కణితి తొలగిస్తామని.. కాటికి పంపారు!

ABN , First Publish Date - 2022-05-15T08:36:19+05:30 IST

గుంటూరు జీజీహెచ్‌ వైద్యుల నిర్లక్ష్యం పుణ్యమాని.. ఎంతో చలాకీగా ఉండే ఐదేళ్ల చిన్నారి అర్ధంతరంగా తనువు చాలించింది. ఆస్పత్రికి వెళ్లినపాప కంటి పక్కన కంది గింజంత కణితి..

కణితి తొలగిస్తామని.. కాటికి పంపారు!

అశువులు బాసిన చిన్నారి ఆరాధ్య

గుంటూరు జీజీహెచ్‌ వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి

వారం రోజులుగా అచేతన స్థితిలో..  

ప్రైవేటు ఆస్పత్రికి తరలింపు.. చికిత్స పొందుతూ మృతి

బాధ్యులకు శిక్ష పడాలని కుటుంబ సభ్యుల డిమాండ్‌

యథావిధిగా విచారణకు కమిటీ 


గుంటూరు (జీజీహెచ్‌) మే 14: గుంటూరు జీజీహెచ్‌ వైద్యుల నిర్లక్ష్యం పుణ్యమాని.. ఎంతో చలాకీగా ఉండే ఐదేళ్ల చిన్నారి అర్ధంతరంగా తనువు చాలించింది. ఆస్పత్రికి వెళ్లినపాప కంటి పక్కన కంది గింజంత కణితి తొలగించాలని ఆస్పత్రికి తీసుకొచ్చిన పాపానికి ఆ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మత్తు (అనస్థీషియా) వైద్యుల నిరక్ష్యం కారణంగా.. వారం రోజులుగా అపస్మారక స్థితిలో ఉన్న యండ్రవల్లి ఆరాధ్య (5) శనివారం ఉదయం గుంటూరు రమేష్‌ ఆసుపత్రిలో కన్ను మూసింది. ఈ నెల 7వ తేదీన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరాధ్యకు చిన్నపిల్లల వైద్యులు ఆపరేషన్‌ చేశారు. ఆ సమయంలో అనస్థీషియా మోతాదు ఎక్కువవ్వడంతో చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. చేతులెత్తేసిన జీజీహెచ్‌ వైద్యులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జీవచ్ఛవంలా మారిన ఆరాధ్య చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూసింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో పోస్టుమార్టం పూర్తి చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. 


ప్రభుత్వానికి బాధ్యత లేదా?

చిన్నారి మృతికి కారణం ప్రభుత్వ వైద్యులు. కానీ ప్రభు త్వం వైపు నుంచి కనీసం పరామర్శలేదు. ఉమ్మడి జిల్లాకే మంత్రిగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని.. ఆస్పత్రిలో చిన్నారి ఉన్నప్పుడు గానీ.. కనీసం చనిపోయిన రోజు గానీ ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి స్వగ్రామం అంకిరెడ్డిపాలేనికి చెందిన ఆరాధ్య కుటుంబం కావడంతో ఆయన శనివారం జీజీహెచ్‌ మార్చురీకి వచ్చి కుటుంబాన్ని పరామర్శించి ఒకసారి ఆఫీసుకు వచ్చి కలవమని చెప్పి వెళ్లిపోవడమే ఆ కుటుంబానికి దక్కిన అతిపెద్ద పరామర్శ. 




విచారణ పేరిట వేధించారు: తల్లి పావని

వైద్యుల నిర్లక్ష్యంతో వారం రోజులుగా తీవ్ర మానసిక వేదనకు గురైన తమ కుటుంబం విచారణల పేరుతో ఎన్నో అవమానాలను ఎదుర్కొందని ఆరాధ్య తల్లి పావని వాపోయింది. ఐసీయూలో చేరింది మొదలు ఏదో ఒకరకంగా తప్పు తమ బిడ్డలోనే ఉందన్న కోణంలో మానసికంగా వేధించారని తెలిపింది.  తాము ఏ పరిహారమూ కోరడం లేదని, తప్పు ఎవరిదో తేల్చి శిక్షించాలని మాత్రమే డిమాండ్‌ చేస్తున్నామన్నారు.


యథావిధిగా కమిటీ

జీజీహెచ్‌లో ఏది జరిగినా ఒక కమిటీ వేయడం, ఆ కమిటీ వైద్యులు.. వైద్యులకు కూడా అర్థం కాని ఓ కొత్త రోగం మృతులకు అంటగట్టడం, చేతులు దులుపుకోవడం దశాబ్దాలుగా జరుగుతున్న తంతు. ఒక్కరికి కూడా శిక్ష పడ్డ దాఖలాలు లేవు. ఆరాధ్య విషయంలో కూడా అదే మొదలైంది. ఓ కమిటీని వేసి విచారణకు ఆదేశించారు. అయితే, బాధ్యులకు శిక్ష పడితే తప్ప ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయని స్థానికులు అనుకుంటున్నారు.

Updated Date - 2022-05-15T08:36:19+05:30 IST