Abn logo
May 22 2020 @ 00:25AM

కరోనా విపత్తులో గుజరాత్ నమూనా!

మహాత్మా గాంధీ జన్మభూమి గుజరాత్. కాల వాహినిలో లుప్తమైన గాంధేయ విలువలను పునరుజ్జీవింపచేసుకునేందుకు గాను ‌గుజరాత్‌కు కరోనా సంక్షోభం మరో అవకాశాన్ని సమకూర్చింది. సంకుచిత ధోరణులకు అతీతంగా సమ్మిళిత సామూహిక స్ఫూర్తితో వ్యవహరించడం, కేవలం ధనార్జననే గర్వకారణంగా భావించక దానితోపాటు మానవాభివృద్ధికీ సమున్నత ప్రాధాన్యమివ్వడమే  విస్మృత గాంధేయ విలువల స్ఫూర్తి. ఇదే నిజమైన ‘గుజరాత్ నమూనా’. స్వప్నించి, శ్రమించవలసిన ‘ఉజ్వల గుజరాత్’ అది.


‘భారతదేశపు అత్యుత్తమ పాలన, ఆకర్షణీయమైన అభివృద్ధి గుజరాత్‌లో కనిపిస్తున్నాయి’- ఇది, దాదాపు పది సంవత్సరాల క్రితం నరేంద్ర మోదీ పాలనకు అమెరికా ఇచ్చిన కితాబు. ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి, మన ప్రస్తుత ప్రధానమంత్రి జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించి, ప్రధానమంత్రి పదవినధిష్టించడానికి విశేషంగా దోహదం చేసిన ‘గుజరాత్ నమూనా’ కరోనా కాలంలోనూ ఆశాదీపాలను వెలిగిస్తుందా? కొన్ని వాస్తవాలను పరిశీలనలోకి తీసుకుందాం.


కరోనా వైరస్ కేసులు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్న రాష్ట్రాలలో గుజరాత్ ఒకటి. మరింత ఆందోళనకరమైన విషయమేమిటంటే గుజరాత్‌లో కరోనా మరణాల రేటు జాతీయ సగటు కంటే ఎక్కువ (అహ్మదాబాద్‌లో ఈ మరణాల రేటు 6.7 శాతం. ఇది జాతీయ సగటు కంటే అధికం); పాలనాదక్షుడైన అహ్మదాబాద్ మునిసిపల్ కమిషనర్‌ను హఠాత్తుగా తొలగించారు. కరోనా వ్యాధి నిర్ధారిత పరీక్షలను మరీ ఎక్కువగా నిర్వహిస్తున్న కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని బదిలీ చేసిందని స్థానిక మీడియా వెల్లడించింది; అహ్మదాబాద్ ప్రభుత్వాసుపత్రిలో కరోనా రోగులకు మత ప్రాతిపదికన వార్డులను ఏర్పాటు చేసినట్టు ఒక జాతీయ దినపత్రిక వెల్లడించింది.


రాష్ట్ర ప్రభుత్వం ఈ వార్తను ఖండించింది. కరోనా కేసులు పెరిగిపోవడానికి తబ్లీఘ్ జమాత్ కారణమని ముఖ్యమంత్రి రూపానీ ఆరోపించారు; సూరత్‌లోని వలస కూలీలు కేవలం నెల రోజుల వ్యవధిలో మూడు వేర్వేరు సందర్భాలలో పోలీసులతో హింసాత్మకంగా ఘర్షణ పడ్డారు. దేశంలో వలసకూలీలు అత్యధికసంఖ్యలో వున్న నగరాలలో సూరత్ ఒకటి; రాజ్ కోట్‌లో తమ రైలును రద్దుచేసినందుకు ఆగ్రహానికి లోనైన వలస కూలీలు కొంతమంది స్థానిక టీవీ జర్నలిస్టు ఒకరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పోలీసులు మౌన ప్రేక్షకులలా వుండిపోయారు!; గుజరాతీ వెబ్‌సైట్ జర్నలిస్ట్ ఒకరిపై దేశ ద్రోహ నేరం మోపారు. ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి, పార్టీ అధిష్టానంతో విభేదాలున్నాయని వెల్లడించడమే ఆ జర్నలిస్టు నేరం!


