Abn logo
Sep 27 2021 @ 02:43AM

వణికించిన గులాబ్‌.. అల్లకల్లోలంగా మారిన సముద్రం

ఉత్తరాంధ్రను ముంచెత్తిన వర్షాలు.. అల్లకల్లోలంగా మారిన సముద్రం

తీరంలో ఈదురు గాలుల ఉధృతి.. శ్రీకాకుళం జిల్లాపై ఎక్కువ ప్రభావం

ఆ తర్వాత విజయనగరం, విశాఖపై.. 2 మత్స్యకారుల పడవలు బోల్తా

ఒకరు గల్లంతు.. మిగిలినవారు క్షేమం.. పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు

శ్రీకాకుళం జిల్లాలో తీరం దాటిన తుఫాన్‌.. నేడు కోస్తాలో భారీ వర్షాలు

సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌.. ఆదుకుంటామని హామీ


(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌): బలమైన ఈదురుగాలులు, భారీ నుంచి అతి భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర తీర ప్రాంతం వణికిపోయింది. గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కుండపోత వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయనగరం, విశాఖ జిల్లాలోనూ భారీ వర్షాలు ముంచెత్తాయి. శ్రీకాకుళం జిల్లాపై ఎక్కువగా, ఆ తర్వాత విజయనగరంపై తుఫాన్‌ ప్రభావం చూపించింది. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సముద్రంలో రెండు మత్స్యకారుల పడవలు బోల్తా పడ్డాయి. వీరిలో ఒకరు గల్లంతు కాగా, మిగిలినవారు ఒడ్డుకు చేరుకున్నారు. ఆదివారం రాత్రి శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తుఫాన్‌ తీరం దాటింది. దీని ప్రభావంతో సముద్రంలో అలలు సాధారణం కంటే మీటరు ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి. శ్రీకాకుళం జిల్లాలో గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. ఉత్తరకోస్తాలో మిగిలిన ప్రాంతాల్లో  50 నుంచి 70 కి.మీ. వేగంతో గాలులు వీచాయి.


కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ రేవుల్లో  ప్రమాద హెచ్చరికలను ఎగురవేశారు. శ్రీకాకుళం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఉద్దానం ప్రాంతంలో అరటి, కొబ్బరి పంటలకు నష్టం వాటిల్లింది. రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఆరు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. తీరప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. నాగావళి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. తోటపల్లి ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో పెరగడంతో 10 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. జంఝావతి, సువర్ణముఖి, వేగావతి, చంపావతి, గోస్తనీ నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. భోగాపురంలో సముద్రం పది మీటర్ల మేర ముందుకొచ్చింది. అత్యధికంగా గార మండలంలో 149 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉభయ గోదావరి, దక్షిణ కోస్తా, రాయలసీమలో చెదురుమదురు జల్లులు పడ్డాయి. 


తీవ్ర వాయుగుండంగా తుఫాన్‌ 

తీరం దాటిన తుఫాన్‌ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. కళింగపట్నానికి 50 కి.మీ దూరంలో, గోపాల్‌పూర్‌కు 170 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. సోమవారం ఉత్తరకోస్తాలో భారీ భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


రెండు పడవలు బోల్తా 

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు వస్తున్న పడవ సముద్రంలో బోల్తా పడింది. ఐదుగురు ఒడ్డుకు చేరుకున్నారు. మరొకరు గల్లంతయ్యారు. మరో సంఘటనలో విజయనగరం జిల్లాకు మత్స్యకారుల పడవ బోల్లా పడింది. వీరంతా తీరానికి చేరుకున్నారు. కాగా, తుఫాన్‌ ప్రభావంతో రైల్వే అధికారులు సోమవారం కొన్ని రైళ్లను రద్దు చేశారు. జగదల్‌పూర్‌-భువనేశ్వర్‌ (08445), జునాగఢ్‌ రోడ్డు-భువనేశ్వర్‌ (02098), గుణుపూర్‌-రూర్కెలా (08128) ప్రత్యేక రైలును రద్దు చేశారు. 


తక్షణ సహాయం చేస్తాం: మోదీ

గులాబ్‌ తుఫాన్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, కేంద్రం నుంచి తక్షణ సహాయం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆదివారం ముఖ్యమంత్రి జగన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని పీఎం మోదీ ట్వీట్‌ చేశారు. ‘గులాబ్‌ తుఫాన్‌ పరిస్థితి గురించి వైఎస్‌ జగన్‌తో మాట్లాడాను. కేంద్రం నుంచి సహాయాన్ని తక్షణం అందేటట్లు చూస్తామని హామీ ఇచ్చాను. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అని మోదీ ట్వీట్‌ చేశారు. తుఫాన్‌ ప్రభావంపై అప్రమత్తంగా ఉన్నామని, ప్రభావిత ప్రాంతాల జిల్లాల కలెక్టర్లు, యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని మోదీకి జగన్‌ చెప్పారు.