గుప్పుమంటున్న గుడుంబా

ABN , First Publish Date - 2021-01-21T04:08:58+05:30 IST

జిల్లాలో మళ్లీ గుడుంబా అమ్మకాలు గుప్పుమంటున్నాయి. మారుమూల గ్రామాల్లో కొందరికి మంచి ఉపాధి మా ర్గంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం 2016లో గుడుంబా తయారుదారుల పునరావాస పథకాన్ని ప్రారంభించి జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించింది.

గుప్పుమంటున్న గుడుంబా
ఇటీవల నేరడిగొండ మండలంలో పట్టుకున్న నాటుసారాతో ఎక్సైజ్‌ శాఖ అధికారులు

జిల్లాలో మళ్లీ మొదలైన నాటు సారా దందా

కరోనా పరిస్థితులతో తిరిగి కథ మొదటికి

ఇచ్చోడ డివిజన్‌లో విచ్చలవిడిగా అమ్మకాలు

గుడుంబా రహిత జిల్లా ఉత్తమాటేనా?

ఆదిలాబాద్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మళ్లీ గుడుంబా అమ్మకాలు గుప్పుమంటున్నాయి. మారుమూల గ్రామాల్లో కొందరికి మంచి ఉపాధి మా ర్గంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం 2016లో గుడుంబా తయారుదారుల పునరావాస పథకాన్ని ప్రారంభించి జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించింది. ఈ పథకం కింద కొందరికి ప్రత్యామ్నాయంగా ఉపాధి మార్గం చూపడంతో మిగతా వారు యథావిధిగా గు డుంబా తయారీ పైనే ఆధారపడి పని చేస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మండలాల్లో దేశీదారు మద్యం జోరు కొనసాగుతుండగా ఏజెన్సీ, మారు మూల మండలాల్లో నాటుసారా తయారీ విచ్చల విడిగా సాగుతోంది. జిల్లాలో ప్రధానంగా నేరడిగొండ, ఇచ్చోడ, సిరికొండ, గుడిహత్నూర్‌, బజార్‌హత్నూర్‌ మండలాల్లో గుడుంబా తయారీ కొనసాగుతోంది. ఈ మండలాల్లో గతేడు 59 కేసులు నమోదు కాగా 69 మంది గుడుంబా తయారీదారులను అరెస్టు చేశారు. లక్షల విలువ చేసే పానకం బెల్లంను స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందో తెలుస్తూనే ఉంది. ఏదో అలసటను తీర్చుకునేందుకు అలవాటుగా చేసుకున్న వారందరికి గుడుంబ మద్యం లేనిదే కునుకు పట్టడం లేదంటు న్నారు. ఇలాంటి వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుం టున్న కొందరు తయారీ దారులు అడ్డగోలుగా అమ్మేసుకుంటూ అందిన కాడికి దండుకుంటున్నారు. అయితే జిల్లా ఎక్సైజ్‌ శాఖ అధికారులు మాత్రం  ప్రభుత్వానికి నాటుసారా తీవ్రత తక్కువగా ఉందని చూపుతూ తప్పుడు నివేదికలు ఇస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు చెబుతున్న దానికి, క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులకు ఎలాంటి పొంతన లేదంటున్నారు.

లాక్‌డౌన్‌తో మొదలు..

కరోనా వైరస్‌ ప్రభావంతో మూడు నెలల పాటు మద్యం దుకాణాలను మూసి వేశారు. దీంతో మద్యానికి అలవాటు పడిన కొందరు మందుబాబులు మారుమూల గ్రామాల్లో గుట్టుచప్పుడుకాకుండా నాటుసార తయారికి ఎగబడ్డారు.వారి అవసరాలతో పాటు కొంత మేరకు అమ్మేసుకుంటూ ఆదాయాన్ని సంపాదించారు. ఇలా మొదలైన నాటుసారా ప్రస్తుతం జిల్లాలో గుప్పుమంటూ కనిపిస్తుంది. ప్రత్యామ్నా యంగా ఉపాధి చూపిన వారిపై సరైన నిఘా సారించక పోవడంతో మళ్లీ అదే దందావైపు మొగ్గు చూపుతున్నారు.

తాజాగా నేరడిగొండ మండలంలో దాడులు..

జిల్లాలో గుడుంబా తయారీ పూర్తిగా తగ్గి పోయిం దనుకున్న సమయంలోనే మళ్లీ గుప్పుమనడంతో తాజాగా ఎక్సైజ్‌ శాఖ అధికారులు నేరడిగొండ మండ లంలోని లింగట్ల, ఈస్‌పూర్‌, సక్రెనాయక్‌ తండా గ్రామాల్లో దాడులు చేసి  నాటు సారాతో పాటు పాన కం బెల్లంను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సిరికొండ మండలంలోని చిమ్మన్‌గుడి, ఫకీర్‌నాయక్‌ తండా, ఇచ్చోడ మండలంలో జామిడి, జల్దా, సాత్‌నెంబర్‌ దాబా గ్రామాల్లో అధికంగానే ఈ దందా సాగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. మొత్తానికి ఇచ్చోడ డివిజన్‌ పరిధిలోని ఆయా మండలాల్లోనే అధికంగా గుడుంబా తయారీ కేంద్రాలు ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. 

నిర్మూలన ఉత్తమాటేనా..

జిల్లాలో గుడుంబ నిర్మూలన మాట ఉత్తదేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో గుడుంబా తయారుదారుల పునరావాస పథకం కింద ఎందరో మంది దరఖాస్తు చేసుకున్న కొందరికి మాత్రమే ఉపాధిని చూపి మిగతా వారిని నిర్లక్ష్యం చేయడంతోనే ఈ పరిస్థితికి దారి తీసిందంటున్నారు. ఎన్నో రోజుల పాటు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూసిన నాటుసార తయారీ దారులు గత్యంతరం లేక మళ్లీ అదే వృత్తిలోకి వెళ్లి పోయారు. అప్పుడే వందశాతం ఉపాధిని చూపి ఉంటే జిల్లాలో నాటుసారా వాసనలు ఉండేవి కాదంటున్నారు. ప్రభుత్వం జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించడంతో  అధికారులు సైతం ఈ దందాను తేలికగానే తీసుకోవడంతో చాపకింద నీరులా విస్తరిస్తు నే ఉంది. ఎంత చేసిన కథ మళ్లి మొదటికే రావడంతో ఎక్సైజ్‌ శాఖ అధికారుల్లో ఆందోళన కనిపిస్తోంది.

Updated Date - 2021-01-21T04:08:58+05:30 IST