గుట్టుగా గుట్కా దందా

ABN , First Publish Date - 2021-06-09T05:51:23+05:30 IST

జిల్లాలో నిషేధిత గుట్కా విక్రయాలకు అడ్డుకట్ట పడటం లేదు. చట్టాల్లోని లొసుగులు, ఇంటి దొంగల సహకారంతో జిల్లాలో కొందరు యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు.

గుట్టుగా గుట్కా దందా
కామారెడ్డి పట్టణంలో ఇటీవల పట్టుబడిన గుట్కా తయారీ మిషన్‌, ముడి సరుకు

- జిల్లాలో ఆగని గుట్కా విక్రయాలు
- జిల్లా కేంద్రంలోనే యథేచ్ఛగా గుట్కా తయారీ చేస్తూ పట్టుబడిన ముఠా
- గుట్టు చప్పుడు కాకుండా దుకాణాలు, పాన్‌షాపుల్లో విక్రయాలు
- రూ.కోట్లలో సాగుతున్న వ్యాపారం
- పట్టణ కేంద్రాల్లో భారీగా నిల్వలు ఉన్నప్పటికీ అంతంత మాత్రంగానే దాడులు
- గతంలో దాడులు చేసి కేసులు పెట్టినా ఆగని దందా

కామారెడ్డి, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో నిషేధిత గుట్కా విక్రయాలకు అడ్డుకట్ట పడటం లేదు. చట్టాల్లోని లొసుగులు, ఇంటి దొంగల సహకారంతో జిల్లాలో కొందరు యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. హత్య కేసులను రోజుల వ్యవధిలోనే ఛేదించగల సత్తా ఉన్న మన పోలీసులు విచ్చలవిడిగా బస్తాల కొద్దీ గుట్కా ప్యాకెట్లు జిల్లాలోకి వస్తున్న, ఏకంగా జిల్లా కేంద్రంలోనే యథేచ్ఛగా గుట్కా తయారు చేస్తూ పట్టుబడినా ఎందుకు నిలువరించడం లేదో అర్థం కాని పరిస్థితి. పొరుగు రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ర్టాల నుంచి పెద్ద మొత్తంలోనే జిల్లాకు గుట్కాను తరలిస్తున్నా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వెలువడుతున్నాయి. గతంలో ప్రభుత్వ ఆదేశాలతో గుట్కాపై ఉరుకులు పరుగులతో పోలీసులు దాడులు చేసి పట్టుకున్నా ఇటీవల కాలంలో పోలీసుల తనిఖీలు లేకపోవడంతో గుట్కా ముఠా యథేచ్ఛగా దందా సాగిస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.
సరిహద్దు రాష్ర్టాల నుంచి జిల్లాకు తరలింపు
తెలంగాణలో గుట్కాపై నిషేధం ఉంది. పక్క రాష్ర్టాలైనా మహారాష్ట్ర, కర్ణాటకలు గుట్కా విక్రయాలు కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లా ఈ రెండు రాష్ర్టాలకు సరిహద్దులుగా ఉండటంతో గుట్కా ముఠా యథేచ్ఛగా జిల్లాకు తరలిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలైనా ఔరంగాబాద్‌, బీదర్‌, బెంగళురూ, నారాయణ్‌ఖేడ్‌ ప్రాంతాల నుంచి ఎక్కువగా గుట్కా స్థావరాలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్కడి నుంచి గుట్కా రవాణా చేసే అక్రమార్కులు బస్సుల్లో, టాటా మ్యాజిక్‌ ఆటో, కార్లలో, ద్విచక్ర వాహనాలపై పోలీసుల కంట పడకుండా బిచ్కుంద, పిట్లం, మద్నూర్‌, జుక్కల్‌ మీదుగా వయా బాన్సువాడ పట్టణం మీదుగా కామారెడ్డి ప్రాంతానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని పాన్‌షాపుల్లో, దుకాణాల్లో గుట్కాలను విక్రయిస్తున్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలైన జుక్కల్‌, మద్నూర్‌, బిచ్కుంద ప్రాంతాల నుంచి అక్రమమార్గం ఎంచుకున్న గుట్కా ముఠా ఔరంగాబాద్‌, కర్ణాటక రాష్ర్టాల నుంచి సరఫరా చేస్తున్నారు. జుక్కల్‌, బాన్సువాడ నియోజకవర్గంలోని పలు మండలాలు గుట్కాలకు కేంద్రాలుగా మారాయని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఔరంగాబాద్‌, బెంగళురూ ప్రాంతాల నుంచి జిల్లాకు తరలిస్తున్న భారీ మొత్తంలో గుట్కాను పిట్లం, బిచ్కుంద, బాన్సువాడ, గాంధారిలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటనలు ఉన్నాయి.
