నగరం.. నిర్మానుష్యం

ABN , First Publish Date - 2021-04-23T05:56:30+05:30 IST

కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు నగరంలో గురువారం సాయంత్రం సాయంత్రం 6 గంటల నుంచి లాక్‌డౌన్‌ ప్రారంభించారు.

నగరం.. నిర్మానుష్యం
జనసంచారం లేని మార్కెట్‌ సెంటర్‌

ప్రారంభమైన కరోనా లాక్‌డౌన్‌ ఆంక్షలు

సాయంత్రం 6 గంటలకు మూతబడిన దుకాణాలు

గుంటూరు, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు నగరంలో గురువారం సాయంత్రం  సాయంత్రం 6 గంటల నుంచి లాక్‌డౌన్‌ ప్రారంభించారు. అర్బన్‌ పోలీసు, నగరపాలకసంస్థ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ఈ ఆంక్షలు ప్రారంభమయ్యాయి. పెరుగుతోన్న కేసులు, మరణాలు కూడా ప్రజల్లో కొంత ఆందోళన కలిగిస్తోన్నాయి. దీంతో చాలామంది వ్యాపారులు స్వచ్ఛందంగానే నిర్ణీత సమయానికి దుకాణాలు మూసి వేశారు. కొందరు మాత్రం ఆ ఆంక్షలు తమకు కాదన్న ధోరణిని ప్రదర్శించి దుకాణాలు తెరిచి ఉంచగా పోలీసులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి మూయించారు. కేవలం మెడికల్‌ షాపులు మాత్రమే తెరిచేందుకు అనుమతించారు. రోడ్డు సైడు తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునే వారిని కూడా పోలీసులు పంపించేశారు. సాయంత్రం 5.30 గంటలకే నగరంలోని వివిధ పోలీసుస్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు విజిల్స్‌ వేస్తూ చక్కర్లు కొట్టారు. దుకాణాలు మూతబడటంతో సాయంత్రం ఆరు గంటల నుంచి నగరంలోని బ్రాడీపేట, లక్ష్మీపురం, పట్నంబజారు, ఏలూరుబజారు, పండ్ల మార్కెట్‌, లాలాపేట, పాతగుంటూరు తదితర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. కొన్ని చోట్ల మాత్రం హలీం పాయింట్‌లు అలానే తెరిచి ఉంచారు. 

కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో బాధితుల ఇక్కట్లు

అడవి తక్కెళ్లపాడు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో గురువారం రాత్రి గంటకు పైగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అసలే వేసవికాలం, దీనికి తోడు ఉక్కపోత విపరీతంగా ఉండటంతో ఐసోలేషన్‌ గదుల్లో బాధితులు ఉండలేక బయటకు వచ్చేశారు. అలానే అక్కడ దోమల ఉద్ధృతి తీవ్రంగా ఉండటంతో ఇబ్బందులకు గురయ్యారు. కొవిడ్‌-19 పాజిటివ్‌గా టెస్టింగ్‌ అయిన వారు అంతా భౌతిక దూరం పాటించకుండా తిరగడంతో ఏమౌతుందోనని అంతా ఆందోళన చెందుతోన్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కి ఒక డెడికేటెడ్‌ విద్యుత్‌ లైన్‌ని ఏర్పాటు చేయాలని వారు కోరారు. 




Updated Date - 2021-04-23T05:56:30+05:30 IST