రైజర్స్‌ జోరుకు బ్రేక్‌!

ABN , First Publish Date - 2022-04-28T10:27:27+05:30 IST

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐదు వరుస విజయాల జోరుకు గుజరాత్‌ టైటాన్స్‌ బ్రేకులు వేసింది.

రైజర్స్‌ జోరుకు బ్రేక్‌!

ఉమ్రాన్‌ శ్రమ వృథా

ఉత్కంఠ పోరులో గుజరాత్‌ గెలుపు

సాహా అర్ధ శతకం.. పేలిన రషీద్‌


ముంబై: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐదు వరుస విజయాల జోరుకు గుజరాత్‌ టైటాన్స్‌ బ్రేకులు వేసింది. ఆఖరి బంతి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ఉమ్రాన్‌ (5/25) ఐదు వికెట్లతో చెలరేగినా.. ఆఖర్లో రషీద్‌ (11 బంతుల్లో 4 సిక్స్‌లతో 31 నాటౌట్‌) విధ్వంసంతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. మొత్తం 14 పాయింట్లతో టాప్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (42 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65), మార్‌క్రమ్‌ (40 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56) అర్ధ శతకాలు వృథా అయ్యాయి. షమి మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం గుజరాత్‌ 20 ఓవర్లలో 199/5 స్కోరు చేసి నెగ్గింది. సాహా (38 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 68), తెవాటియా (21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్‌) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. 


ఓపెనర్ల శుభారంభం..

ఛేదనలో ఓపెనర్లు సాహా, గిల్‌ (22).. గుజరాత్‌కు శుభారంభం అందించారు. ముఖ్యంగా హైదరాబాద్‌ బౌలర్లపై ఎదురుదాడి చేసిన సాహా.. గిల్‌తో కలసి తొలి వికెట్‌కు 69 పరుగులు, మిల్లర్‌ (17)తో కలసి మూడో వికెట్‌కు 37 పరుగుల భాగస్వామ్యాలతో జట్టును గెలుపు బాటలో నిలిపాడు. అయితే, 8వ ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన ఉమ్రాన్‌.. తన వరుస ఓవర్లలో గిల్‌తోపాటు హార్దిక్‌ పాండ్యా (10) అవుట్‌ చేశాడు. కట్‌షాట్‌ ఆడే క్రమంలో గిల్‌ బౌల్డ్‌ కాగా.. షార్ట్‌ బాల్‌తో పాండ్యాను బోల్తాకొట్టించాడు. కాగా, సాహాను కూడా ఉమ్రాన్‌.. గంటకు 152 కి.మీ వేగవంతమైన సూపర్‌ యార్కర్‌తో బౌల్డ్‌ చేశాడు. అయుతే, విజయానికి చివరి 30 బంతుల్లో 61  పరుగులు కావాల్సి ఉండగా.. మిల్లర్‌, అభినవ్‌ మనోహర్‌ (0)ను బౌల్డ్‌ చేసిన ఉమ్రాన్‌ మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చాడు. కానీ, రషీద్‌తో కలసి తెవాటియా పోరాడాడు. నటరాజన్‌ వేసిన 19వ ఓవర్‌లో 4,6 బాదిన తెవాటియా.. ఆఖరి ఓవర్‌లో విజయానికి 22 పరుగులుగా సమీకరణాన్ని మార్చేశాడు. ఇక, జాన్సెన్‌ వేసిన 20వ ఓవర్‌లో రషీద్‌ 3 సిక్స్‌లతో మోతెక్కించాడు. ఆఖరి బంతికి 3 పరుగులు అవసరం కాగా.. సిక్స్‌తో ఫినిష్‌ చేశాడు. 


ఆదుకొన్న అభిషేక్‌..

