స్ఫూర్తి కేంద్రంగా గుండ్రాంపల్లి

ABN , First Publish Date - 2022-08-10T06:28:38+05:30 IST

రజాకార్లపై పోరాటం చేసి, వారిని తరిమికొట్టిన గుండ్రాంపల్లిని స్ఫూర్తికేంద్రంగా తీర్చిదిద్దుతామని బీజేపీ రాష్ట్ర బండి సంజయ్‌ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఏడో రోజైన మంగళవారం రాత్రి 11గంటలకు చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

స్ఫూర్తి కేంద్రంగా గుండ్రాంపల్లి
చిట్యాల మండలం గుండ్రాంపల్లి సభలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌

‘ఆపరేషన్‌ పోలో’తో టీఆర్‌ఎస్‌ పాలనను బొందపెడదాం

రజాకార్లపై గుండ్రాంపల్లి ప్రజల పోరాటం చిరస్మరనీయం 

చరిత్రను తెరమరుగు చేయడం మహాపాపం

బీజేపీ రాష్ట్ర బండి సంజయ్‌ 

జిల్లాలో ప్రవేశించిన ప్రజాసంగ్రామ యాత్ర


చిట్యాలరూరల్‌, ఆగస్టు 9: రజాకార్లపై పోరాటం చేసి, వారిని తరిమికొట్టిన గుండ్రాంపల్లిని స్ఫూర్తికేంద్రంగా తీర్చిదిద్దుతామని బీజేపీ రాష్ట్ర బండి సంజయ్‌ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఏడో రోజైన మంగళవారం రాత్రి 11గంటలకు చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్ఫూర్తి తరహాలో ‘మరో ఆపరేషన్‌ పోలో’ నిర్వహించి టీఆర్‌ఎస్‌ పాలనను తరిమికొడదామని  పిలుపునిచ్చారు. గుండ్రాంపల్లి అంటేనే ఆవేశం, పౌరుషాల గడ్డ అన్నారు. ఇక్కడి మట్టిని తాకితేనే పౌరుషం పుట్టుకొస్తుందని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో దిల్లీలో సమావేశం అయినప్పుడు చెప్పారని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ అంటే రజాకార్ల సమితి అని, కేసీఆర్‌ అంటే ఖాసీం చంద్రశేఖ ర్‌ రజ్వీ అని అన్నారు. మంత్రి కేటీఆర్‌ను గుండ్రాంపల్లిలో వందలాది మందిని ఊచకోత కోసిన రజాకార్‌ సయ్యద్‌ మక్బూల్‌తో సంజయ్‌ పోల్చారు. ఇక్కడ పుట్టకపోవడం తన దురదృష్టమని, ఎంతోమంది వీరులు బలిదానం చేసిన గడ్డమీద మీరు పుట్టడం అదృష్టమని గ్రామస్థులనుద్దేశించి అన్నారు. ఖాశీంరజ్విపై సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఎదిరించిన చరిత్ర గుండ్రాంపల్లిది అని చెప్పారు. ఈ గుండ్రాంపల్లికి వస్తే 360 మంది అమరుల చరిత్ర తెలుస్తుందని, కేసీఆర్‌ ఆ చరిత్రని తెలియనివ్వడంలేదన్నారు. ఎందుకంటే నిత్యం తన కుటుంబ చరిత్రే అందరికీ తెలవాలని కోరుకునే వ్యక్తి కేసీఆర్‌ అని ఆరోపించారు. సెప్టెంబర్‌ 17న మన తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందని, తెలంగాణ విమోచన దినోత్సవంగా సెప్టెంబర్‌ 17ను జరుపుకోవాలన్నారు. 


చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నం 

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే, మొదటిసారి గుండ్రాంపల్లికే వస్తానని అమిత్‌ షా అన్నారని సంజయ్‌ చెప్పారు. గుండ్రాంపల్లి వీరుల చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని ఆయన సూచించారన్నారు. గుండ్రాంపల్లి చరిత్రను తెరమరుగు కానివ్వమని, తెలంగాణ చరిత్రనే తెరమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిజాం మెడలు వంచి మనకు స్వాతంత్య్రం ఇచ్చిన ఘనత సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ది అన్నారు.


రజాకార్ల పార్టీ ఎంఐఎం

ఖాశీం రజ్వి పార్టీ ఎంఐఎం అని, రజాకార్ల పార్టీ ఎంఐఎం అని, టీఆర్‌ఎస్‌ పార్టీ అంటేనే... తెలంగాణ రజాకార్ల పార్టీ అని సంజయ్‌ దుయ్యబట్టారు. ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్న టీఆర్‌ఎస్‌ అమరుల త్యాగాలను అవమానిస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని, కేవలం మైనారిటీ ఓట్ల కోసమే ఎంఐఎంతో పొత్తు పెట్టుకుందన్నారు. గుండ్రాంపల్లి అమరుల వారసులకు ఇళ్లు, పెన్షన్లు ఇప్పించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని బండి సంజయ్‌ హామీ ఇచ్చారు. 


ఖాళీలను భర్తీ చేయడంలో నిర్లక్ష్యమెందుకు?

చౌటుప్పల్‌: రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఏడో రోజైన మంగళవారం మంగళవారం చౌటుప్పల్‌ మండలంలోనితాళ్లసింగారం, కొత్తపేట, లింగోజిగూడెం, అంకిరెడ్డిగూడెం, గుండ్లబాయి, రెడ్డిబాయి గ్రామాల్లో యాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ జెండా ఊపి ప్రారంభించారు. గాంధీజీ, భారతమాత చిత్రపటాలకు బండి సంజయ్‌తోపాటు పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బండి సంజయ్‌తోపాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు  ప్రజలు జాతీయ జెండాలతో పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాళ్లసింగారం గ్రామంలో బండి సంజయ్‌ ‘చాయ్‌ పే చర్చ’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన నిరుద్యోగులు గుండ్ల వెంకటేశం, బొం గు దివ్య, విద్యావేత్త బాతరాజు శ్రీనివాస్‌, రైతు బొంగు కుమార్‌లతో మాట్లాడారు. ఏం చదువు కున్నారు.. ఏం పనిచేస్తున్నారు.. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి.. అని వారిని అడిగారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక, ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని వారు వివరించారు. పక్కనే పరిశ్రమలు ఉన్నా ఉపాధి అవకాశాలు లేక పట్టణాలకు వలసపోతున్నామని తెలిపారు. ఈ సందర్బంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నా ఉద్యోగాలను భర్తీ చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా, వాటిని ఎందుకు భర్తీ చేయడంలేద ని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి హామీ ఏమైందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అర్హులైన నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యాత్ర ప్రముఖ్‌ డాక్టర్‌ గంగిడి మనోహర్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు పొంగులేటి సుధాకర్‌, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర నాయకులు బంగారు శృతి, దూడల భిక్షంగౌడ్‌, దోనూరి వీరారెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-10T06:28:38+05:30 IST