గుట్టుగా.. గుళికలు.. గుంటూరు కేంద్రంగా తయారీ!

ABN , First Publish Date - 2020-09-24T14:28:46+05:30 IST

ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చి బయో కంపెనీలు వరి రైతు లను నట్టేట ముంచుతున్నాయి..

గుట్టుగా.. గుళికలు.. గుంటూరు కేంద్రంగా తయారీ!

మట్టి, డస్ట్‌కు రంగులేసి అమ్మకాలు

రూ.15 పెట్టుబడి.. రూ.100కు విక్రయం

రైతులను నట్టేట ముంచుతోన్న కంపెనీలు

మామూళ్ల కోసమే అధికారుల దాడులని ఆరోపణలు


(ఆంధ్రజ్యోతి - గుంటూరు): మా గుళికలు వాడితే.. వరి మొక్కలు బాగా దిబ్బు కడతాయి.. పంట బాగా పండుతోంది.. జింక్‌ లోపం పోతోంది.. అంటూ ఆకర్షణీయమైన ప్రకటనలతో రైతుల ను కొన్ని కల్తీ బయో కంపెనీలు  నట్టేట ముం చుతున్నాయి. రూ.10, రూ.15 పెట్టుబడి పెట్టి తయా రు చేసే గుళికలను కేజీ వందకు విక్రయిస్తున్నారు. ఐదు కేజీల బ్యాగును విక్రయించినందుకు వ్యాపారులకు రూ.250 వరకు లాభం ఉంటుంది. దీంతో రైతులకు వీటిని అంటగడు తున్నారు. బంక మట్టి, క్రషర్లు, గ్రానైట్‌ కంపెనీల డస్ట్‌ సేకరించి వివిధ రసాయనాలను మిళితం చేసి గుళికలుగా విక్ర యిస్తున్నారు. గుంటూరు కేంద్రం గా పదిహేనేళ్ల నుంచి గుళికలను గుట్టుగా తయారు చేస్తున్నా అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తు న్నారనే ఆరోపణలున్నాయి.  


ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చి బయో కంపెనీలు వరి రైతు లను నట్టేట ముంచుతున్నాయి. బంకమట్టి, క్రషర్లు, గ్రానైట్‌ కంపెనీల డస్ట్‌ సేకరించి వివిధ రసాయనాలను మిళితం చేసి గుళికలుగా విక్రయిస్తున్నారు. ప్రముఖ కంపెనీలు బెంటోనైట్‌ (బంకమట్టి)కు సీవిడ్‌ ఎక్స్‌టాక్ట్‌ అనే సముద్రంలో ఉండే నాచు పదార్థంతో తయారు చేసే ముడి పదార్థాన్ని కలిపి గుళికలు విక్ర యిస్తుంటారు. అయితే కల్తీ వ్యాపారులు మాత్రం బెంటోనైట్‌ బంకమట్టి బదులు క్రషర్లు, గ్రానైట్‌ కంపెనీలో ఉండే వ్యర్థాలను తక్కువ రేటుకు కొనుగోలు చేసి దానికి ఘాటైన రసాయనాలను, వివిధ రంగులను మిళితం చేసి తయారు చేస్తారు. కిలో గుళికల తయారీకి రూ.10-15 ఖర్చువుతుంది.


దీనిని కిలో రూ.100 చొప్పున ఐదు కిలోలను ఆకర్షణీయంగా రూపొందించిన సంచిలో ఉంచి రూ.500కు అమ్ముతుంటారు. డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లకు రూ.250 చొప్పున కమీషన్‌ ఇస్తారు. దీంతో వ్యాపారులు భారీగా ఆదాయం వస్తుండటంతో రైతులకు వీటిని అంటగడుతున్నారు. ప్రధానంగా ఈ గుళికలను వరిలో ఉపయోగిస్తుంటారు. అది కూడా వరినాట్లు వేయడానికి ముందు చల్లుతుంటారు. అయితే ఈ కల్తీ గుళికల వల్ల పంటకు ఎటువంటి  ప్రయోజనం ఉండదని వ్యవసాయ అధికారులు తెలిపారు. సాగర్‌, గుంటూరు చానల్‌ పరిధిలో వరి నారు పోస్తున్నారు. దీంతో ఎక్కువ మంది గుళికలు కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు.


