ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నోరు మెదపడం లేదెందుకు?

ABN , First Publish Date - 2020-08-07T14:56:44+05:30 IST

జిల్లా వైసీపీ నేతల్లో ప్రాంతీయ అభిమానం చచ్చిపోయింది..

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నోరు మెదపడం లేదెందుకు?

తరలుతున్నా.. తందానే..

వైసీపీ నేతల్లో పూర్తిగా కొరవడిన ప్రాంతీయ అభిమానం

అమరావతిని సమాధి చేస్తూ సీఎం నిర్ణయం చేసినా నోరు మెదపడం లేదు

పైగా మూడు రాజధానులను స్వాగతిస్తూ ప్రదర్శనలు

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీరుపై జనాగ్రహం


గుంటూరు(ఆంధ్రజ్యోతి): జిల్లా వైసీపీ నేతల్లో ప్రాంతీయ అభిమానం చచ్చిపోయింది. అమరావతి రాజధానిని సమాధి చేస్తూ మూడు రాజధానులకు సీఎం జగన్ నిర్ణయం తీసుకొన్నా కనీసం ఒక్కరు కూడా గళం విప్పడం లేదు. రాజధాని ప్రాంతం నుంచి ప్రజల ఓట్లతో గెలుపొందిన మంగళగిరి, తాడికొండ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకత వ్యక్తం చేయకపోగా సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తూ మాట్లాడుతున్నారు. 16 నెలల నుంచి జిల్లాకు కొత్తగా ఒక్క ఉపాధి కల్పన సంస్థను కూడా తీసుకురాలేకపోయినా ప్రజాప్రతినిధులు మూడు రాజధానులతో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని నమ్మశక్యం కాని వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం జగన్‌కు వంత పాడుతుండటం జిల్లా ప్రజల్లో ఆగ్రహజ్వాలని రేకెత్తిస్తోంది. 


ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు ఎవరైనా సరే ప్రాంతీయ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. తమ ప్రాంతానికి పలానా అభివృద్ధి ప్రాజెక్టు తీసుకొచ్చామని ఘనంగా చెబుతుంటారు. జిల్లాకు సంబంధించి రైల్వే డివిజన్ సాధన కోసం అప్పటి ఎంపీ రాయపాటి సాంబశివరావు ఎనలేని కృషి చేశారు. ఆ తర్వాత ఎంపీగా వచ్చిన వైవీ రావు కూడా విడిజన్ అభివృద్ధి కోసం కేంద్రంపై ఒత్తిడి చేసి ప్రాజెక్టులు సాధించారు. గుంటూరు-విజయవాడ, గుంటూరు-తెనాలి, నల్లపాడు-గుంతకల్లు డబ్లింగ్ ప్రాజెక్టులతో పాటు, నడికుడి-శ్రీకాళహస్తి నూతన రైలుమార్గం, గుంటూరు-పగిడిపల్లి బ్రాడ్ గేజ్ లైన్, విద్యుద్దీకరణ వంటి ప్రాజెక్టులను సాధించారు. రహదారుల అభివృద్ధికి కూడా బాటలు వేశారు. పల్నాడుకు గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు గోదావరి-పెన్నా నదుల అనుసంధానం ప్రాజెన్టుని గత సీఎం చంద్రబాబుతో మాట్లాడి మంజూరు చేయించారు. ఈ ప్రాజెక్టులోనే బొల్లాపల్లిలో భారీ రిజర్వాయర్ నిర్మాణాన్ని కూడా ప్రతిపాదించారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి అయితే పల్నాడు రూపురేఖలే మారిపోయేవి.


