Abn logo
Sep 27 2021 @ 23:49PM

‘గులాబ్‌’ గుబులు

ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు)లో నీటమునిగిన మిర్చి పంట

తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వర్షాలు
పొంగుతున్న వాగులు, నిండుతున్న చెరువులు
నాలుగు జిల్లాల్లో రెడ్‌, రెండు జిల్లాలో ఆరెంజ్‌ అలర్ట్‌
అప్రమత్తమైన అన్ని జిల్లాల అధికార యంత్రాంగం
ముంపు ముప్పుతో వణుకుతున్న వరంగల్‌ నగరం


హనుమకొండ, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి):
గులాబ్‌ తుపాను ప్రభావంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం పూర్తిగా మబ్బులు కమ్మేసి వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. పలు చోట్ల మత్తళ్లు పోస్తున్నాయి. హనుమకొండ జిల్లాలో ఎడతెరిపి లేకుండా ముసురు  కురుస్తోంది. ఆదివారం ఉదయం 8 గంటల  నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు హనుమకొండ జిల్లాలో 8.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

వరంగల్‌ జిల్లాలో చెరువులు, కుంటలు పొంగుతున్నాయి. జిల్లాలో దుగ్గొండి, నల్లబెల్లి, చెన్నారావుపేట, ఖానాపురం, పర్వతగిరి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. పాకాల చెరువు మళ్లీ మత్తడి పోస్తోంది. మిర్చి, పత్తి పంటలు వర్షానికి నష్టం చేకూరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పండ్లు, కూరగాయల పంటలకు కూడా నష్టం వాటిల్లనుంది. వరంగల్‌ బస్టాండ్‌ నీటితో నిండిపోయింది. జిల్లా వ్యాప్తంగా వర్షపాతం 128.2 మి.మీ. నమోదైంది.

ములుగు జిల్లావ్యాప్తంగా సోమవారం భారీ వర్షం కురిసింది. తాడ్వాయి మండలంలో అత్యధికంగా 7.1 సెంటీమీటర్ల వర్షపడింది. లోతట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి. ములుగు జిల్లాను ఆరెంజ్‌ జోన్‌లో పేర్కొంది. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య సూచించారు. గోదావరి పరీవాహక, లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఏకధాటిగా ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం పడింది. కొంపల్లి శివారులోని చెరువులోకి వరద నీరు వచ్చి చేరింది. అలాగే గణపురం మండలంలోని గణపసముద్రం చెరువులోని మరింత వరద నీరు చేరింది. భారీ వర్షంతో భూపాలపల్లి సింగరేణి ఏరియా పరిధిలోని బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఇక్కడి అన్ని గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడగా మల్హల్‌ మండలంలోని ఓసీపీ-1లో కూడా ఉత్పత్తి నిలిచిపోయింది. జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో వరి, పత్తి, మిర్చి పంటలు నీట మునిగాయి.

జనగామ జిల్లా అంతటా ఎడతెరిపి లేకుండా ముసురుతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. జిల్లాకేంద్రంలోని రంగప్పచెరువు మత్తడి పడడంతో బాణాపురం, పూసలబస్తీ, కుర్మవాడ, శ్రీనగర్‌ కాలనీ, జ్యోతి నగర్‌, బాలాజీనగర్‌ కాలనీలు జలమయమయ్యాయి. హైదరాబాద్‌ రోడ్డులో భారీగా వర్షం నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. జిల్లా అంతటా ఇప్పటికే చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతుండగా, వాగులు పారుతున్నాయి. చీటకోడూరు రిజర్వాయర్‌ పూర్తిగా నిండడంతో అధికారులు మొత్తం నాలుగు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు.

మహబూబాబాద్‌ జిల్లాలో గాలిదుమారంతో పాటు పిడుగుల శబ్దాలతో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. జిల్లాలో 544.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సగటున 45.4 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. గార్ల, డోర్నకల్‌, నర్సింహులపేట మండలాల్లోని పాకాల, మున్నేరు, ఆకేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కురవి మండలం రాజోలులో షేక్‌ యాకూబీ ఇళ్లు కూలిపోయింది. మహబూబాబాద్‌ మండలం వేంనూరు శివారు చంద్రుతండాలో మాలోతు నరే్‌షకు చెందిన రెండు కాడెడ్లు పిడుగుపడి మృతిచెందాయి.

వణుకుతున్న నగరం

అధికారుల అప్రమత్తం
జీడబ్ల్యూఎంసీ (హనుమకొండ సిటీ), సెప్టెంబరు 27: వర్షం వస్తే చాలు.. వరంగల్‌ నగరం ఉలిక్కిపడుతోంది. తాజాగా నగరవాసులను గులాబ్‌ తుపాన్‌ గుబులు పుట్టిస్తోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు తేలికపాటి జల్లులు, ముసురు మాత్రమే కురిసింది. భారీ వర్షం పడితే మాత్రం నగరానికి ముంపు ముప్పు తప్పదు. ప్రస్తుతానికి అయితే ఎలాంటి ప్రమాదం లేదని జీడబ్ల్యూఎంసీ చెబుతోంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. తుఫాన్‌ క్రమంలో ఇప్పటికే నగరంలో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

అధికారుల సమీక్షలు
వర్ష ప్రభావ క్రమంలో మేయర్‌తో పాటు కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, కమిషనర్‌ పి.ప్రావీణ్య అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరో 36 గంటల పాటు అప్రమత్తండా ఉండాలని అఽధికారులకు సూచించారు. వర్షం నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. 24గంటల పాటు వింగ్‌ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని మేయర్‌ సుధారాణి ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సోమవారం రాత్రి వర్షం భారీగా పడితే వెంటనే రంగంలోకి దిగాలని డీఆర్‌ఎస్‌ సభ్యులకు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు కూడా మేయర్‌ సూచనలు చేశారు.

కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు
వర్ష ప్రభావ క్రమంలో వరంగల్‌ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది. టోల్‌ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. 1800-425-1980, 97019 99645తోపాటు వాట్సాప్‌ నెంబర్‌ 79971 00300ను అందుబాటులో ఉంచారు. ప్రజలు వాట్సాప్‌ నెంబర్‌కు ఆయా ప్రాంతాల ఫొటోలు, సమస్యల వివరాలు పంపిస్తే సహాయక చర్యల నిమిత్తం బల్దియా సిబ్బంది, డీఆర్‌ఎఫ్‌ సభ్యులు వెంటనే రంగంలోకి దిగేందుకు సులువుగా ఉంటుంది.

హై అలర్ట్‌
భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
హనుమకొండ, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): గులాబ్‌ తుపాన్‌ ప్రభావం వల్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనుండడంతో ఉమ్మడి జిల్లాలోని అధికారులు అప్రమత్తం అయ్యారు. వరంగల్‌, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్‌ జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ను ప్రకటించారు. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ హెచ్చరికలు జారీ చేశారు. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన జిల్లాల్లో మంగళవారం ఉదయం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీంతో ఈ జిల్లాల కలెక్టర్లు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్సులు నిర్వహించారు. జిల్లా హెడ్‌క్వార్టర్లను విడిచి వెళ్ళరాదని, నిరంతరం అందుబాటులో  ఉండాలని, ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేయరాదని కోరారు. సెలవులను రద్దు చేశారు. ఆరు జిల్లాల కలెక్టరేట్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నెంబర్లను అందుబాటులో ఉంచారు. రాబో యే 24 గంటల్లో భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కలెక్టర్లు సూచించారు. హనుమకొండ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో టోల్‌ఫ్రీ నెంబర్‌ 1800-425-1115ను ఏర్పాటు చేశారు.

విద్యుత్‌పై అప్రమత్తంగా ఉండండి..
రెవెన్యూ కాలనీ, సెప్టెంబరు 27: గులాబ్‌ తుపాను నేపథ్యంలో ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలోని 17 జిల్లాల్లోని విద్యుత్‌ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అన్నమనేని గోపాల్‌రావు కోరారు. ఎటువంటి సమస్యలు తలెత్తినా కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నం బర్లు 9440811244, 9440811245, టోల్‌ఫ్రీ నంబర్‌ 18004250028 /1912లలో సంప్రదించాలని కోరారు. విద్యుత్‌ అధికారులు, సిబ్బంది విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.

పంటలకు తీవ్ర నష్టం
హన్మకొండ అగ్రికల్చర్‌, సెప్టెంబరు 27: గులాబ్‌ ప్రభావంతో కురుస్తు న్న వర్షాలకు పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లనుంది. ఈ నెల ప్రారంభం లో కురిసిన భారీ వర్షాల నుంచి రైతులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో ఇప్పుడు గులాబ్‌ తుపాను ప్రభావంతో జిల్లాలో పత్తి, వరి పంట లు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని తెలిసి రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8గంటల వరకు హనుమకొండ జిల్లాలో 8.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పగలు, రాత్రి ముసురు వర్షం దంచికొడుతోంది. జిల్లాలో పలు మండలాల్లో వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. భీమదేవరపల్లిలో 14.9 మి.మీ, వేలేరు 10.3 మి.మీ, ఎల్కతుర్తి 1 మి.మీ, కమలాపూర్‌ 0.3 మి.మీ, హసన్‌పర్తి 5.3 మి.మీ, ధర్మసాగర్‌ 5.1 మి.మీ, కాజీపేట 12.8మి.మీ, హన్మకొండ 5.8 మి.మీ, ఐనవోలు 7.9 మిల్లీ మీటర్లు, పరకాల 7.2 మి.మీ, శాయంపేట 16.1 మి.మీ, దామెర 9.8 మి.మీ, ఆత్మకూరు 14 మి.మీ, నడికుడలో 7.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

నీటిలో ‘కోట’

జలదిగ్బంధంలో శిల్పకళాఖండాలు
ఖిలావరంగల్‌, సెప్టెంబరు 27: జలదిగ్బంధంలో కాకతీయుల కళాఖండాలు, శిల్పసంపద మునిగిపోయాయి. భారీ వర్షాలకు మధ్యకోటలోని శిల్పాల ఆవరణ, సింగారపుబావి, స్వయంభూదేవాలయం, రాతి, మట్టికోటల నిండా వర్షం నీరు చేరింది. ఖిలావరంగల్‌ మధ్యకోటలోని జల్లెడ తూము, శాపకొండ దర్వాజలు మునిగిపోయాయి. కత్తికోటపై రాళ్లు కూలి కిందపడుతున్నాయి. అలాగే ఖుష్‌మహల్‌ ముందున్న సింగారపుబావి నిండిపోయింది. బావి అంచులు తెగితే మధ్యకోటలోని పంట భూములు పూర్తిగా మునిగే ప్రమాదముంది. వర్షపునీటితో మధ్యకోటలోని పర్యాటకులు అడుగుతీసి అడుగువేయలేని దుస్థితి నెలకొంది.

మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలంలోని గాంధీనగర్‌ వాగు వద్ద పహారా కాస్తున్న వీఆర్‌ఏ


జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారంలో నీట మునిగిన వరి పొలాలు