21వ శతాబ్ది భారతదేశానికి ‘నమూనా’గా పేరు పొందిన రాష్ట్రం లో పరిస్థితులు ఇలా దిగజారిపోవడానికి కారణ మేమిటి? నిజమేమిటంటే ‘గుజరాత్ నమూనా’ అద్భుతమైనది కాదు. 2001-–14 సంవత్సరాల మధ్య ఆసేతు హిమాచలం దాని గురించి జరిగిన ప్రచారం సూచించిన విధంగా గుజరాత్ అభివృద్ధి సాధించలేదు. ‘వైబ్రాంట్ గుజరాత్’ (ఉజ్వల గుజరాత్) వార్షిక సదస్సులలో పారిశ్రామిక వేత్తలు, రాష్ట్ర ప్రభుత్వం వందలాది ఎంవోయులపై సంతకాలు చేయడాన్ని ప్రజలు చూశారు. అయితే ఇది, కథలో ఒక చిన్న భాగం మాత్రమే. వ్యాపార వర్గాలకు అత్యంత అనుకూల ప్రభుత్వమనే పేరు ప్రతిష్ఠలను గుజరాత్ సర్కార్ సాధించుకున్నది.


అందుకు తగ్గట్టుగానే రోడ్లు, నౌకాశ్రయాలు, విద్యుదుత్పాదన మొదలైన మౌలిక సదుపాయాలను ఇతోధికంగా అభివృద్ధి పరచడం జరిగింది. అలాగే వ్యవసాయ రంగం పెరుగుదల రేటు కూడా గణనీయంగా పెరిగింది. అభివృద్ధి వెలుగులు విస్తరించిన మాట నిజమే. అయితే కొన్ని రంగాలు అంధకారంలోనే వుండిపోయిన వాస్తవాన్ని విధేయ మీడియా గానీ, వీరారాధకులైన పౌరులు గానీ ప్రశ్నించనే లేదు. ఈ అలసత్వమే ఇప్పుడు గుజరాత్ నమూనాను ప్రశ్నార్థకం చేసింది. ముఖ్యంగా ప్రజారోగ్య రంగంలో పరిస్థితులను మెరుగుపరచడంలోనూ, సకల సామాజిక వర్గాలనూ భాగస్వామలుగా చేసుకునే పాలనా వ్యవస్థను నిర్మించడంలో గుజరాత్ నమూనా విఫలమయింది. 


గుజరాత్‌లో ప్రతి 1000మందికి 0.33 ఆసుపత్రి పడకలు వున్నాయి. ఈ అంశంలో జాతీయ సగటు 0.55 కావడం గమనార్హం. సామాజిక రంగంలో మదుపుల విషయంలో గుజరాత్ దేశంలో చాలా క్రింది స్థానంలో ఉందని రిజర్వ్ బ్యాంక్ నివేదిక ఒకటి పేర్కొంది. ఆరోగ్య భద్రతకు సంబంధించి తలసరి వ్యయంలో గుజరాత్ 1999-–2000లో 4వ స్థానం నుంచి 2009–-10లో 11వ స్థానంలోకి జారిపోయింది. అదే దశాబ్ద కాలంలో ఆరోగ్యభద్రతపై వ్యయం నికర రాష్ట్ర దేశియోత్పత్తిలో 0.87 నుంచి 0.73 శాతానికి పడిపోయింది. శిశు మరణాలరేటు చాలా హెచ్చు స్థాయిలో వున్నది. దీన్ని బట్టి సామాజిక సంక్షేమ రంగాన్ని ఎంతగా ఉపేక్షించిందో విశదమవుతుంది. గుజరాత్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్య బిహార్‌లో కంటే చాలా తక్కువ అని సంజీవ్ కుమార్ (టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్) పరిశోధనలో వెల్లడయింది. గుజరాత్ గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వాసుత్రుల కంటే మూడు రెట్లు ఎక్కువ ప్రభుత్వాసుపత్రులు బిహార్ పల్లె సీమలలో ఉన్నాయని కూడా ఆ పరిశోధకుడు పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాలలో పలు ప్రభుత్వాసు పత్రులను ప్రైవేట్ వైద్య రంగానికి అప్పగించడం జరిగింది. చెప్పవచ్చినదేమిటంటే దృఢమైన ప్రజారోగ్య వ్యవస్థను అభివృద్ధి పరచడంలో గుజరాత్ నమూనా విఫలమయింది.