దివంగత స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల అభివృద్ధికి గత ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రామాలు చేపట్టారు. సీఆర్‌డీఏతో మాట్లాడి ఎన్టీఆర్ సాగర్(ఆంధ్ర ట్యాంక్‌బండ్)ని అభివృద్ది చేశారు. కోటప్పకొండని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దారు. అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట నియోజకవర్గంలోని కొండవీడు కోటకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అభివృద్ధి పనులు చేయించారు. అప్పటి మంత్రి రావెల కిషోర్‌బాబు ప్రత్తిపాడు నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మంజూరు చేయించారు. ఇలా వైసీపీ మినహా ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా గత ప్రభుత్వాల హయాంలో ఎమ్మెల్యేలు తమ ప్రాంత అభివృద్ధికి బాటలు వేశారు. రాష్ట్ర విభజన సమయంలో తమ పదవులకు రాజీనామాలు చేసి నిరాహార దీక్షలు నిర్వహించి జనాబిమానాన్ని పొందారు. అప్పుడు టీడీపీ ఎంపీగా ఉన్న వేణుగోపాల్‌రెడ్డి లోక్‌సభలో ప్రదర్శించిన పోరాట పటిమ యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీరాజనాలు పట్టేలా చేసింది.


చంద్రబాబు ముందుచూపుతో..

ఎవరూ అడగకుండానే చంద్రబాబునాయుడు సీఎంగా ఉండి అమరావతి రాజధానిని జిల్లాకు కేటాయించారు. గుంటూరు, విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి పట్టణ ప్రాంతాల మధ్యన అమరావతి రాజధానిని ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు బృహత్తరమైన ప్రణాళిక రూపొందించి అమలుకు శ్రీకారం చుట్టారు. అమరావతి నిర్మాణం కొనసాగితే ఆ ప్రాంతమే కాకుండా అటు విజయవాడ, ఇటు జిల్లాలోని అన్ని ప్రాంతాలు గణనీయంగా అభివృద్ధి సాధించేవి. అనతికాలంలోనే మేటి నగరంగా అమరావతి రూపాంతరం చెందేది. నాడు హైదరాబాద్‌లో సైబరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు బాటలు వేస్తే దానిని ఆ తర్వాత వైఎస్ కొనసాగించారు. అందువలనే హైదరాబాద్ నేడు దేశంలో ఒక ఉపాధి కల్పానా కేంద్రంగా మారింది. కొన్ని సంవత్సరాల్లోనే అమరావతి కూడా ఆ స్థాయికి చేరుకొనేదే. ఇప్పటికే రూ.10500 కోట్లు నిధులు అమరావతి అభివృద్ధికి వెచ్చించారు. మరో రూ.5వేల కోట్లు పెట్టుబడులు పెడితే అమరావతి దానంతట అదే అభివృద్ధి పథంలో దూసుకుపోయేది. ఇందుకు నిదర్శనం వేల మంది ఇప్పటికే ఇక్కడ నివాస ప్లాట్లను కొనుగోలు చేయడమే. 


అవకాశాన్ని వదలుకుని..

ఇంతటి అద్బుతమైన అవకాశాన్ని వైసీపీ నేతలు చేతులారా కాలదన్నుతున్నారు. జిల్లాలో ఆ పార్టీకి చెందిన 15మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు గెలిచారు. వీరిలో ఇప్పటివరకు అమరావతి రాజధాని రైతులకు సంఘీభావం తెలిపింది. ఒక్క నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రమే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగాలని ఆయన తొలినుంచి కోరుతున్నారు. ఎన్నికలకు ముందు రాజధాని ఇక్కడే ఉండాలని పలికిన గొంతులు నేడు మాట పెగలడం లేదు. గత ఏడాది నుంచి అమరావతి సమాధిగా మారిపోతున్నా నామమాత్రంగానైనా ప్రాంతీయ అభిమానాన్ని చాటకపోగా రాజధాని తరలింపుని స్వాగతిస్తున్నారు. వైసీపీ నాయకులు అవలంభిస్తున్న తీరు ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకేలా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు వలన ఆ పార్టీ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోయింది. కనీసం ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కూడా గెలుచుకోలేని పరిస్థితికి పడిపోయింది. ఇప్పుడు అమరావతి రాజధాని తరలింపు విషయంలోనూ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో వారి ఆగ్రహం ఓటు రూపంలో చవి చూడక తప్పదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Updated Date - 2020-08-07T14:56:44+05:30 IST