గుట్కా దందా

ABN , First Publish Date - 2020-06-03T10:51:37+05:30 IST

ప్రభుత్వం అమలు చేస్తున్నా గుట్కా నిషేదాజ్ఞలకు అక్రమ వ్యాపారులు తూట్లు పొడుస్తున్నారు.

గుట్కా దందా

కనిగిరి శివారు గ్రామాల్లో గుట్కా నిల్వలు

బెంగళూరు నుంచి యథేచ్ఛగా రవాణా

రోజు రూ.2లక్షలకుపైగా అక్రమ వ్యాపారం 

రూ.40లక్షల విలువైన ప్యాకెట్లను పట్టుకున్న పోలీసులు 

 వ్యాపారులతో కుమ్మక్కైన అధికారులు 


కనిగిరి కేంద్రంగా నిషేధిత గుట్కా దందా జోరుగా సాగుతోంది. గుట్కా వ్యాపారం అధికారులకూ కాసులు వర్షం కురిపిస్తోంది. వ్యాపారులకు ఒకటికి పదింతలు ఆదాయం వస్తుండటంతో అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.కనిగిరి శివారు గ్రామాల్లో గుట్కా నిల్వలు చేసి గుట్టుచప్పుడు కాకుండా మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కందుకూరు వంటి ప్రాంతాలకు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.


జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో గుట్కాలు, పాన్‌మసాలాలు బ్లాక్‌మార్కెట్‌ అమ్మకాలు జోరుగా సాగుతున్నప్పటికీ గుట్కా వ్యాపారులతో అధికారులు కుమ్మక్కై చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కర్ణాటకలోని తుముకూరు, బెంగళూరు నుంచి దిగుమతి చేసుకునే ఈ గుట్కాలను రిటైల్‌గా విక్రయిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల చిరు వ్యాపారులకు ప్యాకెట్లు సరఫరా చేస్తున్నారు. 


కనిగిరి టౌన్‌, జూన్‌ 1: ప్రభుత్వం అమలు చేస్తున్నా  గుట్కా నిషేదాజ్ఞలకు అక్రమ వ్యాపారులు తూట్లు పొడుస్తున్నారు. గుట్కాలకు అలవాటు పడిన వారి బలహీనతను వ్యాపారులు ఆసరాగా చేసుకొని అసలు ధర కంటే రెండు, మూడు రెట్లు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గత రెండు నెలలుగా లాక్‌డౌన్‌ కారణం జూపి వ్యాపారులు ఉన్న ధరకు పదింతలు అమ్మి సొమ్ము చేసుకున్నారు. గుట్కా వినియోగానికి అలవాటు పడిన వారు తాము కొనుగోలు చేసే బడ్డీ బంకులు చుట్టూ తిరుగుతూ అవసరమైతే ఎంత ధరలు అయినా వెచ్చించి కొనుగోలు చేస్తుండటంతో గుట్కా అక్రమవ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కనిగిరిలో మాఫియా కేంద్రంగా మర్రి ఊడల్లా అన్ని ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నారు. 


రెండు లారీలు పట్టుకున్న కనిగిరి పోలీసులు 

గత మార్చి 22న అర్ధరాత్రి నెల్లూరు నుంచి హైవేపై నుంచి కందుకూరు మీదుగా కనిగిరి, చీమకుర్తి, పొదిలి మీదుగా కనిగిరి వైపునకు వచ్చిన ఆ లారీలను వెంబడించిన ఎస్‌బీ పోలీసులు కనిగిరి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ వెంకటేశ్వరరావు నేతృత్వంలో పోలీసులు పొదిలి రోడ్డులోని టకారిపాలెం వద్ద, కందుకూరు రోడ్డులోని సెయింట్‌ జోసఫ్‌ స్కూల్‌ వద్ద కాపుకాసి ఆపారు. సోదా చేయడంతో రూ.30లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు దొరికాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మాచర్ల వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న రూ.20లక్షల గుట్కా సరుకును పట్టుకోగా ఆ సరుకు కూడా కనిగిరికి చెందినదని విచారణలో తేలింది.


ఇంత దాడులు, తనిఖీలు జరుగుతున్నా గుట్కా వ్యాపారం కనిగిరిలో జోరుగా జరుగుతుందని చెప్పడానికి మే31న కనిగిరి ఉప్పు రోడ్డులోని కిరాణాషాపుల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో దొరికిన గుట్కా సరుకే సాక్ష్యం. అయితే పోలీసులు, అధికారులు గుట్కా వ్యాపారులపై మాత్రం ఉక్కుపాదం మోపినట్లుగా మాటల్లో చెబుతున్నా చేతల్లో మాత్రం ఉండటం లేదని విమర్శలు ఉన్నాయి. దీంతో అసలు గుట్కా రాకెట్‌ నడుపుతున్న వారు తప్పించుకుంటున్నారు. 


రూ.50లక్షల విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

గత మార్చి22న పట్టుబడిన రెండు లారీల్లో విమల్‌పాన్‌ మసాలా, ఏ1 టుబాకో కంపెనీ పేర్లతో గుట్కా, పాస్‌ మసాలా ప్యాకెట్లు కలిగిన బస్తాలు ఉన్నాయి. ఒక లారీలో 100బస్తాలు, మరో లారీలో 40బస్తాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఈ సరుకు రూ.30లక్షలకుపైనే ఉంటుందని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఆదివారం ఐదు షాపుల్లో దొరికిన 24కారెట్‌, మధు టుబాకో, బ్లూబెల్‌, విమల్‌ 90, వీ1, గేమ్‌ గుట్కా, వంటి కంపెనీలకు చెందిన  రూ.10లక్షల మార్కెట్‌ ధర కలిగిన నిషేధిత గుట్కా పాన్‌మసాలా దొరికినట్లు పోలీసులు వెల్లడించారు.


ఇంత భారీస్థాయిలో కనిగిరిలో దొరకడం ఇటీవల ఐదోసారిగా చెప్తున్నారు. ఇదిలాఉండగా పోలీసులు  మామూళ్ళు అడిగినప్పుడు ఇవ్వకపోతే గుట్కా వ్యాపారం చేసే వ్యక్తుల షాపులపై దాడులు చేస్తున్నారని స్థానికంగా విమర్శలు కూడా ఉన్నాయి. గుట్కా వ్యాపారుల నుంచి లంచాలు అందిన తర్వాత నామమాత్రపు కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  


రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తా.. వెంకటేశ్వరరావు, సీఐ, కనిగిరి

గుట్కా, పాన్‌మసాలా కనిగిరికి చెందిన ఒక వ్యాపారి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడు. అయితే గుట్కా వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కనిగిరిలో పత్తాలేరు. గతంలోనూ గుట్కా విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశాం. వేరే ప్రాంతాల నుంచి కనిగిరికి లారీల్లో తరలించిన గుట్కా సరుకును స్వాధీనం చేసుకొన్నాం. అయితే వ్యాపారస్తుల్లో ఎటువంటి మార్పు రాలేదు. ఇక నుంచి ప్రతిషాపును ఖచ్చితంగా తనిఖీలు చేస్తాం. మరలా ఇదే వ్యక్తుల వద్ద గుట్కా దొరికినా, అమ్మినా వారిపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తాం. నా సర్కిల్‌ పరిధిలో ఎవరైనా పోలీసు సిబ్బంది గుట్కా వ్యాపారానికి సహకరిస్తుంటే నా దృష్టికి తీసుకురండి. అలాంటి వారిపై కఠినచర్యలు తీసుకుంటాం.


Updated Date - 2020-06-03T10:51:37+05:30 IST