తీర్మానాలు సరే.. అమలు

ABN , First Publish Date - 2022-08-08T06:07:08+05:30 IST

ఎన్నో ఏళ్ల తర్వాత గుంటూరు నగర పాలక సంస్థ పాలకవర్గం కొలువుతీరింది. కౌన్సిల్‌ లేక నగర పరిధిలోని డివిజన్లలో ఎన్నో సమస్యలు కొలువుతీరాయి.

తీర్మానాలు సరే.. అమలు

క్షేత్రస్థాయిలో పట్టించుకునే వారే లేరు 

కౌన్సిల్‌లోని ప్రధాన అంశాలు సైతం పక్కదారి

నేడు కౌన్సిల్‌ సమావేశం.. 206 అంశాలతో అజెండా 

గుంటూరు(కార్పొరేషన్‌), ఆగస్టు 7: ఎన్నో ఏళ్ల తర్వాత గుంటూరు నగర పాలక సంస్థ పాలకవర్గం కొలువుతీరింది. కౌన్సిల్‌ లేక నగర పరిధిలోని డివిజన్లలో ఎన్నో సమస్యలు కొలువుతీరాయి. ఏడాది క్రితం పాలకవర్గం కొలువుతీరింది. దీంతో ప్రధాన సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు ఆశించారు. ఆ ప్రకారమే పాలకవర్గం నగరంలోని ప్రధాన సమస్యలపై చర్చించి తీర్మానాలు చేసింది. ఇంకేమి సమస్యలు పరిష్రామే తరువాయి అని అందరూ ఎదురూచూశారు. అయితే రోజులు గడుస్తున్నాయి.. కౌన్సిల్‌ సమావేశాలు జరుగుతున్నాయే కాని గత తీర్మానాలు అమలు కావడంలేదు. ప్రతి కౌన్సిల్‌ సమావేశంలో గత తీర్మానాల అమలు గురించి ఆలోచించేవారు లేరు. దీంతో తీర్మానాలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి.   నగరపాలక సంస్థ పాలక వర్గం కొలువుతీరి గత నెలతో ఏడాది పూర్తి చేసుకుంది. ఈ ఏడాదిలో కౌన్సిల్‌ సమావేశంలో చేసిన తీర్మానాలు  అమలుకు నోచుకోలేదని కార్పొరేటర్లు, పలువురు ఎమ్మెల్సీలు ఆవేదన చెందుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కౌన్సిల్‌లో చర్చించి తీర్మానించడం తప్ప అమలుకు నోచుకోకపోవడంతో తమ ప్రతిపాదనలకు విలువేముందంటూ అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్లే వాపోతున్నారు. 

అమలుకు నోచుకోని తీర్మానాల్లో కొన్ని.. 

- అమరావతిరోడ్డులో అనధికార నిర్మాణంలో ముగ్గురి మృతికి కారణమైన భవన యజమానిపై చర్యలు తీసుకోలేదు. ఆరోపణలు ఎదుర్కొన్న అధికారిని కేవలం బదిలీ చేశారు. దీంతో ఈ వ్యవహారం మరుగునపడింది. 

- అనధికారిక హోర్డింగుల నుంచి నిబంధనల ప్రకారం నగదు వసూలు చేయలేదు. 8 వేలకు పైగా ఉన్న హోర్డింగ్‌లను గుర్తించి యూనిక్‌ నెంబర్‌ ఇవ్వాలని కౌన్సిల్‌ తీర్మానించారే కానీ అమలు కాలేదు.

- ఆర్‌యూబీ, ఆర్‌వోబీల నిర్మాణాలపై చర్యలు తీసుకోలేదు.

- నార్ల ఆడిటోరియం,  రెడ్‌ ట్యాంక్‌లను వినియోగంలోకి తీసుకురాలేదు.

-  యూజీడీ వ్యవస్థ మెరుగునకు ప్రత్యేక నిధులు కోసం సీఎంను కలవాలన్న నిర్ణయం కార్యరూపం దాల్చలేదు. 

-  ఈ-బస్‌బేలను వ్యతిరేకిస్తూ కౌన్సిల్‌లో తీర్మానం చేశారే కాని పట్టించుకున్న వారే లేరు. 

-  పారిశుధ్య కార్మికులు విధులకు సంబంధించి చేసిన తీర్మానంపై చర్యలు లేవు.  

-  నగరంలో చెత్త సేకరణను మళ్ళీ రామసేతు సంస్థకు అప్పగించడంపై పలువురు కార్పొరేటర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా అదే సంస్థకు అప్పగించారు.

-  మరుగుదొడ్ల నిర్వహణ, నగదు గోల్‌మాల్‌పై పట్టించుకోలేదు.  

-  నగరంలో అనధికారిక నిర్మాణాలపైన, రూ.100 కోట్ల  టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంపైనా ఎటువంటి చర్యలు లేవు. 

-  అధునాతన చేపల మార్కెట్‌, జంతు కబేలా నిర్మాణాలపై పట్టించుకునేవారే లేరు. 

-  నగరంలో 16 ప్రాంతాల్లో కూడళ్ల అభివృద్ధికి సంబంధించిన తీర్మానం బుట్టదాఖలైంది.  

 

Updated Date - 2022-08-08T06:07:08+05:30 IST