ఆవిరైన ఎడారి ఆశలు!

ABN , First Publish Date - 2020-07-15T11:46:32+05:30 IST

కరోనాదెబ్బకు ఏడాది దేశాల్లో ఉపాధి ఆవిరైపోయింది. గల్ఫ్‌దేశాల్లో కరోనా ప్రభావం కారణంగా మూతపడిపోయిన వందలాది

ఆవిరైన ఎడారి ఆశలు!

గల్ఫ్‌లో 30వేల మంది ఉపాధికి గండి 

పరోక్షంగా జిల్లాకు చెందిన వెయ్యి మంది ఉపాధిపై  ప్రభావం 

స్థానిక ఆదాయం మాయం

అన్‌పెయిడ్‌ లీవ్‌ పేరిట తిరిగి పంపేస్తున్న కంపెనీలు 

చేసిన బాకీలపై ఆందోళన 

పరేషాన్‌లో గల్ఫ్‌ వలస కార్మికులు 

ప్రత్యామ్నాయ ఉపాధి కోసం తండ్లాట 


నిర్మల్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : కరోనాదెబ్బకు ఏడాది దేశాల్లో ఉపాధి ఆవిరైపోయింది. గల్ఫ్‌దేశాల్లో కరోనా ప్రభావం కారణంగా మూతపడిపోయిన వందలాది పరిశ్రమలు తమ వద్ద పని చేసే కార్మికులను తొలగించేశాయి. అలాగే మరికొన్ని కంపెనీలు అన్‌పేడ్‌ లీవ్‌ పేరిట వెనక్కి పంపించేశాయి. పరిస్థితులన్నీ చక్కబడిన తరువాత తిరిగి ఉపాధి కల్పిస్తామంటూ చెప్పి వారిని కొలువుల్లో నుంచి తొలగించేశాయి. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 30వేల మందికి వరకు గల్ప్‌ దేశాల్లో వలస కూలీలుగా పని చేస్తున్నారు.


కరోనా ప్రభావంతో వీరిలో నుంచి దాదాపు 15వేల వరకు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకున్నారు. మరికొంతమంది కూడా వెనక్కివచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్థిక పరమైన, సాంకేతిక పరిమైన కారణాలతో వీరు తాత్కా లికంగా గల్ఫ్‌ దేశాల్లోనే హోం క్వారంటైన్‌ పేరిట ఇండ్లకే పరిమితమైపోయారు. కొద్దిరోజుల్లో వీరు కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సౌదీఅరేబియా, మస్కట్‌, దుబాయ్‌, ఓమన్‌, షార్జా, ఖతర్‌, ఇరాన్‌, ఇరాక్‌, మలేషియా, సింగాపూర్‌ లాంటి గల్ఫ్‌ దేశాల్లో వీరంతా వలస కూలీలుగా ఉపాధి పొందుతున్నారు. గల్ఫ్‌మోజులో పడ్డ వేలాది మంది లక్షల రూపాయలు చెల్లించుకొని అక్కడికి వెళ్లి జీవిస్తున్నారు.


వీరిలో నుంచి కొంతమంది అక్కడ స్థిర పడిపోగా మరికొంతమంది తాత్కాలిక ప్రాతిపాదికన కొనసాగుతున్నారు. అయితే ప్రపంచ దేశాలను పాతాళానికి తొక్కేసిన కరోనా వైరస్‌ గల్ప్‌ దేశాలను సైతం కబలించేసింది. ఈ వైరస్‌ వ్యాప్తి కారణంగా గల్ఫ్‌ దేశాన్ని సంక్షోభంలోకి కూరుకుపోయాయి. ఈ దేశంలోని పరిశ్రమలన్నీ మూత పడిపోయాయి. ఇక్కడి అనేక పరిశ్రమలు, కన్స్‌స్ట్రక్షన్‌ కంపెనీల్లో వేలాది మంది జిల్లా వాసులు కూలీలుగా పనిచేస్తున్నారు. అయితే లాక్‌డౌన్‌తో ఇవన్నీ మూతపడిన క్రమంలో ఇందులో పని చేసే కూలీలకు యాజమాన్యాలు వేతనాలు చెల్లించలేక చేతులేత్తేశాయి. గల్ప్‌దేశాల్లోని భారతదేశ ఎంబసీ అధికారులు వీరిని తాత్కాలికంగా ఆదుకున్నారు. కొన్ని కంపెనీలు రెండు, మూడు నెలల వేతనాలు చెల్లించకుండానే తమ ఉద్యోగులను తొలగించుకోగా మరికొన్ని కంపెనీలు అన్‌పెయిడ్‌ లీవ్‌ పేరిట సెలవులు ప్రకటించి ఉద్యోగాల నుంచి పరోక్షపద్దతిలో పక్కకు నెట్టేశాయి.


