గన్నీ బ్యాగుల కొరతతో అధికారుల తంటాలు

ABN , First Publish Date - 2020-04-09T20:03:58+05:30 IST

తెలంగాణలో ఈసారి యాసంగిలో భారీగా ఽవరి ధాన్యం దిగుమతి పెరగడంతో ప్రభుత్వం ఆనందంగా వుంది.

గన్నీ బ్యాగుల కొరతతో అధికారుల తంటాలు

హైదరాబాద్‌: తెలంగాణలో ఈసారి యాసంగిలో భారీగా వరి ధాన్యం దిగుబడి పెరగడంతో ప్రభుత్వం ఆనందంగా వుంది. అయితే ధాన్యాన్ని నిల్వచేసేందుకు గన్నీబ్యాగుల కొరత మాత్రం అధికారులకు తలనొప్పులు తెప్పిస్తోంది. తెలంగాణలో ఈసారి కోటి మెట్రిక్‌టన్నులకు పైగానే ధాన్యం దివగుమతి అవుతుందని ఈ మొత్తాన్ని తరలించడానికి దాదాపు 20 కోట్ల గన్నీబ్యాగులు అవసరం అవుతాయని పౌరసరఫరాలశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 8 కోట్ల గన్నీబ్యాగులు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు అఽధికారులు తెలిపారు. దీంతో ఇక ఇతర రాష్ర్టాల నుంచి ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్‌ నుంచి గన్నీబ్యాగులను దిగుమతి చేసుకునేందుకు ఇప్పటికే అధికారులు ఆర్డన్‌ ఇచ్చినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలోని రేషన్‌డీలర్లు, రైస్‌మిల్లర్ల వద్ద కూడా పెద్దమొత్తంలో గన్నీబ్యాగులు నిల్వఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం రైస్‌ మిల్లర్లు, రేషన్‌డీలర్లకు అవసరమైన ధాన్యం, బియ్యాన్ని పౌరసరఫరాలశాఖ బ్యాగులతో కలిపి సరఫరా చేస్తుంది. అవి ఖాళీ అయ్యాక  ఖాళీ సంచులను తిరిగి పౌరసరఫరాలశాఖకు అప్పగించాల్సి ఉంటుంది. కానీ ఒక పక్క అధికారుల నిర్లక్ష్యం, మరోపక్క కొందరు రైస్‌ మిల్లర్లు, రేషన్‌డీలర్లుకావాలనే పెద్దమొత్తంలో గన్నీబ్యాగులను తిరిగి ఇవ్వకుండా తమ దగ్గనే దాచేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి కోట్లలో నష్టం వస్తోంది. ప్రతి సంతవ్సరం కొత్త గన్నీబ్యాగులను కొనుగోలుచేయాల్సి వస్తోంది. కొందరు రైస్‌ మిల్లర్లు సైతం తమ మిల్లుల్లోనే గన్నీబ్యాగులు దాచేసి తమ వ్యాపారాలకు ఉపయోగించుకుంటున్నారు.


గన్నీబ్యాగులను తక్షణమే స్వాధీనం చేసుకోవాలి

తెలంగాణలో కొందరు రేషన్‌డీలర్లు, రైస్‌ మిల్లర్ల వద్ద ఉన్న పాత గన్నీబ్యాగులను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని పౌరసరఫరాలసంస్ద ఛైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణకు బ్యాగులు ప్రధానమని, ఒక్క గన్నీబ్యాగు బయటకు వెళ్లడానికి వీల్లేదని వెంటనే యుద్ధ ప్రాతిపదికన గన్నీబ్యాగుల సేకరణకు చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు. రేషన్‌డీలర్లు, రైస్‌ మిల్లర్లు ఈ విషయంలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలన్నారు. యాసంగిలో ధాన్యం సేకనణకు పౌరసరఫరాల సంస్థకు 20కోట్ల గన్నీబ్యాగులు అవసరం అవుతాయని అధికారులు తెలిపారు. అయితే కొవిడ్‌-19 నియంత్రణకు లాక్‌డౌన్‌ అమల్లో ఉన్ననేపద్యంలో పశ్చిమ బెంగాల్‌ నుంచి అనుకున్న సమయానికి గన్నీబ్యాగులు రాకపోవడంతో పాటు, పాత గన్నీబ్యాగుల రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. కొత్త గన్నీబ్యాగులు వచ్చే అవకాశం లేదని, పాత గన్నీబ్యాగులను సమకూర్చుకోవాలని,  దీనికి కావల్సిన కార్యాచరణను స్తానికంగా అధికారులు రూపొందించుకోవాలని ఛైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రేషన్‌డీలర్లు, రైస్‌ మిల్లర్ల వద్ద ఉన్నపాత గన్నీబ్యాగులను తక్షణమే స్వాధీనం చేసుకోవడం, అలాగే పాత గన్నీబ్యాగుల సరఫరా దారుల నుంచి కూడా వాటిని సేకరించాలని అన్నారు. 

Updated Date - 2020-04-09T20:03:58+05:30 IST