మహోన్నతుల ఆనవాళ్లు

ABN , First Publish Date - 2022-08-11T07:33:38+05:30 IST

జాతీయోద్యమ స్ఫూర్తితో జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టేందుకు స్థాపించిన ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్‌ నేటికీ విద్యా సేవలందిస్తోంది.

మహోన్నతుల ఆనవాళ్లు
కోపల్లె హనుమంతరావు స్థాపించిన ఆంధ్ర జాతీయ విద్యాపరిషత్‌

బందరులో సమరయోధుల సేవలు సజీవం 

గాంధీజీ మచిలీపట్నంలో కాలుమోపి సమరయోధులకు బీజం పోశారు. ఆయన స్ఫూర్తితో కృష్ణాజిల్లా కేంద్రం బందరులో జాతీయ నాయకులు స్థాపించిన విద్యా సంస్థలు, జాతీయ నాయకుల గృహాలు వారి సేవలను స్ఫురణకు తెస్తున్నాయి. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా స్వాతంత్య్ర సమరంలో కీలక పాత్ర పోషించిన జాతి నేతలు, అమరుల సేవలను మరోసారి స్మరించుకుందాం.  

మచిలీపట్నం టౌన్‌ : జాతీయోద్యమ స్ఫూర్తితో జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టేందుకు స్థాపించిన ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్‌ నేటికీ విద్యా సేవలందిస్తోంది. గాంధీజీతో స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్న కోపల్లె హనుమంతరావు, ప్రముఖ పత్రికా సంపాదకులు ముట్నూరి కృష్ణారావు, ఆంరఽధాబ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య ఈ విద్యా సంస్థను స్థాపించేందుకు కృషి చేశారు. ఆంధ్ర జాతీయ కళాశాలను గాంధీ మహాత్ముడు రెండు పర్యాయాలు సందర్శించారు. ఈ కళాశాలలో పని చేస్తున్న సమయంలోనే పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం ఎదురుగా భోగరాజు పట్టాభి సీతారామయ్య ఇల్లు ఇప్పటికీ కనబడుతుంది. ఈ ఇంటి ఎదురుగా ఉన్న ఆంధ్రాబ్యాంకులో మొదటి లాకరు ఇప్పటికీ ఉంది. పోర్టు రోడ్డులో దళితులకు వసతి గృహం కల్పించి విద్యాబుద్ధులు నేర్పిన వేమూరి రాంజీ పంతులు స్థాపించిన రాంజీ హైస్కూల్‌ ఇప్పటికీ విద్యా సేవలందిస్తోంది. ఈ సంస్థను డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌, సర్‌ సి.వి. రామన్‌ వంటి ప్రముఖులు సందర్శించిన ఫొటో పాఠశాలలో ఉంది. గొడుగుపేటలో ముట్నూరి కృష్ణారావు ఆనాడు కృష్ణాపత్రిక నడిపిన ఇల్లు ఉంది. ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం సందర్శించిన బుట్టాయిపేటలోని బ్రహ్మ సమాజం ఇప్పటికీ సేవలందిస్తూనే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపం వెనుక చిత్రకళా సంసద్‌లో ఏర్పాటు చేసిన దేశోద్ధారక, విశ్వదాత కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు విగ్రహం ఆనాడు ఆయన స్వాతంత్య్ర ఉద్యమంలో సేవలందించినందుకు గుర్తుగా నిలిచింది. చిత్రకళా సంసద్‌లో మాజీ ఎంపీ, స్వాతంత్య్ర సమరయోధుడు కాశీనాధుని పూర్ణమల్లిఖార్జునుడు చిత్రపటం మనకు కనపడుతుంది. బ్రిటీషు పాలనా సమయంలోనే బందరు కోట, డచ్‌ సమాధులతో పాటు స్వాతంత్య్ర ఉద్యమకారులను ఉంచిన జైలు కూడా శిథిలమై మనకు కనపడుతుంది. ఈ ఆనవాళ్లు అన్నీ జాతీయ ఉద్యమానికి సేవలందించిన వారి గుర్తుగా మిగిలి ఉన్నాయి. 



Updated Date - 2022-08-11T07:33:38+05:30 IST