Advertisement
Advertisement
Abn logo
Advertisement

మత్తుపై యుద్ధం

గంజాయి, గుట్కా, పొగాకు విక్రయాలపై కొరడా

పోలీసుల ముమ్మర తనిఖీలు

ములుగు మండలం కొత్తూరులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

పలుచోట్ల గుట్కా ప్యాకెట్లు, మద్యం సీసాలు స్వాధీనం

దుకాణాల యజమానులపై కేసులు

గంజాయి నిర్మూలనపై అవగాహన


గంజాయి, గుట్కా, పొగాకు విక్రయాలపై ఉమ్మడి జిల్లా పోలీసులు యుద్ధం ప్రకటించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందడంతో ముమ్మర తనిఖీలతో విరుచుకుపడ్డారు. సిద్దిపేట జిల్లా ములుగు మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని వల పన్ని పట్టుకున్నారు. పలుచోట్ల గుట్కా, పొగాకు ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. గంజాయి నిర్మూలనపై గ్రామాల్లో అవగాహన కల్పించారు.


ములుగు/సిద్దిపేట క్రైం/జగదేవ్‌పూర్‌/చిన్నకోడూరు/వర్గల్‌, అక్టోబరు 24 : సిద్దిపేట జిల్లా ములుగు మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో పోలీసులు గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని వలపన్ని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు కొద్దిరోజులుగా నిఘా ఉంచారు. ఆదివారం ఉదయం గంజాయి విక్రయిస్తున్న కొత్తూరు గ్రామానికి చెందిన గువ్వా సురేష్‌ (38), షేక్‌ అన్వర్‌ (25)ను పట్టుకుని, 44 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ధూల్‌పేట నుంచి గంజాయిని తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు విచారణలో వారు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు గజ్వేల్‌ రూరల్‌ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఎస్‌ఐ రంగాకృష్ణ, ట్రైనీ ఎస్‌ఐ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


ముమ్మర తనిఖీలు.. గుట్కా, మద్యం స్వాధీనం

గంజాయి, గుట్కా,  మత్తుపదార్థారాలను విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని సిద్దిపేట వన్‌టౌన్‌, టూటౌన్‌ సీఐలు శ్రీనివాస్‌, పరశురాంగౌడ్‌ హెచ్చరించారు. సిద్దిపేట పట్టణంలోని పాన్‌షాపులు, దుకాణాల్లో శనివారం రాత్రి పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. పలు దుకాణాల్లో రూ.26 వేల విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా గుట్కా, మత్తు పదార్థాలు విక్రయిస్తున్నా, కలిగి ఉన్నా 100 నంబరుకు లేదా పోలీస్‌ కమిషనరేట్‌ వాట్సాప్‌ నంబరు 7901100100కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. సమాచారం ఇచ్చినవారి పేర్లను గోప్యంగా ఉంచుతామని, తగిన పారితోషికం కూడా అందజేస్తామని తెలిపారు. వర్గల్‌ మండలం గౌరారంలో రాజీవ్‌ రహదారి పక్కనే ఉన్న టీపాయింట్‌లో విక్రయిస్తున్న మద్యం, సీసాలు, గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. గౌరారం ఎస్‌ఐ సంపత్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం రాజీవ్‌రహదాకి పక్కనే ఉన్న టీపాయింట్‌లో చర్లపల్లి శ్రీనివా్‌సగౌడ్‌ అనే వ్యక్తి మద్యం, గుట్కా, పొగాకు విక్రయిస్తున్నాడని పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు దాడిచేసి 40 మద్యం బాటిళ్లు, రూ. 2,600 విలువ చేసే గుట్కా, పొగాకు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. చిన్నకోడూరు మండలంలోని అనంతసాగర్‌, రామునిపట్లలో దుకాణాల్లో ఎస్‌ఐ రాజేశ్‌ ఆధ్వర్యంలో ఆదివారం తనీఖీలు నిర్వహించారు. రూ. 4,500 విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని పలు దుకాణాల యజామానులపై కేసులు నమోదు చేశారు. అలాగే, మర్కుక్‌ ఎస్‌ఐ శ్రీశైలం ఆధ్వర్యంలో స్థానిక, స్పెషల్‌పార్టీ పోలీసులు మర్కుక్‌ స్టేషన్‌ పరిధిలోని 16 గ్రామాల్లో పాన్‌షాపులు, దుకాణాల్లో ఆదివారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. 


సంగారెడ్డి జిల్లాలో..

పటాన్‌చెరు/కల్హేర్‌/నారాయణఖేడ్‌/నాగల్‌గిద్ద, అక్టోబరు 24: సంగారెడ్డి జిల్లాలోనూ పోలీసులు గుట్కాలు, గంజాయి, పొగాకు విక్రయాలపై కొరఢా ఝలిపించారు. విస్తృత తనిఖీలు నిర్వహించి నిషేధిత గుట్కా, తంబాకు విక్రయిస్తున్న పలు దుకాణాలపై కేసులు నమోదుచేశారు. పటాన్‌చెరు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని పటాన్‌చెరు, ఇస్నాపూర్‌, ముత్తంగి గ్రామాల్లో దాబాలు, దుకాణాలు, పాన్‌షాపులపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ముత్తంగిలో 3, ఇస్నాపూర్‌లో 3, పటాన్‌చెరులో 6 దుకాణాల్లో గుట్కా, తంబాకు ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్టు పటాన్‌చెరు సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. కల్హేర్‌ మండల పరిధిలోని మాసాన్‌పల్లి చౌరస్తాలోని దుకాణాల్లో ఎస్‌ఐ ప్రశాంత్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. మండలంలో గుట్కా, పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నారాయణఖేడ్‌ పట్టణంలోని పాన్‌షాపుల్లో సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం రాత్రి ముమ్మర తనిఖీలు నిర్వహించారు. గంజాయి, గుట్కా, పొగాకు విక్రయాలను అరికట్టడానికే తనిఖీలు నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. 


గంజాయి నిర్మూలనపై అవగాహన

గంజాయి పండించినా, రవాణా చేసినా పీడీయాక్టు కింద కేసులు నమోదు చేస్తామని నాగల్‌గిద్ద ఎస్‌ఐ విజయ్‌రావు పేర్కొన్నారు. నాగల్‌గిద్ద మండల కేంద్రంలో ఆదివారం ఆయా గ్రామాల సర్పంచులతో ఏర్పాటు చేసిన అవగాహనాసదస్సులో  ఎస్‌ఐ మాట్లాడారు. గ్రామాల్లో గంజాయి సాగు చేస్తుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చినవారి పేర్లు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాజురాథోడ్‌, ఎంపీపీ మోతిబాయి, సర్పంచులు పండరి, సంజీవ్‌రెడ్డి, రేణుకారాజ్‌కుమార్‌, సురేఖఅంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే, సిర్గాపూర్‌ మండలంలోని ఎస్‌ఐ నారాయణ ఆధ్వర్యంలో ఆదివారం రూప్లాతండా, గరిడేగామ్‌ గ్రామాల్లో గంజాయి సాగుచేస్తే విధించే శిక్షలపై అవగాహన కల్పించారు. గంజాయి సాగుచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

Advertisement
Advertisement