేసును తానే విచారణ జరిపానని, మళ్ళీ అదే తరహా నోటీసుపై విచారణ జరుపటం సమంజసంగా ఉండదని పేర్కొని, విచారణను మరో న్యాయమూర్తికి బదిలీ చేయమంటూ ప్రధాన న్యాయమూర్తికి సిఫారసు చేసి కేసు తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు. ఆ మేరకు బుధవారం ఉదయం ఈ రిట్‌పిటిషన్‌ న్యాయమూర్తి పుష్పా సత్యనారాయణ ఎదుట విచారణకు వచ్చింది. ఆ రిట్‌ పిటీషన్‌ను ఆమె నిశితంగా పరిశీలన చేసి  విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో గురువారం న్యాయమూర్తి పుష్పా సత్యనారాయణ మధ్యంతర ఉత్తర్వును ప్రకటించనున్నారని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ కార్యాలపు అధికారులు ప్రకటన జారీ చేశారు.

Updated Date - 2020-09-24T14:17:10+05:30 IST