గుంటూరులో.. వైరస్‌ వర్రీ.. ఆదివారం ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

ABN , First Publish Date - 2020-07-13T13:43:24+05:30 IST

జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. వందల సంఖ్యలో కేసులు..

గుంటూరులో.. వైరస్‌ వర్రీ.. ఆదివారం ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

జిల్లాలో కొత్తగా 255 కరోనా పాజిటివ్‌ కేసులు

గుంటూరులో 114.. వినుకొండలో 31 


గుంటూరు(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. వందల సంఖ్యలో కేసులు నమోదవడం అందరినీ కలవరపెడుతోంది. జిల్లావ్యాప్తంగా ఆదివారం 255 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుంటూరు నగరంలో 114 కేసులు వెలుగు చూడగా, జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో 141 కేసులు నమోదయ్యాయి. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఒకే రోజు 12 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. యడ్లపాడు పైపల్లెకు చెందిన 7గురికి, చాకలి బజారులో కేబుల్‌ టీవీలో పనిచేసే ఒకరికి, పాతూరుకు చెందిన డ్రైవర్‌కి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. మండలంలోని సందెపూడి గ్రామానికి చెందిన భార్యాభర్తలకు కూడా పాజిటివ్‌ నిర్ధారించారు. కావూరు గ్రామానికి చెందిన యువకుడికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. పొన్నూరు పట్టణంలోని 30వార్డుకు చెందిన తల్లి, తనయునికి కరోనా పాజిటివ్‌ నిర్ధారించారు. సత్తెనపల్లిలో మరో ఐదుకేసులు నమోదైనట్లు పట్టణ కమిషనర్‌ శ్రీనివాసరావు తెలిపారు. క్రిస్టియన్‌పేటలో ఒకటి, శ్రీనివాస్‌మహల్‌ దగ్గర రెండు, వడ్డవల్లిలో ఒకటి, తాలుకా సెంటర్‌లో ఓ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు.


నరసరావుపేటలో కొత్తగా ఆరు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రామిరెడ్డిపేట, మల్లమ్మ సెంటర్‌, 1వ వార్డు, 3వవార్డు, ఇసప్పాలెం ప్రాంతాల్లో  కొత్తగా కేసులు నమోదయ్యాయి. పట్టణంలో కేసులు 356కు పెరిగాయి. అమరావతి మండలంలో మూడు కరోనా పాజిటవ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారి డాక్టర్‌ కె.శ్రీజ్యోతి తెలిపారు. భట్టిప్రోలు మండలంలోని వెల్లటూరు పీహెచ్‌సీ  పరిధిలోని ఓలేరులో ఓ మహిళకు, వెంకటరాజునగర్‌లో మరో మహిళకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు పీహెచ్‌సీ వైద్యురాలు సీహెచ్‌ రామలక్ష్మి తెలిపారు. మండల కేంద్రం భట్టిప్రోలులో ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాబడినట్లు వైద్యురాలు ఎ.సీతాకుమారి తెలిపారు. వేమూరు మండలం పెరవలిపాలెంకి చెందిన ఓ వ్యక్తికి కరోనా నిర్ధారణ ఆయినట్లు వైద్యాధికారి వెంకట సురేష్‌ తెలిపారు. దుగ్గిరాల మండలం పెదపాలెంలో ఓ మహిళకు కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. 


మాచర్ల పట్టణంలో ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 25వ వార్డులో నలుగురు, 24, 29, 11, 15 వార్డుల్లో ఒక్కొక్కరికి పాజిటివ్‌గా తేలింది. పిడుగురాళ్ల పట్టణంలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. దుర్గి మండలంలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి.  ధర్మవరానికి చెందిన వివాహిత క్యాన్సర్‌ చికిత్స కోసం 20 రోజుల క్రితం హైదరాబాద్‌ వెళ్లింది. అక్కడ చికిత్స పొందుతూ  ఆమె శనివారం మృతి చెందింది. పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలింది. రెంటచింతల వద్ద సత్రశాలలోని టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టులో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారలు ధ్రువీకరించారు.