ఈ పరిణామాలతో దాదాపు 30వేల మంది జిల్లాకు చెందిన వలసకూలీలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక్కడి పరిస్థితులు రోజురోజుకు కఠినంగా మారడం, కరోనా తీవ్ర త తగ్గకపోవడంతో చాలా మంది తమ సొంత డబ్బులు వెచ్చించి స్వగ్రామాలకు తిరిగి వచ్చారు. అలాగే మరికొంతమంది ఆర్థిక పరిస్థితుల కారణంగా అక్కడే ఉండిపోయి తమను ఎవరైనా స్వస్థలాలు పంపేందుకు సహకరించాలని కోరుతున్నారు. ఇలాంటి వారిలో నుంచి చాలా మంది స్వచ్చందసంస్థలు, తెలంగాణ జాగృతి లాంటి చాలా సంస్థలు విమాన టికెట్‌లు భరించి స్వస్థలాలకు పంపా యి.


కాగా చాలా మంది గల్ఫ్‌ దేశాల నుంచి తిరిగి వచ్చిన వారంతా తాము చేసిన అప్పులు ఎలా తీర్చేదంటూ మాన సిక వేదనకు గురవుతున్నారు. స్వగ్రామాల్లో ఉపాధి కరువై ప్రత్యామ్నాయ ఉపాధికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా గల్ఫ్‌ దేశాల్లో ఉన్న వారు తాము సంపాదించే కొంతమొత్తం నుంచి తమ కుటుంబ సభ్యులకు పంపేవారు. దీంతో మనీ ట్రాన్స్‌ఫర్‌ ఏజెన్సీలు జిల్లాలో ఎక్కువగా వెలిశాయి. ఈ కరోనా సంక్షోభం కారణంగా వలస కార్మికులంతా స్వస్థలాలకు తిరిగి వస్తున్నందున మనీ ట్రాన్స్‌ఫర్‌ దందా కూడా కుదేలయ్యింది. ఈ దందా పై ఆధారపడి జీవనం పొందుతున్న చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు. ఇలా ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని వర్గాలపై గల్ఫ్‌ కార్మికుల సమస్య ప్రభావం చూపడంతో ఉపాధి కల్పన వ్యవహారం జిల్లా యంత్రాంగానికి ఓ సమస్యగా మారబోనుందంటున్నారు. 


30వేల మంది ఉపాధికి గండి 

జిల్లాలోని నిర్మల్‌, ముథోల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాలకు చెందిన దాదాపు 30వేల మంది గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. వీరిలో నుంచి 70శాతం మంది కూలీలుగా పనిచేస్తుండగా, మరికొంతమంది కొన్ని పరిశ్రమలు, దుకాణాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కరోనా సంక్షోభంతో ఇక్కడి అనేక పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూతపడిపోయాయి. దీంతో పాటు యాజమాన్యాలు అన్ని తమ వద్ద పని చేసే కార్మికులందరిని పక్కకు తొలగించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. లాక్‌డౌన్‌తో పరిశ్రమలు, దుకాణాలు మూతపడ్డ కారణంగా దీనిని అదును గా చేసుకున్న యాజమాన్యాలు తిరిగి తమ వద్దకు రావద్దంటూ సిబ్బందిని హెచ్చరించాయి. అలాగే ఇదే అదును గా భావించి మూడు, నాలుగు నెలలకు సంబంధించిన వేతనాలు చెల్లించకుండా చేతులేత్తేశాయి.


