Expats in Gulf: గల్ఫ్‌కు గుడ్‌బై.. స్వదేశాల బాటలో ప్రవాసులు.. కారణాలివే

ABN , First Publish Date - 2022-08-03T15:36:22+05:30 IST

గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) జీవన వ్యయం భారీగా పెరిగిపోవడం, మెజారిటీ దేశాలు స్థానికులకే ఉపాధి అవకాశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వడం, సబ్‌సిడీ పథకాలను సైతం కేవలం దేశ పౌరులకే పరిమితం చేస్తుండడంతో నెమ్మదిగా ప్రవాసులు (Expats) స్వదేశాల బాట పడుతున్నట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.

Expats in Gulf: గల్ఫ్‌కు గుడ్‌బై.. స్వదేశాల బాటలో ప్రవాసులు.. కారణాలివే

ఎన్నారై డెస్క్: గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) జీవన వ్యయం భారీగా పెరిగిపోవడం, మెజారిటీ దేశాలు స్థానికులకే ఉపాధి అవకాశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వడం, సబ్‌సిడీ పథకాలను సైతం కేవలం దేశ పౌరులకే పరిమితం చేస్తుండడంతో నెమ్మదిగా ప్రవాసులు (Expats) స్వదేశాల బాట పడుతున్నట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. ప్రముఖ యూఎస్ (US) న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన తాజా రిపోర్ట్ ప్రకారం సౌదీ, కువైత్, ఒమన్, ఖతర్, బహ్రెయిన్ దేశాల్లో మొత్తం 21 మిలియన్ల మంది ప్రవాసులు ఉన్నట్లు తెలిసింది. ఇది ఆ దేశాల మొత్తం జనాభాలో 20శాతం కాగా, వర్క్‌ఫోర్స్‌లో 11 శాతానికి సమానమని రిపోర్ట్ పేర్కొంది. దీంతో 2021లో గల్ఫ్ దేశాల్లోని ప్రవాసులు మొత్తంగా 127 బిలియన్ డాలర్ల(రూ.99,95,80,17,00,000) సంపాదనను స్వదేశంలోని తమ వారికి పంపించడం జరిగింది. అదే 2020లో ఇది 116 బిలియన్ డాలర్లు(రూ.91,35,05,80,00,000)గా ఉందని నివేదిక వెల్లడించింది. 


ఇక గల్ఫ్ దేశాల్లో ప్రత్యేకించి సౌదీ అరేబియా (Saudi Arabia)లోని ప్రవాసులపై విధించే పన్నుల (Tax) పెరుగుదలను ఈ సందర్భంగా నివేదిక స్పృశించింది. అక్కడి ప్రవాసుడు తన కుటుంబంలోని ప్రతి సభ్యునికి నెలకు 4,500 రియాల్స్ (రూ. 94,315) చెల్లించాలి. అలాగే ఇతర ఫీజులు, విద్యుత్, నీటి బిల్లులు కూడా అక్కడ భారీగానే పెరిగినట్లు రిపోర్టు తెలిపింది. అటు బహ్రెయిన్ (Bahrain) మాంసంపై సబ్సిడీలను ఎత్తివేసింది. అదనంగా గ్యాసోలిన్ ధరను 200శాతం పెంచడంతోపాటు, ప్రవాసులకు ఇంధన ధరలను గణనీయంగా పెంచింది. అలాగే కింగ్‌డమ్‌లో ఆరోగ్య బీమాను (Life Insurance) తప్పనిసరి చేసింది. 


ఇక ఒమన్ (Oman) ఇటీవల ప్రైవేట్ రంగంలో 200 కంటే ఎక్కువ ఉద్యోగాల భర్తీకి ఉద్యోగ స్థానికీకరణ నిబంధనను తీసుకొచ్చింది. దేశంలో జీవన వ్యయం గణనీయంగా పెరగడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రవాసులపై రుసుములు విధిస్తోంది. అదే సమయంలో దేశ పౌరులకు సబ్సిడీలను కేటాయించింది. కువైత్ (Kuwait) తమ పౌరులకు సహకార సంఘాలలో నిత్యవసర వస్తువులను కొనుగోలు చేయడానికి మాత్రమే ఆర్థిక రాయితీలను కేటాయిస్తుంది. ఎందుకంటే ప్రవాసులు దేశ పౌరుల వలే తక్కువ ధరలకు వాటిని కొనుగోలు చేయడానికి అనుమతించరు. ఖతార్‌ (Qatar)లో చాలా ఉద్యోగాలలో ఆ దేశ పౌరుల కంటే ప్రవాసులు (Expats) చాలా తక్కువ వేతనాలను పొందుతుంటారు.


అయితే, ఇలా గల్ఫ్ దేశాలు (Gulf Countries) రుసుములు, పన్నులు విధించడం వల్ల తక్కువ వేతనాలు (Salaries) కలిగిన ప్రవాసులు పెద్దగా ప్రభావితం కాలేదని నివేదిక పేర్కొంది. కానీ, జీతాలు పొందే పాఠశాల ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, పరిపాలనా సిబ్బంది వంటి మధ్య ఆదాయ వర్గం ఎక్కువగా ప్రభావితమైందని తెలిపింది. నెలకు 1,500 నుండి 4,000 డాలర్ల (రూ. 1.18లక్షల నుంచి రూ.3.14లక్షలు) వరకు జీతాలు పొందే వీరిలో చాలా మంది తమ కుటుంబాలను వారి దేశాలకు పంపించాల్సి ఉంటుంది. ఇతరులతో వసతి, రవాణాను పంచుకోవాల్సి ఉంటుంది. దీంతో చాలామంది ప్రవాసులు స్వదేశాల బాట పడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. 


Updated Date - 2022-08-03T15:36:22+05:30 IST