తెనాలి పట్టణంలో ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కొత్తపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒకే కుటుంబంలో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ కుటుంబంలోని యాజమాని విజయవాడలో నిర్మాణరంగంలో ఉన్నారు. ఆయన భార్య, కుమారుడు, అల్లుడికి కూడా వైరస్‌ సోకింది. చెంచుపేట, మారీసుపేటలో కూడా ఒక్కో కేసు నమోదైనట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయవర్గాలు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం వచ్చిన టెస్టుల ఫలితాల్లో తెనాలిలో మరో 9 మందికి కరోనా సోకినట్లు తెలిసింది. దీనిని వైద్యశాఖ వర్గాలు ధ్రువీకరించాల్సి ఉంది. 


అమృతలూరులోని ఎస్సీ కాలనీలో ఓ గర్భిణికి కరోనా  పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైధ్యాధికారి ఏసుబాబు తెలిపారు. కొల్లూరు మండలలోని గుంటూరుగూడెంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు తహసీల్దార్‌ జాన్‌పీటర్‌ ఆదివారం తెలిపారు. కొల్లిపర మండలంలోని దావులూరిపాలెంలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు  తెలిపారు. రేపల్లె హౌసింగ్‌ బోర్డు కాలనీలో నివాసం ఉంటూ చందోలు స్టేషన్‌లో నివాసం ఉంటున్న  ఓ కానిస్టేబుల్‌కు పాజిటివ్‌గా నిర్థారణ అయిందని ఆయన తెలిపారు. బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మీపురానికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ముప్పాళ్ళ మండలంలో పలుదేవర్లపాడులో రెండు, కుందూరువారిపాలెంలో ఓ పాజిటివ్‌ కేసు నమోదైనట్టు అధికారులు  ధ్రువీకరించారు. దాచేపల్లి మండలంలో ఏడు కరోనా పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. మంగళగిరి మండలంలో కొత్తగా 8 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఆత్మకూరు చెరువు వద్ద ఒకరికి, అపార్ట్‌మెంటులో నలుగురికి, చినకాకానిలో ఒకరికి, కాజ అపార్ట్‌మెంటులో ఒకరికి, పెదవడ్లపూడి ఎస్సీ కాలనీలో ఒకరికి పాజిటివ్‌ నమోదు అయ్యినట్లు తెలిపారు.  తాడేపల్లి మండల, పట్టణ పరిధిలో ఆదివారం 12 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. పట్టణ పరిధిలోని బైపాస్‌ రోడ్‌లో 2, మహానాడు, సీతానగరం, రూరల్‌ ప్రాంతాల్లో 10 కోవిడ్‌ కేసులు నిర్దారణ అయినట్లు తెలిపారు. 


వినుకొండలో 31 కేసులు.. 

వినుకొండ పట్టణంలో కొత్తగా 31 కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్‌వో కార్యాలయం వెల్లడించింది.  మరో ఆరు కేసులు కూడా నమోదు కాగా వీటిని ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. దక్షిణం బజారులోని రంగనాయకస్వామి గుడి వద్ద నుంచి బోసుబొమ్మసెంటర్‌ వరకు ఒకే వీధిలో 29 కేసులు నమోదుకావడంతో పట్టణవాసులు భయాందోళనకు గురవుతున్నారు. హనుమాన్‌నగర్‌ ఐదుకేసులు, శ్రీనివాసనగర్‌లో, రైల్వేస్టేషన్‌ సమీపంలో గల ఓ అపార్ట్‌మెంట్‌, వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో ఒక్కో కేసు నమోదైనట్లు తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈపూరు మండలంలో ఈపూరు, ముప్పాళ్ల, వనికుంటలో ఒక్కోకేసు నమోదైనట్లు  వైద్యుడు నాగేంద్రబాబు తెలిపారు. 


Updated Date - 2020-07-13T13:43:24+05:30 IST