రూ. కోట్లలో గుట్కా దందా
జిల్లాలో కోట్ల రూపాయాల్లోనే గుట్కా దందా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కామారెడ్డి జిల్లా పిట్లం, జుక్కల్‌, బిచ్కుంద, మద్నూర్‌ ప్రాంతాల మీదుగా నిజామాబాద్‌తో పాటు సిరిసిల్లా, కరీంనగర్‌, జగిత్యాల తదితర ప్రాంతాలకు వాహనాల్లో గుట్కా సరఫరా అవుతోంది. ఎవరికి అనుమానం రాకుండా పోలీసుల కన్నులు కప్పి హోల్‌సేల్‌గా దుకాణాలకు గుట్కా ముఠా సరఫరా చేస్తోంది. అప్పుడప్పుడు పోలీసులు దాడులు చేస్తున్నా దాందా మాత్రం ఆగడం లేదు. జిల్లాలో నెలకు రూ.10 కోట్ల విలువైన గుట్కా విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం. ప్రస్తుతం గుట్కాపై పోలీసుల తనిఖీలు లేకపోవడంతో పాన్‌షాపుల్లో, దుకాణాల్లో బహిరంగంగానే విక్రయిస్తున్నారు. ఈ గుట్కా దాందాలో సగానికి సగం లాభం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. పెద్ద మొత్తంలో ఆదాయం ఉండటంతో పోలీసులకు పట్టుబడి కేసులు నమోదైనా బెయిల్‌ పొంది అదే దందాను కొనసాగిస్తున్నారు. కాగా ఏకంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోనే గుట్కా తయారీ కేంద్రాన్నే ఏర్పాటు చేశారంటే పోలీసులు ఏ విధమైన పర్యవేక్షణ చేస్తున్నారో.. ఇంటిదొంగలు ఏ విధంగా సహకరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
నిలిచిన పోలీసుల తనిఖీలు
గుట్కా, తంబాకు, ఫాన్‌ మాసాల వంటి మత్తు పదార్థలైన ప్యాకెట్లను రాష్ట్ర ప్రభుత్వం గతంలోనూ నిషేధించింది. రాష్ట్రంలో ఎక్కడా కూడా గుట్కా విక్రయాలు జరుగకుండా చూడాలని పోలీసుశాఖకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో మొదట్లో పోలీసులు హడావిడి చేస్తూ గుట్కా గోదాంలపై, దుకాణాలపై, పాన్‌షాపులపై వరుసగా దాడులు చేస్తూ భారీ మొత్తంలోనే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా దందా కొనసాగించే ముఠాపై పోలీసుశాఖ నామమాత్రపు కేసులు నమోదు చేయడంతో ముఠా సభ్యులు బెయిల్‌పై వచ్చి తిరిగి అదే దందాను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో గుట్కాపై పోలీసుల తనిఖీలు నిలిచిపోయాయి. సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో గుట్కా జిల్లాకు సరఫరా చేయడం ఇక్కడి నుంచి పొరుగు జిల్లాలైన నిజామాబాద్‌, కరీంనగర్‌, సిరిసిల్లా, సిద్దిపేట్‌ తదితర ప్రాంతాలకు ముఠా భారీగానే తరలిస్తోంది. అయినప్పటికీ పోలీసుల తనిఖీలు మాత్రం కానరావడం లేదు. జిల్లాలోని మారుమూల మండలాల్లోనే కాకుండా బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి పట్టణ కేంద్రాల్లోనూ రహస్య ప్రాంతాల్లో గుట్కా డంప్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని నిఘా వర్గాలు స్థానిక పోలీసులకు అందించిన గుట్కా ముఠాతో ఉన్న సంబంధాల నేపథ్యంలో దాడులు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2021-06-09T05:51:23+05:30 IST