గురుకుల హాస్టల్లో సమస్యలు తిష్ఠ

ABN , First Publish Date - 2022-07-02T06:32:01+05:30 IST

మండలంలోని కాకరపాడు గురుకుల బాలుర జూనియర్‌ కళాశాల వసతి గృహంలో సమస్యలు తిష్ఠ వేశాయి. కనీస సదుపాయాలు కొరవడడం, నిర్వహణ అధ్వానంగా వుండడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.

గురుకుల హాస్టల్లో సమస్యలు తిష్ఠ
ఒక్క ఫ్యాన్‌ కూడా లేని వసతిగృహం

కాకరపాడు కాలేజీ వసతిగృహంలో కనీస సదుపాయాలు మృగ్యం

కనీస సదుపాయాలు మృగ్యం

పదేళ్ల నుంచి కొరవడిన నిర్వహణ

వసతిగృహంలో కానరాని ఫ్యాన్లు

ఉక్కపోత, దోమల మోతతో విద్యార్థుల ఇక్కట్లు

బీటలు వారిన గచ్చులు, విరిగిపోయిన తలుపులు

తుప్పు పట్టిన బంకర్‌ బెడ్లు

ప్రమాదకరంగా విద్యుత్‌ బోర్డులు, స్విచ్‌లు

ఛిద్రమైన మరుగుదొడ్ల బేసిన్లు, పగిలిన వాటర్‌ పైప్‌లైన్‌

విద్యార్థుల సమస్యలను పట్టించుకోని అధికారులు


కొయ్యూరు, జూలై 1: మండలంలోని కాకరపాడు గురుకుల బాలుర జూనియర్‌ కళాశాల వసతి గృహంలో సమస్యలు తిష్ఠ వేశాయి. కనీస సదుపాయాలు కొరవడడం, నిర్వహణ అధ్వానంగా వుండడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పదేళ్ల క్రితం నిర్మించిన వసతిగృహం భవనానికి ఇంతవరకు మరమ్మతు పనులు చేపట్టలేదు. గచ్చులు బీటలు వారాయి. ఫ్యాన్లు లేవు. తలుపులు విరిగిపోయాయి. మరుగుదొడ్లు ఛిద్రం అయ్యాయి. విద్యుత్‌ వైర్లు, బోర్డులు అస్తవ్యస్తంగా మారి ప్రమాదకరంగా తయారయ్యాయి. నిత్యం సమస్యలతో సహజీవనం చేస్తున్నామని, అధికారులెవరూ పట్టించుకోవడం 

లేదని విద్యార్థులు వాపోతున్నారు. 

కొయ్యూరు మండలం కాకరపాడులో 2012వ సంవత్సరంలో గురుకుల బాలుర జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. నాలుగు గ్రూపుల్లో రెండేళ్లకు కలిపి 320 మంది విద్యార్థులు వున్నారు. తరగతుల నిర్వహణ, గ్రంథాలయం, సైన్స్‌ ల్యాబ్‌, తదితర అవసరాల కోసం 16 గదులతో రెండు  భవనాలు, విద్యార్థులకు వసతి కోసం మరో భవనం నిర్మించారు. కళాశాల భవనాల నిర్వహణ కొంతవరకు బాగానే వున్నప్పటికీ... హాస్టల్‌ భవన నిర్వహణను గాలికొదిలేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లేకపోవడంతో కొద్ది నెలలకే లోపాలు బయటపడ్డాయి. గచ్చులు పగిలి పోయి గోతులు ఏర్పడ్డాయి. విద్యార్థులు నిద్రించేందుకు ఏర్పాటు చేసిన బంకర్‌ బెడ్‌లు తుప్పుపట్టాయి. ఒక్క గదిలో కూడా ఫ్యాన్లు లేవు. వేసవిలో ఉక్కపోత, ఇతర రోజుల్లో దోమల బెడదతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. గదుల తలుపులు విరిగిపోయి, కిటికీల రెక్కలు ఊడిపోయాయి. విద్యుత్‌ బోర్డులు, స్విచ్‌లు పాడైపోయాయి. వైర్లు బయటకు కనిపిస్తూ ప్రమాదకరంగా తయారయ్యాయి. 320 మంది విద్యార్థులకు 16 చొప్పున మరుగుదొడ్లు, స్నానపుగదులు ఉన్నాయి. మరుగుదొడ్లకు నీరు సరఫరా చేసే పైప్‌లైన్‌ ధ్వంసమైంది. మరుగుదొడ్లలో ట్యాప్‌లు విరిగిపోయాయి. సెప్టిక్‌ బేసిన్లు పగిలిపోయాయి. ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయపోవడంతో కంపుకొడుతున్నాయి. స్నానపుగదుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు సమీపంలోని కొండవాగు ప్రాంతానికి వెళుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు స్పందించి వసతిగృహంలో సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.


Updated Date - 2022-07-02T06:32:01+05:30 IST