Abn logo
Sep 28 2021 @ 11:10AM

గులాబ్ తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్రపై తీవ్రం

గులాబ్ తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్రపై తీవ్రంగా ఉంది. విశాఖ ఏజెన్సీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలో చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో చెదురు ముదురు జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. గులాబ్ తుఫాన్ పశ్చిమ దిశగా పయనిస్తూ.. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంవల్ల ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.


విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. మరో 24 గంటలపాటు వర్షాలు కురుస్తాయని, తర్వాత తుఫాన్ క్రమంగా కదులుతూ అరేబియా సముద్రంలో కేంద్రీకృతమయ్యే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాబోయే 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల వర్షాలు పడతాయని నిపుణులు చెప్పారు. 


గులాబ్‌ తుఫాన్‌ కోస్తాను ముంచేసింది. రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో సోమవారం కుంభవృష్టి కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తీర ప్రాంతంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో అనేక చోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు లక్షన్నర ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. విశాఖ నగరంలో 24 గంటల్లో 350 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళంలో అనేక గ్రామాల్లో అంధకారం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు మృతి చెందగా, ముగ్గురు గల్లంతయ్యారు.  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరపి లేకుండా వాన పడింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. అనేక చోట్ల పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమగోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం-ఏలూరు మధ్య రోడ్డు కోతపడింది.


శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు లక్షా 63వేల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు ముంపునకు గురైనట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వరి, మొక్క జొన్న, పత్తి, ఉద్యాన పండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉత్తరాంధ్రలోని అనేక చెరువులకు గండ్లు పడ్డాయి. పొలాలన్నీ జలమయఛయ్యాయి. వంశధార, నాగావళి, వేదావతి, ఇతర చిన్న నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పంటలన్నీ నీట మునిగి అపార నష్టం వాటిల్లింది. పంట నష్టాలపై వ్యవసాయ మంత్రి కన్నబాబు ఫోన్‌లో అధికారులతో మాట్లాడారు. పరిహారాన్ని ఉదారంగా అందించాలని సూచించారు.  విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో ఇల్లు కూలి ఒకరు, చెట్టు మీద పడటంతో మరొకరు దుర్మరణం పాలయ్యారు. గుర్ల మండలంలో చెరువులో పడి వృద్ధుడు మృతిచెందారు. గజపతినగరం బీసీ కాలనీకి చెందిన బలరాం(70) చంపావతి నదిలో ప్రమాదవశాత్తూ కాలు జారి పడి గల్లంతయ్యారు. విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలోని వేపగుంట అప్పలనరసయ్య కాలనీలో గోడ కూలి భావన (35), పెందుర్తి శివారు సుజాతనగర్‌లోని ఒక ఇంట్లో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా బాలుడు మృతిచెందాడు. గాజువాక సుందరయ్య కాలనీలో చేపల వేటకు వెళ్లిన కె.వంశీరెడ్డి(14) కాలు జారి కాలువలో పడి ప్రవాహంలో గల్లంతయ్యాడు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో డ్రైనేజీలో వృద్ధుడి మృతదేహం కొట్టుకొచ్చింది. 

ఇవి కూడా చదవండిImage Caption