Abn logo
Aug 15 2020 @ 06:39AM

కరోనాలో.. పండుగ ఎలా?

చవితి ఉత్సవాలపై కొవిడ్‌ ప్రభావం

పలు ప్రాంతాల్లో వేల సంఖ్యలో విగ్రహాలు సిద్ధం

చవితిపై ఆధారపడిన వారంతా నష్టపోయే పరిస్థితి ఉత్పన్నం

కొవిడ్‌-19 మార్గదర్శకాల కోసం నిర్వాహకులు ఎదురుచూపు 


వినాయక చవితి.. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా.. పేద గొప్ప వివక్ష చూపకుండా భారీగా చేసుకునే పండుగ. ప్రతీ ఏటా జిల్లావ్యాప్తంగా ఆర్భాటంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు భారీగా నిర్వహించేవారు. అయితే ఈ ఏడాది చవితి పర్వదినంపై కరోనా కన్నెర్ర చేస్తోంది. వాడవాడలా సందడిగా చేసుకునే పండుగ నిర్వహణపై ఇప్పటి వరకు అధికార యంత్రాంగం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. దీంతో నిర్వాహకులు ఏం చేయాలో.. ఎలా పండుగ జరుపుకోవాలో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు.


ఇక ఈ పండుగ కోసం ఏడాదిగా ఎదురు చూసే వినాయక విగ్రహ తయారీదారులు, అమ్మకందారులు, ఇతర వర్గాల వారు నిరాశలో ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో పలు ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో వినాయక విగ్రహాలు తయారుకాగా విక్రయాల కోసం ఎదురుచూస్తున్నాయి. రోజురోజుకు పల్లెపట్టణం అన్న తేడా లేకుండా వైరస్‌ వ్యాప్తి తీవ్రమవుతోంది. ఈ పరిస్థితుల్లో పండుగ నిర్వహణపై అందరిలోనూ సంశయం వ్యక్తమవుతోంది.


గుంటూరు: జిల్లా అంతటా ఏటా వినాయక చవితి ఉత్సవాలను వైభవోపేతంగా అత్యంత భారీగా నిర్వహించేవారు. ఊరూవాడా వేల సంఖ్యలో పందిళ్ళు వేసి భారీ విగ్రహాలను ప్రతిష్ఠించి ఉత్సవాలను నిర్వహించేవారు. చవితి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది.  ఏటా చవితికి నెల రోజుల ముందు నుంచే ఉత్సవాల హడావుడి ప్రారంభమౌతుంది. ఈ నెల 22న పండుగ. ఈ క్రమంలో ఈ పాటికి అన్ని ప్రాంతాల్లో మండపాల నిర్మాణ పనులు, లైటింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు ప్రారంభం కావాల్సి ఉంది.


అయితే కరోనా కారణంగా ఉత్సవాల హడావుడి కన్పించడంలేదు. ఏటా వలే ఈ ఏడాది గణపతి ఉత్సవాలు భారీ స్థాయిలో జరిగే పరిస్థితులు కన్పించడంలేదు. నరసరావుపేటలో వందల సంఖ్యలో  గణపతి విగ్రహాలను విక్రయానికి రాజస్థాన్‌ కళాకారులు ముస్తాబు చేస్తున్నారు. అయితే విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని కళాకారుడు దేవా తెలిపారు. ఏటా నెల రోజుల ముందు నుంచే విక్రయాలు ప్రారంభమయ్యేవని ఈ సారి ఆ పరిస్థితి లేదన్నారు. పల్లెల నుంచి వచ్చి నామమాత్రంగా విగ్రహాలు కొన్నారని, పట్టణాల నుంచి పెద్దగా కొనుగోళ్ళు లేవని తెలిపారు.


ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి ఆర్డర్‌లు పెద్డగా లేవని విద్యుత్‌ అలంకరణలు, మండపాల నిర్మాణదారులు చెబుతున్నారు. చవితికి ఇంకా ఎనిమిది రోజులే సమయం ఉంది. విగ్రహాల తయరీదారులైన కళాకారులు విక్రయాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. గణపతి ఉత్సవాలను భారీగా నిర్వహించవద్దని పలు చోట్ల ఇప్పటికే పోలీసు శాఖ ప్రకటించింది.     


నిబంధనల కోసం నిరీక్షణ

కరోనా నేపథ్యంలో చవితి పండుగ ఎలా నిర్వహించుకోవాలనే దానిపై జిల్లా యంత్రాంగం జారీ చేసే కొవిడ్‌-19 మార్గదర్శకాల కోసం నిర్వాహకులు ఎదురు చూస్తోన్నారు. పండుగని ఎవరికి వారు ఇళ్లల్లోనే చేసుకునేలా ఆదేశాలు వెలువడే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. దేవాలయాల్లో కూడా పరిమిత సంఖ్యలోనే  నిర్వహించేందుకు అనుమతిస్తారని అధికారులు చెబుతున్నారు. కరోనా వ్యాప్తి ప్రారంభమైన తర్వాత ఉగాది, శ్రీరామనవమి వేడుకలను ఇళ్లల్లోనే నిర్వహించుకునేలా జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేయగా వాటిని ప్రజలు పాటించారు.


ఆ తర్వాత రంజాన్‌, గుడ్‌ఫ్రైడే, బక్రీద్‌ పండుగలు రాగా వాటికి కూడా ప్రభుత్వం స్టాండర్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌(ఎస్‌వోపీ)ని జారీ చేసింది. శ్రావణమాసం పూజలు కూడా మహిళలు చాలా వరకు ఇళ్లల్లోనే చేసుకున్నారు. బక్రీద్‌ సమయంలో ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలకు అనుమతి ఇవ్వలేదు. గుడ్‌ఫ్రైడే సందర్భంలో శ్మశాన వాటికలకు అనుమతించలేదు. గత కొన్నేళ్లుగా వినాయక చవితి పండుగని జిల్లా వ్యాప్తంగా మూడు నుంచి తొమ్మిది రోజుల పాటు వాడవాడలా భారీగా నిర్వహించారు. నిత్యం అన్నదానం, నిమజ్జనం రోజున భారీ ఊరేగింపు, ఆర్కెస్ట్రాలు, బ్యాండ్‌బాజాలు, బాణాసంచా కాల్పులు, లడ్డూ వేలం పాటలు పెద్దఎత్తున నిర్వహించేవారు. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా వీటిల్లో ఎంతవరకు అనుమతిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.


ఇతర పండుగలకు ఇచ్చిన అనుమతులను పరిగణనలోకి తీసుకుంటే చవితి ఉత్సవాల నిర్వహణకు అనుమతిస్తారో, లేదోనన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇచ్చినా పరిమిత సంఖ్యలోనే ఇవ్వవచ్చన్న అభిప్రాయం వ్యక్తమౌతోన్నది. పండుగ సమీపిస్తోన్నందున వెంటనే అధికారులు పండుగ అనుమతులపై ఏ విషయాన్ని త్వరగా తేల్చాలని ఉత్సవ నిర్వాహకులు కోరుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement