గుప్తనిధుల కోసం దుర్గం గుల్ల!

ABN , First Publish Date - 2022-04-27T03:21:26+05:30 IST

గుప్త నిధుల కోసం ఉదయగిరి దుర్గం గుల్ల చేస్తున్నారు. భూగర్భంలో ఉన్న ఘనులు వెలికితీసేందుకు తవ్వే విధంగా దుర్గంపై తవ్వకాలు జరుపుతున్నారు.

గుప్తనిధుల కోసం దుర్గం గుల్ల!
దుర్గంపై గుర్రపుశాలలో చేపట్టిన తవ్వకాలు

నిత్యం ఏదో ఒక చోట తవ్వకాలు

పురాతన కట్టడాలు ధ్వంసం

ఎందరో మృత్యువాత

ఉదయగిరి, ఏప్రిల్‌ 26: గుప్త నిధుల కోసం ఉదయగిరి దుర్గం గుల్ల చేస్తున్నారు. భూగర్భంలో ఉన్న ఘనులు వెలికితీసేందుకు తవ్వే విధంగా దుర్గంపై తవ్వకాలు జరుపుతున్నారు. దుర్గంపై రాజుల కాలంలో నిర్మించిన పురాతన కట్టడాలు అనేకమున్నాయి. ఈ పురాతన కట్టడాల్లో వజ్రాలు, వైడుర్యాలుంటాయని, వాటితో ఒక్కసారిగా ధనువంతులు కావచ్చనే ఆశతో పలువురు ముఠాగా ఏర్పడి నిత్యం ఏదో ఒకచోట తవ్వకాలు చేస్తున్నారు.  ఉదయగిరి దుర్గంపై 1513లో శ్రీకృష్ణదేవరాయులు, 1618లో గోల్కొండ నవాబులు, 1626లో ఢిల్లీ చక్రవర్తులు పాలన సాగించారు. ఆ కాలంలో దుర్గంపై ఎనిమిది కోటలు, రాజప్రసాదాలు, రాణివాసాలు, ప్రార్థనా మందిరాలు, ధాన్యాగారాలు, నాట్యశాలలు, ఏకాంత నివాసాలు, అశ్వ, గజశాలలు, సేవాస్థావరాలు, గోషా మసీదు, చిన్న, పెద్ద మసీదులు నిర్మించారు. ఆ నిర్మాణాలు వజ్ర, వైడుర్యాలతో చేపట్టి ఉంటారని కొందరి నమ్మకం. దీంతో స్థానికుల సహాయ సహకారాలతో చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన కొందరు గుప్తనిధుల ముఠాగా ఏర్పడి పురాతన గ్రంథాలను సేకరించి వాటి ఆధారంగా తవ్వకాలు చేపడుతున్నారు. అందుకు ఆ ప్రాంతంలో పూజలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. గుప్తనిధుల తవ్వకం ముఠాలకు మద్యం, భోజనాలు స్థానికులు సరఫరా చేస్తుండడంతో వారు పని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. అలాగే తవ్వకాలకు అవసరమైన డిటోనేటర్స్‌, జిలటిన్‌స్టిక్స్‌ తదితర పరికరాలను ఉపయోగిస్తూ తవ్వకాలకు ఉపయోగించే పనిముట్లను ద్రావకాల్లో నానబెడుతున్నట్లు సమాచారం. తవ్వకాల సమయంలో పూజలు నిర్వహించేందుకు కర్నాటక, కేరళ, చైన్నై తదితర ప్రాంతాల నుంచి మంత్రగాళ్లను తీసుకవస్తున్నారు.

గుప్తనిధుల వేటలో మృత్యువాత 

గుప్త నిధుల వేటలో కొందరు మృత్యువాత పడుతున్నారు. గత నెల 29వ తేదీన ఉదయగిరి మండలం సర్వరాబాదు అటవీ ప్రాంతంలో పది మంది రాత్రి వేళ గుప్త నిధుల కోసం వెళ్లారు. అడవి జంతువులకు కొందరు ఏర్పాటు చేసిన విద్యుత్‌ కంచె తగిలి ఆదే మండలానికి చెందిన లోకసాని కృష్ణయ్య మృతి చెందాడు. ఆ సమయంలో నిధులు వెలికతీసేందుకు తమిళనాడు నుంచి పూజలు చేసేందుకు ఓ వ్యక్తిని తీసుకువచ్చారు. వెలుగు చూడని ఇలాంటి సంఘటనలు మరెన్నో. తాజాగా మండలంలోని బండగానిపల్లి ఘాట్‌రోడ్డులోని కనుమబావి వద్ద ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి ఇనుపరాడ్లు తీసుకొని దుర్గం వైపు వెళ్లడాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఉదయగిరి దుర్గంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.



Updated Date - 2022-04-27T03:21:26+05:30 IST