వైద్య రంగంలోనే కాదు విద్యారంగంలో పరిస్థితులను మెరుగుపరచడంలో కూడా ఈ ‘ఘనమైన’ నమూనా సాధించింది స్వల్పం. విద్యపై గుజరాత్ ప్రభుత్వ వ్యయం ఆ రాష్ట్ర ఆదాయంలో రెండు శాతం కంటే తక్కువగా ఉన్నది. గుజరాత్ శ్రామిక ప్రజలలో దాదాపు సగం మంది నిరక్షరాస్యులు. మహా అయితే ఐదవ తరగతి దాకా చదివిన వారు మాత్రమే. ఉన్నత విద్యలో నాణ్యత కొరవడింది. ఫలితంగానే నిరుద్యోగులైన ఇంజనీర్లు, సైన్స్ గ్రాడ్యుయేట్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని ఆర్థిక వేత్త ప్రొఫెసర్ ఇందిరా హీర్వే పేర్కొన్నారు. గుజరాత్ శ్రామిక ప్రజలలో 90 శాతం మంది అనియత, సంప్రదాయ రంగాలలో వున్నారు వారికి ఆదాయాలు తక్కువ, సామాజిక భద్రత మరీ తక్కువ. వేతనరేట్లు స్వల్పంగా ఉన్న ప్రధాన రాష్ట్రాలలో గుజరాత్ ఒకటి. మరి సూరత్‌లో వలస కార్మికులు పోలీసులపై తిరగబడడంలో ఆశ్చర్యమేముంది? యజమానులు కనీసమాత్రంగానైనా ఆదుకోవడానికి అంగీకరించకపోవడంతో దినసరి కూలీపై బతుకుతున్నవారు తమ గ్రామాలకు తిరిగి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. వీరిలో చాలా మంది తమ రైలు టిక్కెట్ల చార్జీలను సొంతంగా భరించుకోకతప్పలేదు. కష్టపడి ఆర్జించి ఎలాగో పొదుపు చేసుకున్న స్వల్ప మొత్తాలను ప్రయాణ ఖర్చులకు వినియోగించుకున్నారు. కాయకష్టంపై బతికేవారు ఇలాంటి దురవ్థలకులోనుకావడం ఎంత విషాదకరం! ప్రభుత్వ విధానాలకే కాదు వ్యాపార వర్గాల సాంస్కృతిక, నైతిక విలువలకు కూడా ఇదొక అభిశంసనగా పరిగణించితీరాలి.


ఈ పరిస్థితులను ప్రశ్నించిన వారు లేకపోలేదు. పేదల పట్ల పాలకుల, రాజకీయ వేత్తల ఉదాసీనతను తీవ్ర స్థాయిలో గర్హించిన వారు పలువురు వున్నారు. అయితే వారిని వెలివేతకు గురిచేశారు. మరింత ఘోరమైన విషయమేమిటంటే కొందరిపై దేశద్రోహ అభియోగాలనూ మోపడం జరిగింది. అధికారాల కేంద్రీకరణతో ఎలాంటి భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు ఆస్కారం లేకపోయింది. పేదలపక్షం వహించినవారిని ముఖ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించిన పాత్రికేయులపై దేశద్రోహ ఆరోపణలు చేయడం గుజరాత్‌లో ఇదే మొదటిసారి కాదు. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తనకు తాను ఒక విశిష్ట వ్యక్తిగా, అద్వితీయ నాయకుడిగా ప్రచారం కల్పించుకుని ప్రజల మనస్సుల్లో సుప్రతిష్ఠుడయ్యాడు. ప్రత్యర్థులకు ఎలాంటి ప్రాధాన్యం లేకపోయింది. వారిని వామనులుగా పరిగణించారు. తిరుగులేని విధంగా వ్యక్తిపూజ వర్ధిల్లింది.


