Abn logo
Sep 21 2021 @ 23:28PM

తెలుగు సాహితీ రంగంలో గురజాడకు విశిష్ట స్థానం

కొవ్వూరు బాలికల ఉన్నత పాఠశాలలో గురజాడకు నివాళి

కొవ్వూరు, సెప్టెంబరు 21: తెలుగు సాహితీ రంగంలో గురజాడకు విశిష్ఠ స్థానం ఉందని కొవ్వూరు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ఎంఎస్‌ శ్యామలారాణి అన్నారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో హైస్కూల్‌లో మంగళవారం గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో గురజాడ రాసిన దేశభక్తి గేయాలను పాడించారు. శ్యామలారాణి మా ట్లాడుతూ కన్యాశుల్కం, పుత్తడిబొమ్మ నాటకాల ద్వారా సమాజంలోని సంప్రదాయాలు, కట్టుబాట్లు పేరుతో మహిళలపై అణిచివేతపై గళం విప్పారన్నారు. సీఐటీయూ కార్యదర్శి ఎం.సుందరబాబు మాట్లాడుతూ దేశమంటే రాజులు, నదులు, పర్వతాలు కాదని దేశమంటే పౌరులని, శ్రమను గౌరవించాలని, శ్రమిస్తేనే సమాజ మార్పు జరుగుతుందని గురజాడ తన గేయం ద్వారా తెలియజేశారు. దేశ భవిష్యత్‌కై ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేసి మరింత అబివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమంలో దగ్గు రాధాకృష్ణ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కామవరపుకోటలో మానవత ఆధ్వర్యంలో గురజాడ జయంతి

కామవరపుకోట: మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కార్యాలయంలో మంగళవారం గురజాడ అప్పారావు జయంతి నిర్వహించారు. గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కవిగా జాతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. మిడతా రమేష్‌బాబు, సాయిన కన కరాజు, మద్దిపాటి రామ్మోహనరావు, దుర్గాప్రసాద్‌, షేక్‌ ఇబ్రహీం, సాధనాల మురళి, పొన్నుబోయిన సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.