సివిల్స్‌లో సత్తా.. పెదపరిమి యువకుడికి 76వ ర్యాంకు

ABN , First Publish Date - 2020-08-05T14:16:41+05:30 IST

తుళ్లూరు మండలం పెదపరిమికి చెందిన మల్లవరపు సూర్యతేజ సివిల్స్‌లో 76వ ర్యాంకు సాధించారు. తండ్రి శ్రీనివాసరావు కేంద్ర ప్రభుత్వ లేబర్‌ బ్యూరోలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసి కాలం చేశారు

సివిల్స్‌లో సత్తా.. పెదపరిమి యువకుడికి 76వ ర్యాంకు

గుంటూరుకు చెందిన మోహన్‌కృష్ణకు 283వ ర్యాంకు


(ఆంధ్రజ్యోతి - గుంటూరు): తుళ్లూరు మండలం పెదపరిమికి చెందిన మల్లవరపు సూర్యతేజ సివిల్స్‌లో 76వ ర్యాంకు సాధించారు. తండ్రి శ్రీనివాసరావు కేంద్ర ప్రభుత్వ లేబర్‌ బ్యూరోలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసి కాలం చేశారు. అప్పటినుంచి తల్లి సంధ్యారాణి కుమారుడు సూర్యతేజను సివిల్‌ సర్వీస్‌ పరీక్షలకు సిద్ధం చేస్తూ వచ్చారు. సూర్యతేజ గుంటూరు విజ్ఞాన్‌ హైస్కూల్‌ చదివి టెన్త్‌లో 555 మార్కులు సాధించారు. ఇంటర్‌ హైదరాబాద్‌ నారాయణలో, ఇంజనీరింంగ్‌ విశాఖ గీతం విద్యాసంస్థలో పూర్తి చేశారు. 2014 నుంచి హైదరాబాద్‌లో టీసీఎస్‌లో ఉద్యోగం చేశారు. 2014-16లోలో ఎంఏ సోషియాలజీ పూర్తి చేశారు. 2018 నుంచి ఉద్యోగానికి రాజీనామా చేసి ఫుల్‌టైం సివిల్‌ సర్వీస్‌ పరీక్షల ప్రిపరేషన్‌ కేటాయించారు. తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడం వలన బాల్యం నుంచే సివిల్‌లో విజయం సాధించాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నట్లు సూర్యతేజ తెలిపారు. ఐదో ప్రయత్నంలో 76వ ర్యాంకుతో ఏపీలో మొదటి స్థానం దక్కిందన్నారు.  ఐఏఎస్‌ అధికారిగా గ్రామీణ ప్రాంతాల అభివద్ధికి ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. సూర్యతేజను తల్లి సంధ్యారాణి స్వీట్లు తినిపించి అభినందించారు. 


గుంటూరుకు బృందావన్‌గార్డెన్స్‌కు చెందిన గొరిజాల మోహన్‌కృష్ణ సివిల్స్‌ పరీక్షల్లో 283వ ర్యాంకును సాధించారు. మోహన్‌కృష్ణ తండ్రి కరుణ రమణబాబు డీటీడీసీ కొరియర్‌లో మేనేజర్‌గా మేనేజర్‌గా పనిచేశారు. తల్లి భాను భవాని నిడుబ్రోలు కళాశాలలో తెలుగు  లెక్చరర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. పదో తరగతి వరకు నిడుబ్రోలులో, ఇంటర్‌ విజయవాడ నలందాలో చదివారు. ఇంటర్‌లో 958 మార్కులతో తంజావూరులో శస్త్ర యూనివర్సిటీలో మెరిట్‌లో సీటు సాధించారు. బీటెక్‌ పూర్తి చేసిన తరువాత గేట్‌ పరీక్షలో 325వ ర్యాంకుతో ముంబైలోని ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ సీటు సాధించారు. అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, టీసిఎస్‌ వంటి పెద్ద పెద్ద కంపెనీలలో మోహన్‌కృష్ణకు ఉద్యోగాలు వచ్చాయి. ప్రజాసేవ చేయాలనే కాంక్షతో సివిల్‌ సర్వీస్‌ వైపు మొగ్గు చూపారన్నారు. రెండున్నర ఏళ్లు ఢిల్లీలో, ఏడాదిన్నరపాటు హైదరాబాద్‌లో శిక్షణ పొందారు. నాలుగో ప్రయత్నంలో సివిల్‌ సర్వీస్‌కు ఎంపికయ్యారు. తల్లిదండ్రులతో పాటు మేనమామలు యలవర్తి రాజేంద్ర, విఠల్‌లను స్ఫూర్తిగా తీసుకొని సివిల్‌ పరీక్షకు సిద్ధమైనట్లు  మోహన్‌కృష్ణ తెలిపారు. తమ కుమారుడు సివిల్స్‌కు ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు ఆనందంతో మురిసిపోతున్నారు.  

Updated Date - 2020-08-05T14:16:41+05:30 IST