న్యూఢిల్లీ : నీతీ ఆయోగ్ ఎగుమతి సన్నద్ధత సూచీ, 2021లో గుజరాత్ అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా నిలిచాయి. ఎగుమతి చేయడానికి రాష్ట్రాల సన్నద్ధత, పనితీరు ఆధారంగా ఈ సూచీని రూపొందించారు. ఈ నివేదికను నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్ శుక్రవారం విడుదల చేశారు.
ఈ సూచీలో గుజరాత్, మహారాష్ట్ర 1, 2 స్థానాల్లో నిలవడం ఇది వరుసగా రెండోసారి. తాజా సూచీలో గుజరాత్‌కు 78.86 పాయింట్లు లభించాయి. మహారాష్ట్రకు 77.14 పాయింట్లు లభించాయి. ఆంధ్ర ప్రదేశ్ 9వ స్థానంలో నిలిచింది. తెలంగాణా 10వ స్థానంలో ఉంది.
నీతీ ఆయోగ్ నాలుగు ప్రధాన అంశాల ఆధారంగా ఈ సూచీని రూపొందించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ర్యాంకులను ఇస్తుంది. విధానాలు, వ్యాపార అనుకూల వ్యవస్థ, ఎగుమతుల సానుకూలత, ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ - అనే ప్రధాన అంశాల ఆధారంగా దీనిని రూపొందిస్తుంది. వీటికి అదనంగా 11 అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. అవి ఏమిటంటే, ఎగుమతుల ప్రోత్సాహక విధానం, సంస్థాగత నిబంధనావళి, వ్యాపార వాతావరణం, మౌలిక సదుపాయాలు, రవాణా సదుపాయాల అనుసంధానం, ఆర్థిక వనరుల అందుబాటు, ఎగుమతుల మౌలిక సదుపాయాలు, వ్యాపార మద్దతు, పరిశోధన, అభివృద్ధి మౌలిక సదుపాయాలు, ఎక్స్పోర్ట్ డైవర్సిఫికేషన్, గ్రోత్ ఓరియెంటేషన్.
తీర ప్రాంతంలో ఉన్న చాలా రాష్ట్రాలు ఉత్తమ పనితీరును కనబరచినట్లు ఈ సూచీనిబట్టి తెలుస్తోంది. ఎగుమతుల ప్రోత్సాహానికి మూడు ప్రధాన సవాళ్లు ఉన్నాయని వెల్లడవుతోంది. ఎగుమతుల మౌలిక సదుపాయాల్లో ప్రాంతాల స్థాయిలో వ్యత్యాసాలు ఉన్నాయని, రాష్ట్రాల్లో గ్రోత్ ఓరియెంటేషన్, వ్యాపారానికి మద్దతు బలహీనంగా ఉందని; కాంప్లెక్స్, యూనిక్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ కోసం ఆర్ అండ్ డీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో లేదని తెలిసిందని ఈ నివేదిక పేర్కొంది.
ఎగుమతులను అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య పోటీ తత్వాన్ని తేవడమే లక్ష్యంగా నీతీ ఆయోగ్ ఈ సూచీని రూపొందించింది.
ఇవి కూడా చదవండి