ఆరంభంలో తడబడినా.. అభిషేక్‌, మార్‌క్రమ్‌ అర్ధ శతకాలతోపాటు శశాంక్‌ సింగ్‌ (6 బంతుల్లో ఫోర్‌, 3 సిక్స్‌లతో 25 నాటౌట్‌) హ్యాట్రిక్‌ సిక్స్‌లతో సన్‌రైజర్స్‌ సవాల్‌ విసరగలిగే స్కోరు చేసింది. టాస్‌ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ను.. పవర్‌ప్లేలో షమి దెబ్బతీశాడు. ఓపెనర్‌ విలియమ్సన్‌ (5)ను బౌల్డ్‌ చేసిన షమి.. తన ఓవర్‌లో సిక్స్‌, రెండు ఫోర్లతో ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తున్న రాహుల్‌ త్రిపాఠి (16)ని ఎల్బీ చేశాడు. కానీ, మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ.. మార్‌క్రమ్‌తో కలసి జట్టును ఆదుకొన్నాడు. పవర్‌ప్లే ముగిసే సరికి హైదరాబాద్‌ 53/2తో నిలిచింది. అభిషేక్‌ డేర్‌గా షాట్లు ఆడుతూ పరుగుల వేగం పెంచగా.. మార్‌క్రమ్‌ స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ మంచి సహకారం అందించాడు. జోసెఫ్‌ వేసిన 11వ ఓవర్‌ చివరి బంతిని మార్‌క్రమ్‌ సిక్స్‌కు తరలించగా.. ఆ తర్వాతి ఓవర్‌లో రషీద్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ రెండు సిక్స్‌లతో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో టీమ్‌ స్కోరు కూడా సెంచరీ దాటింది. అయితే, జోరు మీదున్న అభిషేక్‌ను బౌల్డ్‌ చేసిన జోసెఫ్‌.. మూడో వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. ధాటిగా ఆడతాడనుకున్న పూరన్‌ (3), హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న మార్‌క్రమ్‌, సుందర్‌ (3) స్వల్ప తేడాతో అవుట్‌ కావడంతో.. హైదరాబాద్‌ ఆశించిన స్కోరు చేస్తుందా? అనే అనుమానం కలిగింది. కానీ, ఫెర్గూసన్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో జాన్సెన్‌ (8 నాటౌట్‌), శశాంక్‌ నాలుగు సిక్స్‌లతో 25 పరుగులు రాబట్టడంతో.. జట్టు స్కోరు 195 పరుగులకు చేరింది. 


స్కోరుబోర్డు

హైదరాబాద్‌ : అభిషేక్‌ (బి) జోసెఫ్‌ 65, విలియమ్సన్‌ (బి) షమి 5, త్రిపాఠి (ఎల్బీ) షమి 16, మార్‌క్రమ్‌ (సి) మిల్లర్‌ (బి) యశ్‌ దయాళ్‌ 56, పూరన్‌ (సి) గిల్‌ (బి) షమి 3, సుందర్‌ (రనౌట్‌/జోసెఫ్‌) 3, శశాంక్‌ (నాటౌట్‌) 25, జాన్సెన్‌ (నాటౌట్‌) 8, ఎక్స్‌ట్రాలు 14, మొత్తం 20 ఓవర్లలో 195/6; వికెట్ల పతనం : 1/26, 2/44, 3/140, 4/147, 5/161, 6/162, బౌలింగ్‌: షమి 4-0-39-3, యశ్‌ దయాల్‌ 4-0-24-1, అల్జరీ 4-0-35-1, రషీద్‌ 4-0-45-0, ఫెర్గూసన్‌ 4-0-52-0 

గుజరాత్‌ : సాహా (బి) ఉమ్రాన్‌ 68, శుభ్‌మన్‌ (బి) ఉమ్రాన్‌ 22, హార్దిక్‌ (సి) జాన్సెన్‌ (బి) ఉమ్రాన్‌ 10, మిల్లర్‌ (బి) ఉమ్రాన్‌ 17, తెవాటియా (నాటౌట్‌) 40, అభినవ్‌ మనోహర్‌ (బి) ఉమ్రాన్‌ 0, రషీద్‌ (నాటౌట్‌) 31, ఎక్స్‌ట్రాలు 11, మొత్తం 20 ఓవర్లలో 199/5; వికెట్లపతనం : 1/69, 2/85, 3/122, 4/139, 5/140 ; బౌలింగ్‌ : భువనేశ్వర్‌ 4-0-33-0, జాన్సెన్‌ 4-0-63-0, నటరాజన్‌ 4-0-43-0, సుందర్‌ 4-0-34-0, ఉమ్రాన్‌ మాలిక్‌ 4-0-25-4.

Updated Date - 2022-04-28T10:27:27+05:30 IST