లాక్‌డౌన్‌ తీవ్రత ఓవైపు, కరోనాతీవ్రత మరోవైపు తీవ్ర ప్రభావం చూపడంతో కూలీలంతా బయటకు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. సందట్లో సడేమియా లాగా చాలా మంది పరిశ్రమలు, దుకాణాల యజమానులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి కూలీలకు అందుబాటులో లేకుండాపోయారు. దీంతో కూలీ లంతా గల్ఫ్‌ దేశాల్లోని తమకు తెలిసిన వారి నుంచి అప్పో సప్పో చేసుకొని ఇప్పటి వరకు నెట్టుకొచ్చారు. దీంతో తమను తమ స్వస్థలాలకు పంపాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ వీరి లో నుంచి చాలా మందిని స్వదేశానికి తీసుకువచ్చింది. 


అన్‌పెయిడ్‌ లీవ్‌ పేరిట తొలగింపు ప్రయత్నాలు

కాగా గల్ప్‌ దేశాల్లోని స్థానిక కంపెనీలు, అలాగే మల్టీ నేషనల్‌ కంపెనీలు కరోనా కారణంగా తమ వద్ద పని చేసే కార్మికులను తొలగించేందుకు అన్‌పెయిడ్‌ లీవ్‌ పేరిట కొత్త ఎత్తుగడను అమలు చేశాయి. పొమ్మన లేక పొయ్యి పెట్టిన చందంగా ఇక నుంచి తమ గల్ఫ్‌ దేశాల్లో ఇతరులెవ్వరు పని చేయవద్దన్న ఉద్దేశంతోనే ఈ తతంగానికి పూ నుకున్నట్లు పేర్కొంటున్నారు. మరికొన్ని కంపెనీలు నెలల తరబడి ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా వేధింపుల వ్యవహారాన్ని చేపట్టాయి. అయితే అక్కడి పరిస్థితులు తీవ్రం అవ్వడంతో చాలా మంది తమ కొలువులతో పాటు నెలవారీ జీతాలను సైతం వదిలేసి తిరిగి ఇండియాకు వచ్చేందుకు తంటాలు పడుతున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛం దం సంస్థలు వీరందరిని స్వస్థలాలకు రప్పించే ప్రయత్నాల్లో ఉన్నాయి. 


ప్రత్యామ్నాయ ఉపాధి కోసం తండ్లాట.... 

గల్ఫ్‌దేశాల నుంచి తిరిగి వస్తున్న వారంతా తమ స్వస్థలాల్లో ప్రత్యామ్నాయ ఉపాధి కోసం తంటాలు పడుతున్నారు. ఒకేసారి గల్ఫ్‌ దేశాల నుంచి వలస కూలీలు ఎక్కువ మంది తిరిగి వస్తుండడంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా కనిపించడం లేదంటున్నారు. ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కొంత మేరకు ఆదుకుంటున్నప్పటికీ ఇది పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించలేదని వారు అభిప్రా యపడుతున్నారు. స్థానికంగా వ్యవసాయ పనులు, వ్యాపారాలు చేసుకునే దిశగా కొంతమంది ప్రయత్నిస్తున్నారు. అయితే గల్ఫ్‌ దేశాలకు వెళ్ళేందు కోసం చేసిన అప్పులే ఇప్పటి వరకు తీరలేదని, మళ్లీ కొత్త వ్యాపారాలకు పెట్టుబడుల కోసం డబ్బులు ఎలా సమకూర్చుకోవాలన్న ఆందోళనకు గురవుతున్నారు. గల్ఫ్‌ దేశాల నుంచి తిరిగి వచ్చిన వారందరికీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలంటూ వీరు కోరుతున్నారు. 


చేసిన అప్పులు ఎలా తీర్చేది ?

స్థానికంగా ఉపాధి లభించక కొద్ది రోజుల క్రితం అబుదాబీ వెళ్లాను. కరోనా కారణంగా నేను పని చేసే వ్యాపార సంస్థ మూత పడింది. పెయిడ్‌ లీవ్‌ పేరిట యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. తంటాలు పడి స్వ గ్రామానికి చేరుకున్నాను. 14 రోజుల క్వారంటైన్‌ను కూడా పూర్తి చేసుకున్నా. ప్రస్తుతం ఉపాధి అవకాశాలు కనిపించడం లేదు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి ఆదుకోవాలి. 

- గోనే నవీన్‌, గ్రామం: కడ్తాల్‌, గల్ఫ్‌ వలస కార్మికుడు

Updated Date - 2020-07-15T11:46:32+05:30 IST