మోదీ తరువాత ముఖ్యమంత్రులయినవారికి ఆయనకు ఉన్న ప్రజాకర్షక శక్తి పూర్తిగా కొరవడింది. అయితేనే, విధాన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన పద్ధతులనే అనుసరించారు. కరోనా వైరస్ వ్యాప్తికి తబ్లీఘీలే కారణమని ముఖ్యమంత్రి రూపానీ ఆరోపించడం ఒక విధంగా ఉహించిందేనని చెప్పవచ్చు. చాలా సంవత్సరాలుగా గుజరాత్ అధికార రాజకీయ వ్యవస్థ మైనారిటీ వర్గాలపై ఒక ప్రగాఢ అయిష్టతతో వ్యవహరిస్తూ వస్తోంది. ఆ అయిష్టత ఇంచు మించు విద్వేష స్థాయికి చేరింది. గుజరాత్ నగరాలు, పట్టణాలలో హిందూ -ముస్లింల మధ్య గతంలో కానరాని కన్పించని భౌగోళిక సరిహద్దులు ఇటీవలి సంవత్సరాల్లో స్పష్టంగా కన్పించసాగాయి. 2002 అనంతరం గుజరాతీల మానసిక ప్రపంచంలో ఒక నిర్దిష్ట మతతత్వ పక్షపాతం అంతర్నిహితమైపోయింది. ముస్లిం అయిన వ్యక్తి ఒక శాశ్వత ‘అంతర్గత శత్రువు’గా గుజరాతీల మనస్సులో ముద్రపడిపోయాడు. కనుకనే కరోనా వైరస్ను కట్టడి చేయడంలో సతమతమవుతున్న పాలకులు ఆ మహమ్మారి వ్యాప్తికి తబ్లీఘీలను ఒక సాకుగా చూపగలిగారు. 


కరోనా సంక్షోభం గుజరాత్‌కు ఒక విధంగా మేలు కొలుపు. వ్యవస్థానిర్మాణ దక్షత పుష్కలంగా ఉన్న రాష్ట్రమది. మరింత సమున్నతస్థాయికి ఎదగాలన్న ఆకాంక్షాయుత మధ్యతరగతి ప్రజలకు కొదవ లేని సమాజమది. అయితే కుల మత అంతరాలు, ఆదాయాలలో అసమానతలు అంతకంతకూ పెరిగిపోతూ గుజరాత్ పురోగతికి ఎనలేని హాని చేస్తున్నాయి. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిత్వ కాలంలో గుజరాత్ అస్మిత (ఆత్మగౌరవం)ను ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. అయితే అదే కాలంలో ‘వైబ్రాంట్ గుజరాత్’ (ఉజ్వల గుజరాత్)లో భాగస్వాములు కాలేకపోయిన సామాజిక వర్గాలవారు మరింతగా అన్నివిధాలా వెనుకపడిపోవడమూ సంభవించింది. మహాత్మా గాంధీ జన్మ భూమి గుజరాత్. కాల వాహినిలో లుప్తమైన గాంధేయ విలువలను పునరుజ్జీవింపచేసుకునేందుకు గాను గుజరాత్‌కు కరోనా సంక్షోభం మరో అవకాశాన్ని సమకూర్చింది. సంకుచిత ధోరణులకు అతీతంగా సమ్మిళిత సామూహిక స్ఫూర్తితో వ్యవహరించడం, కేవలం ధనార్జననే గర్వకారణంగా భావించక దానితోపాటు మానవాభివృద్ధికీ సమున్నత ప్రాధాన్యమివ్వడమే విస్మృత గాంధేయ విలువల స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని ఆవాహన చేసుకోవాలి. జీవితాచరణలోకి తెచ్చుకోవాలి. ఇదే నిజమైన ‘గుజరాత్ నమూనా’. స్వప్నించి, శ్రమించవలసిన ‘ఉజ్వల గుజరాత్’ అది.


రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Advertisement
Advertisement
Advertisement