ఇతర రాష్ట్రాలకు రహస్యంగా సరఫరా..

రాష్ట్రవ్యాప్తంగా దిబ్బు గుళికలు తయారు చేసే కంపెనీలు సు మారు 50 వరకు ఉన్నాయి.  గుంటూరులోని గోరంట్ల, నగరాలు, ఆటోనగర్‌, పరిసర ప్రాంతాల్లో పాడుబడిన గిడ్డంగులను అద్దెకు తీసుకొని వీటిని తయారు చేస్తున్నారు. తెలంగాణకు చెందిన కొంతమంది బయో వ్యాపారులు ఏపీలో ఇతర ఉత్పత్తులకు వీటిని అనుసంధానం చేసి మార్కెట్‌లోకి పంపుతున్నారు. గుంటూరు కేంద్రంగా 10-15 ఏళ్ల నుంచి కల్తీ గుళికలను తయారు చేసి రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలకు పంపుతున్నారు. తెలంగాణ, మరికొన్ని ఇతర రాష్ర్టాల్లో పెద్దఎత్తున అమ్మకాలు సాగుతున్నాయి. రెండు నెలల నుంచి గుంటూరు కేంద్రంగా వివిధ జిల్లాలకు రాత్రివేళల్లో రహస్యంగా లారీలలో కల్తీ గుళికలు రవాణా సాగుతున్నట్లు సమాచారం. 


విజిలెన్స్‌, వ్యవసాయ శాఖ అధికారులు కేవలం మా మూళ్ళ కోసమే తయారీ కేంద్రాలపై దాడులు చేసి తనిఖీలు చేస్తుంటారని ఆరోపణలు ఉన్నాయి. గోరంట్లలోని గుళికల తయారీ కంపెనీలపై రెండు వారాల క్రితం విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసినట్టు తెలిసింది. రూ.10 లక్షల సరుకును సీజ్‌ చేసినట్లు రికార్డుల్లో నమోదు చేసి ఈ వ్యవహారాన్ని బయటకు పొక్కనివ్వలేదు. ఆ తర్వాత రహస్యంగా ఈ వ్యవహారాన్ని సెటిల్‌ చేసినట్లు తెలిసింది.   గుళికల తయారీలో ఆయా ప్రాంతాల్లో  విషవాయువు పెద్ద ఎత్తున వస్తుంటుంది. నాలుగేళ్ల క్రితం గోరంట్లలో ఈ విషవాయువుతో ఓ కార్మికుడు మృతి చెందాడు. బయో ఎరువులకు ఎటువంటి లైసెన్సులు అవసరం లేదని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయంటూ జిల్లాలో యథేచ్ఛగా ఈ చీకటి వ్యాపారాన్ని కొందరు సాగిస్తున్నారు. 


వెంటనే చర్యలు తీసుకుంటాం

గుంటూరు పరిసర ప్రాంతాల్లో తయారవుతున్న కల్తీ గుళికల తయారీ కేంద్రాలపై దాడులు చేస్తాం, రైతులను మోసగించే కల్తీ ఎరువుల కంపెనీలపై కేసులు నమోదు చేస్తాం. బయో వ్యా పారులు తయారు చేసే ఉత్పత్తుల్లో శాంపిల్స్‌ సేకరించి నాణ్యతను ధ్రువీకరించి కఠిన చర్యలు తీసుకుంటాం. - దినేష్‌కుమార్‌ జేసీ




Updated Date - 2020-09-24T14:28:46+05:30 IST