Guntur: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరాధ్య మృతి

ABN , First Publish Date - 2022-05-14T14:26:35+05:30 IST

గత కొన్ని రోజులుగా మృత్యువుతో పోరాడిన చిన్నారి ఆరాధ్య(5) మృతి చెందింది.

Guntur: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరాధ్య మృతి

గుంటూరు : గత కొన్ని రోజులుగా మృత్యువుతో పోరాడిన ఐదేళ్ల చిన్నారి ఆరాధ్య (Aradhya) మృతి చెందింది. జీజీహెచ్(GGH Hospital) వైద్యుల నిర్లక్ష్యంతో ఆరాధ్య ప్రాణాలు కోల్పోయింది. కంటి కురుపునకు చికిత్స కోసం నాలుగు రోజులు క్రితం చిన్నారి జీజీహెచ్‌లో చేరింది. శస్త్ర చికిత్స అనంతరం ఆరాధ్యను వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచారు. వైద్యం వికటించి వెంటిలేటర్‌పైకి చేరినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా... చిన్నారి పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో నాలుగు రోజుల క్రితం జీజీహెచ్ నుంచి రమేష్ ఆసుపత్రికి తరలించారు. రమేష్ ఆసుపత్రిలో కూడా ఆరాధ్య వెంటిలేటర్‌కే పరిమితమైంది. పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి క్రితమే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఆరాధ్య తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


ఏం జరిగిందంటే....

గుంటూరు జిల్లాలోని అంకిరెడ్డి పాలెంకు చెందిన పావని, ఏడుకొండలు కుమార్తె ఆరాధ్య(5). చిన్నారి తల్లిదండ్రలు కోర్టు సముదాయం వద్ద జిరాక్స్ షాపు నడుపుకుంటూ జీవిస్తున్నారు. కాగా... ఆరాధ్యకు కంటిపై కురుపు వచ్చింది‌. కురుపును గమనించిన తల్లిదండ్రులు వైద్యం చేయించాలని నిర్ణయించుకొన్నారు. గత వారం చిన్నారిని జీజీహెచ్‌కు తీసుకువచ్చారు. దీంతో వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని సూచించారు.  ఈ క్రమంలో గత శనివారం ఆరాధ్యకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయితే ఆపరేషన్ పూర్తయిన తర్వాత పాప పరిస్థితి విషమిచ్చింది. ఏకంగా వెంటిలేటర్‌పై ఉంచారు.


రెండు రోజుల తర్వాత కూడా పాప ఆరోగ్య పరిస్థితిపై మార్పు లేదు. ఈ విషయంపై తల్లిదండ్రులు వైద్యులను నిలదీయగా... ఆపరేషన్ తర్వాత పాప పరిస్థితి విషమిచ్చిందని ఆపరేషన్ ముందు ఏమైనా ప్రాబ్లెమ్స్ ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. దీంతో వైద్యులపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా... చిన్నారి విషయం  తెలుసుకున్న మంత్రి విడదల రజిని మెరుగైన వైద్యం చేయాలని ఆదేశించారు. దీంతో ఆరాధ్యను రమేష్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స కొనసాగించారు. చివరకు పరిస్థితి విషమించడంతో చిన్నారి ఆరాధ్య శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయింది. 

Read more