ప్రవాసులకు టీకా పాట్లు!

ABN , First Publish Date - 2021-06-14T07:01:41+05:30 IST

ఉద్యోగ, ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశాలకు వెళ్లే వారిని ప్రత్యేకంగా గుర్తించి కేరళ, కర్ణాటక రాష్ట్రాలు 28 రోజుల వ్యవధిలో రెండు డోసుల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఇస్తుండగా, తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్మరించారన్న ఆరోపణలు...

ప్రవాసులకు టీకా పాట్లు!

  • ప్రాధాన్య క్రమంలో చేర్చని తెలుగు రాష్ట్రాలు
  • గల్ఫ్‌ దేశాలకు తిరిగి రాలేక వేలాది మంది తిప్పలు
  • రెండో డోసు వ్యవధి తగ్గించకపోవడంతో ఇబ్బందులు
  • 14 రోజుల క్వారంటైన్‌తో తడిసి మోపడవుతున్న ఖర్చు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

ఉద్యోగ, ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశాలకు వెళ్లే వారిని ప్రత్యేకంగా గుర్తించి కేరళ, కర్ణాటక రాష్ట్రాలు 28 రోజుల వ్యవధిలో రెండు డోసుల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఇస్తుండగా, తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్మరించారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా స్వదేశానికి వెళ్లి ఇరుక్కుపోయిన వేలాది మంది ప్రవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న వారు మాత్రమే తమ దేశంలో తిరిగి రావడానికి అర్హులని సౌదీ అరేబియా ప్రకటించింది. యూఏఈ, ఇతర గల్ఫ్‌ దేశాలు సైతం ఇదే రకమైన విధానాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. అంతేకాదు.. గల్ఫ్‌ దేశాలకు తిరిగి రాకముందే ప్రత్యేక పోర్టల్‌ ద్వారా వ్యాక్సిన్‌కు సంబంధించిన వివరాలు సమర్పించిన వారికి మాత్రమే విమాన టికెట్లు విక్రయించాలనే నిబంధన ఉంది. వ్యాక్సిన్‌ తీసుకోని పక్షంలో  14 రోజులు విధిగా హోటల్‌లో క్వారంటైన్‌ లో ఉండాలని ఆదేశాలు ఉన్నాయి. విమాన టికెట్‌ కంటే ఎక్కువగా హోటల్‌ క్వారంటైన్‌ ఖర్చు ఉండడంతో ప్రవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సౌదీ, యూఏఈ, ఒమన్‌ దేశాలు.. భారత విమానాల రాకపోకలను నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా దేశాల్లో పని చేస్తున్న ప్రవాసీయులు సోవియట్‌ రిపబ్లిక్‌లో 14 రోజులు ఉండి, అక్కడి నుంచి ఆయా దేశాలకు వెళ్లాక మరో 14 రోజులు క్వారంటైన్‌ ఉండాల్సి రావడంతో ప్రయాణ ఖర్చు పదింతలు పెరిగింది. వీసా గడువు ముగుస్తున్న వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గల్ఫ్‌ దేశాల్లో మొదటి డోసు తీసుకొని, స్వదేశానికి వెళ్లిన వారికి మరో రకమైన సమస్య ఎదురవుతోంది. అదే రకమైన వ్యాక్సిన్‌ భారత్‌లో అందుబాటులే లేకపోవడంతో అయోమయంలో పడుతున్నారు. దీనికితోడు వ్యాక్సిన్‌ తీసుకునే క్రమంలో పాస్‌పోర్టు నంబర్‌కు బదులుగా ఆధార్‌ కార్డు నంబర్‌ను మాత్రమే అనుమతిస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా గల్ఫ్‌ దేశాలకు తిరిగి వెళ్లాలనుకునే ప్రవాసులకు ప్రాధాన్యతా క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2021-06-14T07:01:41+05:30 IST